Telangana: ప్రజల అభిప్రాయాలే రైతు భరోసా జీవోగా వస్తుంది-భట్టి రైతుల ఆలోచనల మేరకే రైతు భరోసా పథకం ఉంటుందని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతు భరోసాను గత పాలకులు దుర్వినియోగం చేశారని అన్నారు. సాగు యోగ్యమైన భూములకే తమ ప్రభుత్వం భరోసా ఇస్తుందని తెలిపారు. ఆగస్టులోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పారు. By Manogna alamuru 16 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Deputy CM Bhatti: రైతు భరోసా పథకం అమలు, విధి విధానాలకు సంబంధించి అన్నదాతల సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం హనుమకొండ కలెక్టరేట్లో జరిగింది. మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులు, రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు భరోసా పథకం ఎలా ఉంటే అందరికీ ప్రయోజనంగా ఉంటుందన్న దానిపై అన్నదాతల నుంచి సలహాలు స్వీకరించారు. ఈ సందర్భంగా తమది ప్రజా ప్రభుత్వం అన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అందరి అభిప్రాయాలు తీసుకోవడానికే రాష్ట్రవ్యాప్తంగా రైతులతో కార్యశాలలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పన్ను రూపంలో ప్రజలు ప్రభుత్వానికి కట్టే ప్రతి రూపాయి, తిరిగి ప్రజలకే చెందాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలే జీవోగా వస్తుందని, శాసనసభలో చర్చించి, అందరి అభిప్రాయలను తీసుకుని, చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆగస్టులోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. గతంలో రైతులు పంట నష్టపోతే సాయం అందలేదని, కానీ తమ ప్రభుత్వం అన్నదాతలకు రూ.10 వేలు ఇచ్చి ఆదుకుందని తెలిపారు. పంట నష్టం జరిగితే ప్రతి ఒక్క రైతుకూ పంట బీమా రావాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో బీమా పథకం వర్తింపజేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఓవైపు అప్పులు తీరుస్తూ, సంక్షేమం, అభివృద్ధి చేపడుతుంటే, ప్రధాన ప్రతిపక్షం రైతులను, నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. పది జిల్లాల రైతుల ఆలోచనల మేరకే రైతు భరోసా పథకం ఉంటుందని తెలిపారు. ఐటీ రిటర్న్స్ ఉంటే రైతు బీమా రాదన్నది తప్పుడు ప్రచారమేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. రైతుబంధు పథకాన్ని గత పాలకులు దుర్వినియోగం చేసి, రూ.లక్షల ప్రజాధనం వృథా చేశారని ఆరోపించారు. సాగు యోగ్యమైన భూములకే భరోసా అందిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క అన్నారు. నాలుగు గోడల మధ్య ఉండి నిర్ణయాలు తీసుకుని, ఇదే అందరి అభిప్రాయమని చెప్పకుండా, క్షేత్రస్థాయిలో అందరి సలహాలు, సూచనలతో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు పథకం విధి విధానాల రూపకల్పనలో తమ అభిప్రాయాలు తీసుకునేందుకు మంత్రులు తమ వద్దకే రావడం సంతోషకర పరిణామమని రైతులు హర్షం వ్యక్తం చేశారు. 10 ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా అందించాలని మెజారిటీ రైతులు సమావేశంలో అభిప్రాయపడ్డారు. దీనితో పాటుగా పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, బోనస్ ఇవ్వాలని, రైతు సమస్యలపై రైతు కమిషన్ వేయాలని, కోతుల బెడద తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. Also Read:Andhra Pradesh: తాబేళ్ళను అక్రమంగా తరలిస్తున్నముఠా అరెస్ట్.. #telanagna #rythu-bharosa #deputy-cm-bhatti-vikramarka మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి