/rtv/media/media_files/2025/01/25/xl47Jam9SHWIellFHb0U.jpg)
Padma Vibhshan Balakrishna
ఆయనకు ఎవరైనా ఎదురెళ్ళినా వారికే ప్రాబ్లమ్.. ఎవరికైనా ఆయన ఎదురువెళ్లినా వారికే ప్రాబ్లమ్.. ఐదు దశాబ్దాలు..పదులకొద్దీసినిమాలు.. ఆల్ జోనర్స్.. మామూలు హిస్టరీ కాదిది. ఒక నటశిఖరానికి వారసుడిగా.. వెండితెరపై అడుగుపెట్టిన నాటి నుంచి ఏభైఏళ్లుగా తనదైన ప్రత్యేకమైన ఛరిష్మాతో తెలుగు సినీ వినీలాకాశంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నారు...ఆయనే నందమూరి నటసింహం బాలకృష్ణ. తన ఏళ్ళ సినీ కెరియర్ లో ఆయన టచ్ చేయని జానర్ లేదు. పౌరాణికం.. జానపదం.. సాంఘికం.. సైన్స్ ఫిక్షన్.. వీటిలో మళ్ళీ కామెడీ.. ఎమోషనల్.. యాక్షన్.. ఫాంటసీ అసలు బాలకృష్ణ ఇది చేయలేదు చెప్పడానికి లేదు.
తండ్రి అడుగుజాడల్లో...
సీనియర్ ఎన్టీయార్ అడుగు జాడల్లో సినీ ఇండస్ట్రీకి వచ్చారు. అలా అని ఆయన నీడలోనే ఉండిపోలేదు. తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పరచుకున్నారు. బాలకృష్ణ చేయలేనిది ఏదీ లేదనే పేరును తెచ్చుకున్నారు. కృష్ణుడిగా మెప్పించారు...రాముడిగా కరుణరసాన్ని పండించారు...కృష్ణ దేవరాయలగా రాజసాన్ని ఒలికించారు...అల్లరి బాలయ్యగా మెప్పించారు...ఫ్యాక్షన్ లీడర్ గా రక్తాన్ని పూసుకున్నారు. ఏది చేసినా బాలయ్య తర్వాతనే అనిపించుకున్నారు.
తాతమ్మ కలతో ఎంట్రీ..
50 years: తాతమ్మ కల సినిమాతో 1974లో బాలకృష్ణ సినీ అరంగేట్రం జరిగింది. అక్కడి నుంచి పదేళ్ల పాటు అంటే 1983లో సింహం నవ్వింది వరకూ ఆయన చేసిన సినిమాలన్నీ ప్రత్యేక పాత్రలు.. సపోర్ట్ క్యారెక్టర్స్. అదే సంవత్సరం సోలో హీరోగా సాహసమే జీవితం అంటూ ఎంట్రీ ఇచ్చారు. నిజంగానే ఆ సమయంలో ఆయన సాహసం చేశారు. ఒక పక్క అక్కినేని, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు వంటి సీనియర్స్.. మరోపక్క చిరంజీవి, సుమన్ వంటి అప్పటికే దూసుకుపోతున్న సమకాలీన హీరోలు వీరి మధ్యలో హీరోగా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చారు బాలయ్య. అయితే, అదే ఏడాది వరుసగా డిస్కో కింగ్, జననీ జన్మభూమి సినిమాలు బాలకృష్ణ సినిమాల్లో ఎలా నెగ్గుకు వస్తారో అనిపించేలా చేశాయి. కానీ, 1984లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో మంగమ్మగారిమనవడు సినిమా వచ్చింది. అప్పటి వరకూ తెలుగులో వచ్చిన సినిమాల రికార్డులు తిరగరాసింది. అదే సంవత్సరం కథానాయకుడు సినిమా కూడా బాలకృష్ణకు బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత వరుసగా కుటుంబ కథా చిత్రాలతోనే కనిపిస్తూ వచ్చారు బాలకృష్ణ. 1986 వరకూ అలా అలా సాగింది కెరీర్ మళ్ళీ అప్పుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే వచ్చింది ముద్దుల కృష్ణుడు. మళ్ళీ బ్లాక్ బస్టర్. ఆ తరువాత చాలా కమర్షియల్ సినిమాలు చేసినా.. బాలకృష్ణకు కలిసి వచ్చిన జోనర్ మాత్రం ఫ్యామిలీ జొనరే. ముద్దుల మావయ్య, మువ్వగోపాలుడు, బాలగోపాలుడు, రాముడు భీముడు ఇలా అన్ని సినిమాల్లోనూ కుటుంబ నేపధ్యం ఉన్న కథలే. సరిగ్గా ఇలాంటి సమయంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చింది ఆదిత్య369. టైమ్ లైన్ జానర్ లో సైన్స్ ఫిక్షన్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న సమయంలో ఇలాంటి సినిమా బాలకృష్ణకు సూట్ అవ్వదు..అని అందరూ అన్నారు. కానీ, సినిమా విడుదలయ్యాకా ఇది బాలయ్య కోసమే ప్రత్యేకమైన సినిమా అని చెప్పుకున్నారు. ఇప్పటికీ, ఆ సినిమా బాలకృష్ణ సినిమాల్లో ది బెస్ట్ సినిమాల్లో టాప్ 5లో ఉంటుంది.
పడి లేచిన కెరటం..
ఫ్లాప్ లతో పడిపోయిన ప్రతీసారి...ఇక బాలయ్య పని అయిపోయింది అనుకున్నప్పుడు ఓ కొత్త జానర్ తో వచ్చారు. పెద్ద హిట్ కొట్టి సంచలనాలు సృష్టించారు. సమరసింహారెడ్డి, శ్రీరామరాజ్యం, లెజెండ్ సినిమాలు ఇలా ప్రభంజనం సృష్టించినవే. 2004 నుంచి 2001 వరకు బాలయ్య బాబుకు ఒక్క హిట్ కూడా లేదు. మధ్యలో వచ్చిన సినిమాల్లో ఒకటి అరా ఏవరేజ్ గా మాత్రమే ఆడాయి. అలాంటి టైమ్ లో కూడా ఆయన డీలా పడిపోలేదు. అప్పుడే శ్రీరాముడిగా శ్రీరామరాజ్యం సినిమాతో మళ్ళీ నేనున్నాను.. టాలీవుడ్ షేక్ చేస్తాను అంటూ దూసుకువచ్చారు. తరువాత మళ్ళీ సినిమాలు బోల్తా కొట్టినా.. ఈసారి 2014లో లెజెండ్ సినిమాతో హిస్టరీ క్రియేట్ చేశారు. అక్కడ నుంచి మాత్రం బాలకృష్ణ వెనుదిరిగి చూసుకోలేదు. దాదాపు ఇరవై ఏళ్ళుగా తెలుగు సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ కి మాస్ ఎలివేషన్స్ టచ్ తో వరుసగా హిట్స్ కొడుతూ వస్తున్నారు.
ఒకవైపు సినిమాలు మరొక వైపు రాజకీయాల్లో విజయవంతంగా రాణిస్తూ అఖండంగా సాగుతున్నారు బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టి సమాధానం ఇచ్చిన బాలకృష్ణ.. అటు బుల్లితెరపైన కూడా క్రేజీ స్టార్ అయిపోయారు. బాలయ్య బాబు ఆహా కోసం చేస్తున్న అన్ స్టాపబుల్ ఆయన నట ప్రస్ధానంలానే అన్ స్టాపబుల్ వ్యూయర్స్ ని సాధించి రికార్డులు సృష్టించింది. ఇప్పుడు పద్మ భూషణ్ పురస్కారం కూడా ఆయన్ను వరించింది.