Banks: బ్యాంకులకు ఈ ప్రమాద హెచ్చరికలు ఎందుకు..?

ద్విచక్రవాహనాల అమ్మకాలు ఎందుకు పడిపోయాయి? శక్తికాంతదాస్, నిర్మల హెచ్చరికలు వ్యాపార పత్రికల్లో ప్రధాన హెడ్లైన్స్‌గా ఎందుకు మారుతున్నాయి? బ్యాంకుల ప్రమాద హెచ్చరికలపై ఆర్థికవేత్త డీ.పాపారావు విశ్లేషణ కోసం ఆర్టికల్‌ చదవండి. హెడ్డింగ్‌పై క్లిక్‌ చేస్తే ఆర్టికల్‌ చదవవచ్చు!

New Update
Banks: బ్యాంకులకు ఈ ప్రమాద హెచ్చరికలు ఎందుకు..?

దేశ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులకూ, బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థలకూ తాజాగా ఓ హెచ్చరిక చేసారు. ఇదేవిధమైన హెచ్చరికను, కొద్దిరోజుల క్రితమే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాశ్ చేసివున్నారు. వీరిద్దరి హెచ్చరికల సారాంశం ఒక్కటే.! ఇటు బ్యాంకులూ, అటు బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థలూ కూడా అతిగా రుణాలు ఇచ్చి ప్రమాదంలో పడవద్దనేదే వారి మాటల సారాంశం. అత్యుత్సాహంతో ఇబ్బడిముబ్బడిగా రుణాలు మంజూరు చేసేయరాదన్నది వారిద్దరి ఉవాచ. ముఖ్యంగా వ్యక్తిగత రుణాలూ (ఈ తరహా క్రిందకు వినియోగ అవసరాల రుణాలు, విద్యా రుణాలు, గృహ రుణాలు వంటివి వస్తాయి)... బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ రుణ సంస్థలకు ఇచ్చే మొత్తాలూ... అలాగే క్రెడిట్ కార్డ్ రుణాల విషయంలో జాగ్రత్తగా వుండమంటూ శక్తికాంత దాస్ హెచ్చరించారు.

ఆయన ప్రకారంగా ఫైనాన్స్ రంగంలో స్థిరాత్వాన్ని గ్యారెంటీ చేసుకునేందుకు - ఈ ముందస్తు జాగ్రత్త చర్యలు అవసరం. దీనిలో భాగంగా బ్యాంకింగ్ సంస్థలు తాము ప్రస్తుతం వినియోగదారులకు ఇచ్చే రుణాల విషయంలో - రక్షణ కవచంగా, వెనుకతట్టున నిల్వవుంచుతున్న నగదు మొత్తాన్ని మరింతగా పెంచవలసిందిగా సూచిస్తున్నారు. ప్రధానంగా ఇటువంటి రుణాలను రాబట్టుకోవడం విషయంలో రిస్క్ పెరిగిందనేది అటు రిజర్వ్ బ్యాంక్... ఇటు ఆర్ధిరమంత్రివర్యుల మాటల సారాంశం. అలాగే, అమెరికా ఈ విషయంలో చేసిన తప్పును మనం తిరిగి చేయోద్దంటూ శక్తికాంతదాస్ అన్నారు.

ఈ మాటల మొత్తం సారాంశం ఏమిటి.? అసలు వ్యక్తిగత రుణాలూ, క్రెడిట్కార్డు రుణాల విషయంలో - వాటి వసూళ్ళ తాలూకు రిస్క్ ఎందుకు పెరిగింది.? దీని అర్ధం ఒక్కటే...! ఇటువంటి రుణాలు తీసుకునేవారి చెల్లింపు సామర్థ్యం క్షీణించింది... ఇది మాత్రమే ఇక్కడ నిజం.!! తిరిగి రుణాలు చెల్లించగలిగేటందుకు సామాన్య ప్రజల ఆర్ధిక స్థితిగతులు ఇక ఏమాత్రమూ సహకరించడం లేదన్నది ఇక్కడి వాస్తవం. మరి దీనికి కారణం ఏమిటి.?

