CM KCR: ఆ 10 మందికి కేసీఆర్‌ షాక్‌.. టికెట్‌ లేనట్లేనంటూ సంకేతాలు!

తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరిగే శాసనసభ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్‌ బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్‌ ప్రకటించారు. కాని నియోజకవర్గాల్లో క్యాడర్‌ నుంచి వస్తున్న వ్యతిరేకత.. సీనియర్ లీడర్ల నిరసనలతో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల్లో 10 మందికి బీఫారం కష్టమేననే వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్‌ నేత, ఆర్థిక మంత్రి హరీష్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మల్కాజ్‌గిరి అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావును మారుస్తారనే ప్రచారం ఉన్నా.. ఆయనతో పాటు మరో 9మందికి గులాబీ బాస్‌ నో చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

New Update
CM KCR: ఆ 10 మందికి కేసీఆర్‌ షాక్‌.. టికెట్‌ లేనట్లేనంటూ సంకేతాలు!

తెలంగాణ ఎన్నికలకు మూడు నెలల ముందే 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపర్చిన బీఆర్‌ఎస్‌ (BRS) బాస్‌ కేసీఆర్‌.. 10 మందికి షాక్‌ ఇవ్వనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దాదాపు ఏడుగురు మినహా మిగిలిన సిట్టింగ్‌లకు సీట్లని ప్రకటించడంతో అంతా ఆనందంతో పండుగ చేసుకున్నారు. అయితే వాళ్ల సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. మీకు సీట్లు లేనట్లేనంటూ కేసీఆర్‌ సంకేతాలివ్వడంతో వారంతా లబోదిబోమంటున్నారు. ముందుగానే 18 నుంచి 25 మంది సిట్టింగ్‌లకు సీట్లు కష్టమేనంటూ ప్రచారం సాగింది. ఆ ప్రచారానికి భిన్నంగా ఏడుగురుని మాత్రమే మారుస్తూ.. సీఎం కేసీఆర్‌ లిస్ట్‌ ప్రకటించారు. కాని నియోజకవర్గాల్లో క్యాడర్‌ నుంచి వస్తున్న వ్యతిరేకత.. సీనియర్ లీడర్ల నిరసనలతో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల్లో 10 మందికి బీఫారం కష్టమేననే వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్‌ నేత, ఆర్థిక మంత్రి హరీష్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మల్కాజ్‌గిరి (Malkajgiri) అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావును మారుస్తారనే ప్రచారం ఉన్నా.. ఆయనతో పాటు మరో 9మందికి గులాబీ బాస్‌ నో చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

సిట్టింగ్‌లకే సీట్లు ఇద్దామని కేసీఆర్‌ భావించి అవకాశం ఇచ్చినప్పటికి.. సర్వే సంస్థల నివేదికలు, సీట్ల ప్రకటన తర్వాత స్థానిక పరిస్ధితులను అంచనా వేసిన కేసీఆర్‌.. అభ్యర్థిని మార్చకపోతే గెలిచే సీటు ఓడిపోతామనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత చాలా నియోజకవర్గాల్లో టికెట్‌ ఆశించిన నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. మరికొందరు నేతలు పార్టీకి రాజీనామా చేయడంతో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. టికెట్‌ ఆశించిన నాయకులే కాకుండా.. సిట్టింగ్‌లకు సీటివ్వడం పట్ల పార్టీ క్యాడర్‌ కూడా అసంతృప్తిగా ఉండటంతో పది మంది స్థానంలో వేరే వాళ్లకు అవకాశమివ్వాలనే నిర్ణయానికి కేసీఆర్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ తర్వాత ఆ పది మందితో చర్చించి.. నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితులను తెలియజేసి.. పోటీ నుంచి తప్పుకునేలా ఒప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది.

ఆ 10 నియోజకవర్గాలు ఇవే!

సీఎం కేసీఆర్‌ ఇప్పటికే టికెట్‌ ప్రకటించి నిరాకరిస్తున్న నియోజకవర్గాల్లో బెల్లంపల్లి, కోదాడ, మంథని, కొత్తగూడెం, ఇల్లందు, వరంగల్‌ ఈస్ట్‌, మల్కాజ్‌గిరి, కల్వకుర్తి, పెద్దపల్లి, రామగుండం ఉన్నట్లు తెలుస్తోంది. బెల్లంపల్లి ఎమ్మెల్యేగా దుర్గం చిన్నయ్య ఉన్నారు. ఆయనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అలాగే నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉందని, ఆయనకు సీటు వద్దని బీఆర్‌ఎస్‌ అధిష్టానానికి స్థానిక నేతలు ఫిర్యాదు చేశారు. అయినాసరే సీఎం కేసీఆర్‌ మొదటి లిస్ట్‌లో బెల్లంపల్లి నుంచి దుర్గం చిన్నయ్యకు అవకాశం కల్పించారు. అయితే నియోజకవర్గంలో పరిస్థితుల నేపథ్యంలో దుర్గం చిన్నయ్యకు బీఫారం ఇవ్వడం కష్టమని, ఆయన స్థానంలో మరో వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది.

మల్లయ్య యాదవ్‌కు షాక్‌!

కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ పేరును కోదాడ నుంచి ప్రకటించారు సీఎం కేసీఆర్‌.. దీంతో తనకు సీటు వచ్చిందని మల్లయ్య యాదవ్‌ ఆనందంతో సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. మల్లయ్య యాదవ్‌కు సీటు కష్టమంటూ వార్తలొచ్చాయి. అయినా తనకు కచ్చితంగా సీటు వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఫస్ట్‌ లిస్ట్‌లో పేరుండటంతో హ్యాపీ ఫీలయ్యారు. ఈలోపు మల్లయ్య యాదవ్‌ స్థానంలో మరో వ్యక్తికి అవకాశమివ్వాలనే ఉద్దేశంలో గులాబీ బాస్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

మంథని ఎమ్మెల్యే పుట్టా మధు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావ, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌, వరంగల్‌ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యుడు నన్నపనేని నరేందర్‌, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌లకు టికెట్లు నిరాకరించినట్లు తెలుస్తోంది. వీళ్లందరికి మొదటి లిస్ట్‌లో టికెట్లు ఖరారు చేస్తూ సీఎం కేసీఆర్‌ జాబితా ప్రకటించారు. కాని ఎన్నికల సమయానికి ఈ 10 నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను నిలుపుతారనే ప్రచారం జోరందుకుంది.

మరిన్ని వార్తల కోసం చూడండి..

Advertisment
Advertisment
తాజా కథనాలు