/rtv/media/media_files/2025/03/30/N9DD96FTyXVKQ0fuIGm6.jpg)
Soujanya Srinivas Photograph: (Soujanya Srinivas)
దాదాపు ఆరేళ్లుగా ఆగిపోయిన కళారత్న (హంస), ఉగాది పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది. శనివారం విజేతల జాబితాను విడుదల చేశారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి అవార్డులను ప్రదానం చేయనున్నారు. రాష్ట్రంలో వివిధ రంగాలకు చెందిన 202 మంది ప్రముఖులకు కళారత్న (హంస), ఉగాది పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. సాహిత్యం, కళలు, జర్నలిజం, హాస్యావధానం, బాల సాహిత్యం, పద్యం, సాంస్కృతిక సేవలు, మిమిక్రీ, బుర్రకథ, హరికథ, నాటకం, సామాజిక సేవ, సినిమా ఇలా అనేక రంగాల్లో ప్రముఖులను అవార్డులకు ఎంపిక చేశారు. ఈమేరకు శనివారం స్పెషల్ సీఎస్ ఆజయ్‌జైన్ ఉత్తర్వులు జారీ చేశారు.
Also read: SLBC tunnel: 37 రోజులవుతున్నా లోకో ఇంజిన్ మాత్రమే బయటకు.. టన్నెల్‌లో దొరకని ఆచూకీ
86 మందికి కళారత్న, 116 మందికి ఉగాది పురస్కారాలు ప్రకటించారు. చివరిగా 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉగాది అవార్డులను అందించింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ పురస్కారాలు ప్రకటించలేదు. మళ్లీ ఆరేళ్ల తర్వాత టీడీపీ ప్రభుత్వం ఉగాది పురస్కారాలను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సాహిత్య విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావుకు కళారత్న అవార్డును ప్రభుత్వం ప్రకటించింది. సినిమా విభాగంలో నటుడు పృథ్వీరాజ్, కొరియోగ్రఫీకి గానూ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయిసౌజన్యకు కళారత్న పురస్కారాలు లభించింది.