కొద్ది సంవత్సరాలుగా దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగం, చిన్న వ్యాపారుల దివాళాలు, పెరుగుతున్న ధరలు - దానితో పడిపోతున్న కొనుగోలుశక్తి వంటివన్నీ కలగలిసి నేడు మన ప్రజల ఆర్ధికశక్తిని కుంగదీసాయి. ఈ క్రమంలో భాగంగానే - మన మధ్యతరగతి ప్రజానికం గత కొన్ని సంవత్సరాలుగా తమ కుటుంబ అవసరాల కోసం - తాము ఇంతవరకు పొదుపుచేసుకున్న మొత్తాలను ఊడ్చిపెట్టి, బ్రతుకు ఈడ్చవల్సివచ్చింది. ఫలితంగా నేడు దేశంలో ప్రజల పొదుపుమొత్తం స్థూల జాతీయ ఉత్పత్తిలో కేవలం 5 శాతంగా వుంది. ఇది, దశాబ్దాల కనీష్ట స్థాయి. అంతేకాకుండా, అనేకానేకమంది కుటుంబీకులు తమ అవసరాల కోసం - తాము కూడబెట్టిన బంగారాన్ని బ్యాంకులూ... ఇతర సంస్థలలో కుదవ పెట్టుకున్నారు. చివరకు, నేడు ఇటువంటి అనేకమంది తాము కుదవపెట్టిన బంగారానికి సంబంధించి - వడ్డీలు కూడా కట్టలేని స్థితిలో - ఆ బంగారం నేడు వేలానికి వస్తుంటే, నిస్సహాయంగా చూస్తూవుండిపోయే పరిస్థితిలో పడిపోయారు. అదీ విషయం...!

ఈ మొత్తం నేపథ్యంలోనే, వ్యక్తిగత రుణాల స్వీకరణ, క్రెడిట్‌కార్డ్‌ దరఖాస్తులూ, వినియోగం కూడా పెరిగిపోయాయి. రోజురోజుకూ దిగజారుతున్న జన సామాన్యం ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా తాము తీసుకున్న ఈ రుణాలను తీర్చలేని స్థితిలోకి జనాలు నెట్టివేయబడుతున్నారు. ఈ క్రమంలోనే సిబిల్ సంస్థ గణాంకాల ప్రకారంగా - జూన్ 2023 నాటికీ 50వేల రూపాయలలోపు రుణాలకు సంబంధించిన మొండి బకాయిలూ 5.4శాతానికి పెరిగిపోయాయి. కాగా, గత సంవత్సరం అదేకాలం నాటికి ఈ మొండి బకాయిలు 4.2% గా వున్నాయి. మరోరకంగా చెప్పాలంటే, ఈ వ్యక్తిగత రుణాలవంటి - ఎటువంటి హామీలు లేకుండా తీసుకుంటున్న రుణాల మంజూరులు రెండు సంవత్సరాలుగా 23% చొప్పున పెరుగుతున్నాయి. కాగా, ఇతరేతర తరహా రుణ మంజూరులు కేవలం 12-14 శాతం మేరకే పెరుగుతున్నాయి.

