/rtv/media/media_files/2026/03/18/friend-muder-2026-03-18-20-34-46.jpg)
హర్యానాలో దారుణం జరిగింది. రంగుల పండుగ హోలీ పూట జరిగిన చిన్నపాటి గొడవ కాస్తా ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. తన ప్రియురాలికి రంగులు పూశాడన్న కోపంతో, ఒక కిరాతకుడు తన స్నేహితుడిని అతి దారుణంగా హతమార్చాడు. హర్యానాలోని పానిపట్ జిల్లా మహమూద్‌పూర్ గ్రామానికి చెందిన సంజు, అదే గ్రామానికి చెందిన కలు (23) మంచి స్నేహితులు. అయితే, వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా బైక్ యాక్సిడెంట్‌కు సంబంధించిన నష్టపరిహారం విషయంలో వివాదం నడుస్తోంది. గతంలో కలు తన స్నేహితుడైన సంజు బైక్‌ను తీసుకువెళ్లి ప్రమాదానికి గురిచేయడంతో బైక్ దెబ్బతిన్నది. దీనిపై ఇద్దరి మధ్య పాత కక్షలు ఉన్నాయి.
ఈ క్రమంలో మార్చి 4న హోలీ వేడుకల సందర్భంగా, సంజు ప్రియురాలికి కలు రంగులు పూశాడు. ఇది చూసి తట్టుకోలేకపోయిన సంజు, తన ప్రియురాలి జోలికి వచ్చిన కలును అంతం చేయాలని నిశ్చయించుకున్నాడు. కలును చంపేందుకు సంజు తన అనుచరులైన రాహుల్, విశాల్‌తో కలిసి పక్కా స్కెచ్ వేశాడు. పథకం ప్రకారం, హోలీ వేడుకల తర్వాత కలును పిలిపించి అందరూ కలిసి మద్యం సేవించారు. కలుకు మత్తు తలకెక్కేలా అతిగా మద్యం తాగించారు. పూర్తిగా స్పృహ కోల్పోయిన అతడిని బైక్‌పై పానిపట్‌లోని రైలు పట్టాల వద్దకు తీసుకెళ్లారు.
అక్కడ సంజు క్రూరంగా ప్రవర్తించాడు. తన వద్ద ఉన్న స్క్రూడ్రైవర్‌తో కలు మెడపై రెండుసార్లు బలంగా పొడిచాడు. అయినా కలు ప్రాణాలు పోకపోవడంతో, నిందితులు మరింత దారుణానికి ఒడిగట్టారు. కదులుతున్న రైలు కింద పడి చనిపోయేలా, కలు కాళ్లు, చేతులు పట్టుకుని రైల్వే పట్టాల మధ్యలో పడుకోబెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. కొద్దిసేపటికే వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో కలు శరీరం ఛిద్రమై అక్కడికక్కడే మరణించాడు.
కేసు ఛేదించిన పోలీసులు
హోలీ రోజున కలు అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టాల వద్ద మృతదేహం లభ్యం కావడంతో మొదట దీనిని రైలు ప్రమాదంగా పోలీసులు భావించారు. అయితే, మృతుడి మెడపై ఉన్న గాయాలు అనుమానాలకు తావిచ్చాయి. పోలీసులు సాంకేతిక ఆధారాలు మరియు నిందితుల మొబైల్ ఫోన్ లొకేషన్ డేటాను విశ్లేషించగా అసలు నిజం బయటపడింది. పోలీసులు జరిపిన విచారణలో సంజు తన నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు ప్రధాన నిందితుడు సంజుతో పాటు రాహుల్, విశాల్‌ను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
Follow Us