సాగర్ వివాదానికి కారణం కృష్ణా బోర్డు వైఫల్యమే.. ఏపీ జలవనరుల ముఖ్యకార్యదర్శి లేఖ

కృష్ణా బోర్డు వైఫల్యంతోనే సాగర్ డ్యామ్‌ వివాదం తలెత్తిందని ఏపీ జలవనరుల ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ కృష్ణాబోర్డు ఛైర్మన్‌ శివనందన్‌ కమార్‌కు లేఖ రాశారు. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఈరోజు రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానున్నారు.

New Update
సాగర్ వివాదానికి కారణం కృష్ణా బోర్డు వైఫల్యమే.. ఏపీ జలవనరుల ముఖ్యకార్యదర్శి లేఖ

Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద తెలంగాణ,ఏపీ పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ కృష్ణాబోర్డు ఛైర్మన్‌ శివనందన్‌ కమార్‌కు లేఖ రాశారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు రావడానికి కృష్ణా బోర్డు వైఫల్యమే కారణమని తెలిపారు. ఉమ్మడి ప్రాజెక్టులో రాష్ట్రానికి కేటాయించిన నీటిని వాడుకునే అవకాశం కల్పించేలా తెలంగాణ సర్కార్‌ను నియంత్రంచడంలో మీ వైఫల్యంవల్లే మా భూభాగంలోని నాగార్జునసాగర్‌ స్పిల్‌వేలో సగం, కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను గురువారం స్వాధీనం చేసుకున్నామని లేఖలో పేర్కొన్నారు. .

లేఖలో ప్రధానాంశాలు
1. శ్రీశైలం ప్రాజెక్టు (Srisalam Project) నిర్వహణ బాధ్యత కర్నూలు ప్రాజెక్ట్స్‌ సీఈకి, సాగర్‌ నిర్వహణ బాధ్యత ఆ ప్రాజెక్టు సీఈకి అప్పగించారు. 2014 నుంచే తెలంగాణ భూభాగంలోని శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు ప్రాజెక్ట్స్‌ సీఈకి అప్పగించలేదు. అప్పటి నుంచే ఆ ప్రభుత్వమే దాన్ని నిర్వహిస్తోంది. అదే సమయంలో మా భూభాగంలోని సాగర్‌ (Nagarjuna Sagar) కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను సైతం తెలంగాణ తన అధీనంలోకి తీసుకుంది.

2. గత తొమ్మిదేళ్లుగా ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ.. శ్రీశైలాన్ని ఖాళీచేస్తూ సాగర్‌కు తరలించి.. అటు సాగర్‌ ఎడమ కాలువలో తమ పరిధిలోని ఆయకట్టుకు నీళ్లందిస్తూ రాష్ట్ర హక్కులను తెలంగాణ హరిస్తోందని అనేకసార్లు బోర్డుకు ఫిర్యాదు చేశాం. ఈ క్రమంలోనే ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను స్వాధీనం చేసుకోవాలని బోర్డును అనేకసార్లు అభ్యర్థించాం. లేదంటే ఏపీ భూభాగంలోని సాగర్‌ కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను ఏపీకి అప్పగించాలని కోరాం. కానీ వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

3. అక్టోబరు 6న త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సుల మేరకు శ్రీశైలం నుంచి 30 టీఎంసీలు, సాగర్‌ నుంచి 15 టీఎంసీలను ఏపీకి కేటాయిస్తూ కృష్ణా బోర్డు (Krishna River Management Board) అక్టోబరు 9న ఉత్తర్వులిచ్చింది. తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయించింది. ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ యథావిధిగా అదే రోజున ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభించి శ్రీశైలాన్ని తెలంగాణ సర్కార్‌ ఖాళీచేస్తూ వచ్చింది. దీనిపై అప్పుడే బోర్డుకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. దీంతో శ్రీశైలంలో మాకు కేటాయించిన 30 టీఎంసీల్లో కేవలం 13 టీఎంసీలనే వాడుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ చర్యల వల్ల 17 టీఎంసీలను కోల్పోయాం.

4. సాగర్‌ కుడి కాలువ కింద మాకు కేటాయించిన 15 టీఎంసీల్లో ఇప్పటివరకు 5 టీఎంసీలు వాడుకున్నాం. మిగతా 10 టీఎంసీలను వాడుకోనివ్వకుండా సాగర్‌ను తెలంగాణ ఖాళీచేస్తే.. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తాగునీరు అందించడం సవాలుగా మారుతుందనే ఆందోళనతోనే సాగర్‌ స్పిల్‌‎వేను స్వాధీనం చేసుకుని, కుడి కాలువకు నీటిని విడుదల చేసి మా హక్కులను పరిరక్షించుకున్నాం. నీటి విడుదలను ఆపే ప్రశ్నేలేదు.

ఇదిలా ఉండగా.. కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. శనివారం ఉదయం 11 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానున్నారు. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు, సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌లు, సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు ఛైర్మన్లకు లేఖ పంపింది.

Also Read: ఉత్తరకాశీలో భయపెడుతున్న మరో సొరంగం.. దెబ్బతిన్న పంటలు, కాలువలు

Advertisment
Advertisment
తాజా కథనాలు