GST shock : సెలూన్ షాపు ఓనర్‌ కు జీఎస్టీ షాక్‌.. రూ.72 లక్షలు కట్టాల్సిందే..

పొట్టకూటికోసం చిన్న సెలూన్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ సామాన్యుడికి జీఎస్టీ షాక్‌ ఇచ్చింది. ఏకంగా రూ.72లక్షల జీఎస్టీ బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. అంతా మొత్తం చెల్లించడానికి తానేం వ్యాపారం చేస్తున్నానని అతను లబోదిబో మంటున్నాడు.

New Update
FotoJet (3)

Salon shop owner faces GST shock.

Vijayawada: పొట్టకూటికోసం చిన్న సెలూన్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ సామాన్యుడికి జీఎస్టీ షాక్‌ ఇచ్చింది. ఏకంగా రూ.72లక్షల జీఎస్టీ బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. అంతా మొత్తం చెల్లించడానికి తానేం వ్యాపారం చేస్తున్నానని అతను లబోదిబో మంటున్నాడు.

వివరాల ప్రకారం విజయవాడలోని పంజా సెంటర్‌కు చెందిన పైడాడ శ్రీనివాసరావు అనే వ్యక్తి సుమారు 40 ఏళ్లుగా బార్బర్‌ షాపు నిర్వహిస్తున్నాడు. ఆయన ఆ వృత్తి తప్ప మరో పని చేయడం లేదు. అయినా ఆయనకు ఇటీవల  రూ.72 లక్షల జీఎస్టీ చెల్లించాలని నోటీసులు రావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు.  ఇటీవల ఆయన బ్యాంక్ ఖాతా అకస్మాత్తుగా నిలిచిపోవడంతో (Hold) ఆందోళనతో బ్యాంకుకు వెళ్లిన ఆయనకు బ్యాంక్‌ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ భారీ జీఎస్టీ బకాయి చెల్లిస్తేనే బ్యాంక్‌ అకౌంట్‌ తిరిగి ఒపెన్‌ చేస్తామని చెప్పడంతో నోరు తెరవడం ఆయన వంతయింది.

కాగా, విశాఖపట్నంలో శ్రీనివాసరావు పేరుతో భారీగా స్క్రాప్ ఐరన్ (ఇనుప సామాగ్రి) వ్యాపారం జరిగినట్లు జీఎస్టీ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. దీనికి సంబంధించి పన్ను చెల్లించని కారణంగానే అధికారులు ఆయన ఖాతాను స్తంభింపజేసినట్లు తెలిపారు. అయితే, తనకు విశాఖలో ఎలాంటి వ్యాపారం లేదని, కనీసం అక్కడికి వెళ్లింది కూడా లేదని బాధితుడు వాపోతున్నాడు.  తనకు సెలూన్ పనులు తప్ప  మరే ఇతర వ్యాపారాలు తెలియవని అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది.

అయితే శ్రీనివాసరావుకు తెలియకుండానే ఆయన ఆధార్, పాన్ కార్డులను వినియోగించుకుని ఆయన వ్యక్తిగత వివరాలను సేకరించిన గుర్తు తెలియని వ్యక్తులు, వాటితో దొంగ రికార్డులు సృష్టించి ఈ తరహా మోసానికి పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ తప్పుడు వ్యాపార లావాదేవీల వల్ల ఆయనకు రావాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోవడంతో ఆయనకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో తన నిజాయితీని నిరూపించుకోవడానికి బాధితుడు అధికారుల చుట్టూ తిరుగుతూ తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
 

Advertisment
తాజా కథనాలు