/rtv/media/media_files/2025/01/26/oL1vuAKcr0FmQHLjVgsD.jpg)
mp crime Photograph: (mp crime )
అతనికి అప్పటికే పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పిల్లాపాపలతో సంతోషంగా ఉండకుండా మరో యువతిపై కన్నేశాడు. ప్రేమిస్తున్నానని ఆమెను ముగ్గులోకి దింపాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి సహజీవనం స్టార్ట్ చేశాడు. ఇలా ఐదేళ్లు బాగానే నడిపించాడు. ఓ రోజు మనోడి కథంతా బయటపడింది. దీంతో ఏంటీ ఇదంతా అని ఆమె గట్టిగా నిలదీసింది . తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. అందుకు అతను నిరాకరించాడు. ఎలాగైనా ఆమె అడ్డు తొలగించుకోవాలనుకుని ఆమెను చంపి ఇంట్లోనే గత 8 నెలలుగా ఫ్రిడ్జ్లో పెట్టి ఇల్లు ఖాళీ చేశాడు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే.. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో చోటుచేసుకుంది.
ఉజ్జయినికి చెందిన సంజయ్ పాటిదార్‌కు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ విషయాన్ని దాచిపెట్టి ప్రతిభ అనే మరో అమ్మాయిని లవ్ లోకి దించి 2023 జూన్ లో ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. ఉద్యోగ నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్తున్నట్లు చెప్పి భార్య, పిల్లల వద్దకు వెళ్లేవాడు. ఇలా ఐదేళ్లు ఇల్లాలు, ప్రియురాలితో జీవనం కొనసాగించాడు. అయితే గతేడాది మేలో ప్రతిభకు సంజయ్ అసలు స్వరూపం తెలిసింది. దీంతో అతడిని నిలదీసి.. తనను పెళ్లి చేసుకోమని కోరింది. లేదంటే పోలీసులకు చెబుతానని బెదిరించింది. దీంతో ప్రతిభను చంపేయాలని సంజయ్ ప్లాన్ చేశాడు. ఇదే విషయాన్ని తన స్నేహితుడికి చెప్పగా అతడు కూడా సాయం చేశాడు.
ప్రతిభ గొంతు నులిమి
ప్లాన్ ప్రకారం 2024 జూన్‌లో ప్రతిభ గొంతు నులిమి చంపేశాడు సంజయ్. మృతదేహన్ని బయట పడేస్తే విషయం తెలిసిపోతుందని ఇంట్లోని ఫ్రిడ్జ్ లోనే ఉంచాడు. వాసన బయటకు రాకుండా ఉండేందుకు కూలింగ్ ఎక్కువగా పెట్టాడు. ఆ తరువాత ఇళ్లు ఖాళీ చేస్తున్నానని చెప్పి ఓనర్ కు ఫోన్ చేశాడు. అయితే అన్ని సామాన్లను ఒక్కసారే తీసుకెళ్లలేనని.. కొన్ని ఇక్కడే ఉంచుకుంటానని, అందుకు అద్దె కూడా చెల్లిస్తానని చెప్పగా యజమాని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
కొన్ని రోజులు ఈ కథను కూడా బాగానే నడిపించిన సంజయ్.. ఇంటి అద్దె మాత్రం చెల్లించడం మానేశాడు. దీంతో ఓనర్ కోపంతో ఇంటి తలుపులు పగులగొట్టి పలు సామాన్లను బయట పడేశాడు. ఈ క్రమంలో ఇంట్లో ఆన్ లో ఉన్న ఫ్రిడ్జ్ను ఆప్ చేసి వెళ్లాడు ఓనర్. దీంతో మరుసటి రోజు ఆ గది నుంచి దుర్వాసన రావడంతో పక్కింటి వాళ్లు ఓనర్ కు సమాచారం ఇచ్చారు. దీంతో ఫ్రిడ్జ్లో ఏముందో అని చూడగా అమ్మాయి శవం ఉండటం చూసి షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కేసు నమోదు చేసుకుని నిందితుడు సంజయ్ ను కొన్ని గంటల్లోనే అరెస్ట్ చేశారు. ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు లాగే ఈ ఘటన ఉండటం స్థానికులను భయాబ్రాంతులకు గురిచేసింది.