ఇటువంటి హెచ్చరికలూ... వాటి నేపథ్యంలో దాగివున్న దేశీయ, ఆర్థిక దుస్థితికీ తార్కాణాలు అనేకం. ఉదాహరణకు ఈ మధ్యనే వచ్చిన గణాంకాలైన - దేశంలో ఒకపక్కన ఖరీదైన లగ్జరీ కార్ల అమ్మకాలు రికార్డుస్థాయిలో పెరుగుతుండగా, మరోప్రక్కన సాధారణ మధ్యతరగతి ప్రజలూ, గ్రామీణ ప్రజానికం అధికంగా కొనే ద్విచక్రవాహనాల అమ్మకాలు పడిపోయాయి. ఇక రెండవది : 45 లక్షల రూపాయల లోపు ఖరీదుగల గృహాల అమ్మకాలు తగ్గుముఖం పట్టగా, రెండో ప్రక్కన కోట్ల రూపాయల విలువ చేసే ఖరీదైన గృహాల అమ్మకాలు భారీస్థాయిలో పెరుగుతున్నాయి. ఇక అలాగే, స్విస్ లగ్జరీ చేతిగడియారాల నుంచి మొదలుకుని ఇతరత్రా అనేకరకాల లగ్జరీ ఉత్పత్తుల అమ్మకాలు దేశంలో పెరిగిపోతున్నాయి. మరోప్రక్కన కోటానుకోట్ల జనసామాన్యం జీవితాలు చితికిపోతున్నాయి. ఈ క్రమంలోనే - మనదేశం నేడు ప్రపంచ ఆకలిబాధితులు అధికంగా ఉన్న దేశాల సూచీలో తన ర్యాంకును మరింత దిగజార్చుకుంది... అదీ కథ..! ఒక దేశంలోనే రెండు దేశాల కథ..!!

కాగా, ఈ కథ తాలూకు ఈ విషాద మలుపులో - పరిమితమైన, కొద్దిపాటి తమ అవసరాల కోసం బ్యాంకులను ఆశ్రయించి - వ్యక్తిగత రుణాలు తీసుకుంటోన్న వారు విలన్లు అవుతున్నారు. ఇటువంటి వారు ఎవరికీ ఇకముందు అంత సులువుగా రుణాలు ఇచ్చేయొద్దంటూ ప్రమాదమంటూ నేడు మన ఆర్బీఐ గవర్నర్... ఆర్ధిక మంత్రలు శెలవిస్తున్నారు. అయితే, ఇటువంటి హెచ్చరికలు గతంలో ఇష్టానుసారంగా ... ఎగగొట్టడమే పరమావధిగా ఈ బ్యాంకుల నుంచి బడా కార్పొరేట్ పెద్దమనుషులు రుణాలు తీసుకుంటున్నప్పుడు - ఎప్పుడూ సన్నగా కూడా లేదా గుసగుసగా కూడా ఈ పెద్దల నుంచి వినపడ్డట్టుగా లేదు. మించి, లక్షల కోట్ల రూపాయల ఈ కార్పొరేట్ రుణాలు ఎటువంటి హడావుడి లేకుండానే మొండి బకాలుగా మారిపోయి ఆ తర్వాత ఒక “శుభదినాన” .. రైటాఫ్ లుగా రూపాంతరం చెంది... కాలగర్భంలో కలిసిపోతోన్న నిజాన్ని సామాన్యుడు ఇంకా దిగమింగుకుంటున్నాడు. అదీ సంగతి.!

ఇక నేడు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలలో బ్యాంకింగ్ంగం తీవ్ర ఒత్తిడికింద వుంది. సిలికాన్వ్యాలీ బ్యాంకు పతనంతో మొదలైన ఈ ఒత్తిడి నేడు మరింత తీవ్రతరం అవుతోంది. సెప్టెంబర్ త్రైమాసికం నాటి గణాంకాలు అమెరికా, యూరోపియన్ దేశాలలోని బ్యాంకుల సమస్యలు అంచుకు చేరుతున్నాయని చెబుతున్నాయి. బహుశా.. రానున్న డిసెంబర్తో ముగిసే త్రైమాసికం తాలూకు గణాంకాలు మరో 'లెహ్మన్' క్షణానికి అమెరికా, యూరోపియన్ బ్యాంకింగ్ రంగాన్ని దిగజార్చినా ఏమాత్రం ఆశ్చర్యంలేదు. 2008లో ఏర్పడిన ఫైనాన్స్ సంక్షోభకాలంలో అమెరికాలోని వాల్ట్ బడా బ్యాంకులన్నీ దివాళాల పాలయ్యాయి. ఈ దివాళాల పరంపర మొట్టమొదటగా - లెహ్మన్ బ్రదర్స్ సంస్థ దివాళ ప్రకటనతో మొదలయ్యింది. ప్రస్తుతం అమెరికా, యూరోపియన్ యూనియన్ బ్యాంకులు తిరిగి అదే దిశగా వెళుతున్నట్టుగా కనబడుతోంది.

నాడు, ఆ సంక్షోభం తాలూకు ప్రభావం భారత బ్యాంకులకు సోకలేదు. దీనికికారణం మన దేశీయ బ్యాంకులు - రుణాల మంజూరు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించడం. ఈ బ్యాంకులు ప్రభుత్వరంగంలో వుండటం వల్లనే - అవి రుణ మంజూరులో ఇష్టానుసారం వ్యవహరించలేదని - ఫలితంగానే మన బ్యాంకులు క్షేమంగా మిగిలాయని - నాటి ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా చెప్పారు. కాగా, ఇప్పటికే మన బ్యాంకులు, మన ప్రభుత్వం తాలూకు విఫల యత్నాల తరువాత - ఇంకా ప్రభుత్వరంగంలోనే వున్నాయి. కానీ, అడ్డగోలు కార్పొరేట్ రుణాలు, ఈ బ్యాంకుల మొండి బకాయిలను పెంచివేసాయి. 'బ్యాడ్ బ్యాంక్' పేరిట ఈ మొండి బకాయిలను లెక్కల నుంచి పూర్వపక్షం చేసే ప్రయత్నం మొండి బకాయిల సమస్యను పరిష్కరించలేక పోతోంది.

స్థూలంగా సంస్కరణల అనంతరకాలంలో - మన జాతీయ బ్యాంకులు జన సామాన్యానికీ... మధ్య తరగతికీ... గ్రామీణ రైతాంగానికీ కూడా దూరమైపోయాయి. అవి, ధనవంతులకు, కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. ఈ దుస్థితే నేడు మన బ్యాంకింగ్ రంగ సమస్యలకు కారణం. నిజానికి, సామాన్య జనమే తాము బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చక్కగా చెల్లిస్తారంటూ గతంలో ఆర్ధికమంత్రిగా వున్న చిదంబరం... తరువాతి కాలంలో అరుణ్ జెట్లీ కూడా అంగీకరించారు. కాగా నేడు బ్యాంకింగ్ రంగ కడగండ్లకు ఈ జన సామాన్యం రుణాలుగా తీసుకునే కాస్తంత చిల్లర డబ్బులే కారణమంటూ చూపే ప్రయత్నం బహుశా జరుగుతోంది. అందుచేతనే శక్తికాంతదాస్, నిర్మలా సీతారామన్ల హెచ్చరికలు నేడు వ్యాపార పత్రికల హెడ్లైన్స్ అవుతున్నాయి. కార్పొరేట్ రుణ ఎగవేతలు... రైటాఫ్లూ... మన పాలక పెద్దల నుంచి ఎటువంటి ప్రకటనలకూ... హెచ్చరికలకూ నోచుకోకపోవడం ఇక్కడ గమనార్హం...! రేపు ఏదన్న ఆర్థికరంగంలో జరగరానిది జరిగితే నిందించేందుకో ‘ముద్దాయి' లేదా, 'నేరస్థుడు' సిద్ధం చేయబడుతున్నాడు. పెద్దమనుషులు ఎప్పుడూ తప్పులు చేయరు. అలగాజనం అన్ని తప్పులకు బాధ్యులు..!! ఇదీ ఈ కథ సారాంశం...!!!

డి. పాపారావు
9866179615
[email protected]

ALSO READ: ఈ పరిణామాలను కేసీఆర్‌ ఊహించలేదా?

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు