Adolescence: ఇటీవలే విడుదలైన నెట్ ఫ్లిక్స్ సీరీస్ 'Adolescence' విపరీతమైన ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటోంది. ప్రేక్షకుల నుంచి మాత్రమే కాదు భారతదేశంలోని సినీ ప్రముఖులు, యూకే ప్రధాని సైతం కూడా ఈ సీరీస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నటి అలియా భట్, అనురాగ్ కశ్యప్, హన్సల్ మెహతా, సుధీర్ మిశ్రా వంటి సినీ తారాలు షోలో సున్నితమైన కంటెంట్ ని అభినందించారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన దీని గురించే చర్చ నడుస్తోంది. 12 ఏళ్లు పైబడిన పిల్లలతో సహా అన్ని వయసుల వారు తప్పక చూడాల్సిన సీరీస్ గా చెబుతున్నారు. అసలు ఈ సీరీస్ లో ఏముంది? అంతలా ఎందుకు ఆకట్టుకుంటోంది అనేది ఇక్కడ తెలుసుకుందాం..
స్టోరీ
రాత్రికి రాత్రే జీవితం నరకంగా మారే ఒక సాధారణ కుటుంబం కథ.13 ఏళ్ల బాలుడు.. జామీ మిల్లర్ (ఓవెన్ కూపర్) చుట్టూ ఈ సీరీస్ తిరుగుతుంది. అయితే ఒకరోజు కేటీ (ఎమీలియా) అనే బాలిక స్కూల్ పరిసరాల్లో దారుణ హత్యకు గురవుతుంది. ఆమె శరీరంపై ఏడు కత్తిపోట్లు ఉంటాయి. ఈ హత్య కేసులో పోలీసులు జామీని అరెస్టు చేస్తారు. ఆ తర్వాత అతడిని జైల్లో విచారించడం మొదలు పెడతారు. దీంతో ఆ కుటుంబం కథ అంతా మారిపోతుంది. జామీ తల్లిదండ్రులు కుప్పకూలిపోతారు. అసలు నిజంగానే జామీ ఆ నేరం చేశాడా? అందుకు ఏదైనా బలమైన కారణం ఉందా? విచారించే క్రమంలో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? అనే నేపథ్యంలో స్టోరీ సాగుతుంది.
యువతపై ఫోకస్ చేస్తూ..
టీనేజ్ యువత పై సోషల్ మీడియా ప్రభావం, పిల్లలు ఇంటర్నెట్ లో ఏం వెతుకుతున్నారు? వాళ్ళ స్కూల్ లో ఏం జరుగుతుంది? క్లాస్ రూమ్ లో వారి చుట్టూ వాతావరణం ఎలా ఉంటుంది? వాళ్ళను చెడు మార్గం వైపు ప్రభావితం చేస్తున్న అంశాలేటి..? ఇలాంటి అనేక ప్రశ్నలకు తెరలేపేలా ఈ సీరీస్ కొనసాగుతుంది.
ఒకే షాట్ లో ఎపిసోడ్ మొత్తం
అంతేకాదు ఈ సీరీస్ కి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ సిరీస్‌లోని ప్రతి ఎపిసోడ్‌ను ఒకే షాట్‌లో చిత్రీకరించారు. కెమెరా.. రోలింగ్ అని చెప్పిన తర్వాత ఎటువంటి కట్స్ లేకుండా ఎపిసోడ్ అంతా పూర్తిచేశారట. అందుకే దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ సీరీస్ మొత్తం నాలుగు ఎపిసోడ్ లో ఉన్నాయి.
latest-news | telugu-news | cinema-news | Adolescence series