/rtv/media/media_files/2025/03/26/6Hc2x3RSaglcEvTdxxHL.jpg)
Water Bell in Schools
Schools Water Bell : ఎండలు దంచికొడుతున్నాయి. ఎండలకు తోడు వడగాల్పులు కూడా వీస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండవేడిమికి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కొత్తగా ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తరచుగా నీరు తాగే అలవాటు పెంచుకోవడంతో పాటు డీహైడ్రేషన్ (నీటి లోపం) సమస్య నుంచి రక్షణ పొందడం లక్ష్యం. ఒంటిపూట బడుల సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య మూడు సార్లు వాటర్ బెల్ మోగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10 గంటలకు ఫస్ట్ వాటర్ బెల్, 11 గంటలకు సెకండ్ వాటర్ బెల్, 12 గంటలకు థర్డ్ వాటర్ బెల్ మోగించాలని సూచించారు. వాటర్ బెల్ సందర్బంగా టీచర్లు తరగతులు నిలుపుదల చేసి వెంటనే విద్యార్ధులు వాటర్ తాగేవరకు చూడాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: సికింద్రాబాద్‌లో కారు బీభత్సం.. ఇద్దరు స్పాట్ డెడ్!
గత వేసవి కాలంలో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వేడి ప్రభావం కనిపించింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యార్థులు డీహైడ్రేషన్, అలసట, తలనొప్పి, ఒంటినొప్పి వంటి సమస్యలకు గురయ్యారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎండల వల్ల కలిగే అనారోగ్యాలను నివారించేందుకు పాఠశాలల్లో ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా క్లాసెస్ మధ్యలో ప్రత్యేక బెల్ మోగించి విద్యార్థులకు నీరు తాగే అవకాశం కల్పించనున్నారు. పాఠశాలల్లో ఉదయం 10 గంటలకు మొదటి వాటర్ బెల్ మోగుతుంది. ఈ సమయంలో ఉపాధ్యాయులు తరగతులను కాసేపు ఆపి, విద్యార్థులను నీరు తాగమని ప్రోత్సహిస్తారు. మరోసారి 11 గంటలకు, మూడోసారి మధ్యాహ్నం 12 గంటలకు వాటర్ బెల్ మోగుతుంది. ప్రతి బెల్ తర్వాత విద్యార్థులు నీరు తాగడానికి రెండు మూడు నిమిషాల సమయం ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఈ విత్తనాలు తీసుకుంటే బరువు తగ్గుతారు.. జుట్టుకు కూడా ప్రయోజనం
ఈ కార్యక్రమం కేవలం విద్యార్థుల కోసం మాత్రమే కాకుండా ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది కూడా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. తగినంత నీరు తాగడం శారీరక ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో అవగాహన కలిగించేందుకు స్కిట్లు, అవగాహన సమావేశాలు నిర్వహించాల్సిందిగా పాఠశాలలకు సూచనలు ఇచ్చారు. వాటర్ బెల్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం కోసం పాఠశాలలకు కొన్ని ముఖ్యమైన బాధ్యతలు అప్పగించారు. ప్రతి పాఠశాలలో తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలి. అవసరమైన చోట ఆర్.ఓ. ప్లాంట్లు, వాటర్ కూలర్లు లేదా మట్టి కుండలు ఏర్పాటు చేయాలి. నీటి లభ్యతను పర్యవేక్షించి రోజుకు ఒక్కసారి శుభ్రమైన నీటిని నింపడం తప్పనిసరి.
ఇది కూడా చదవండి: Komatireddy Rajagopal Reddy: మా రేవంత్ రెడ్డి చాలా మంచోడు...లేకుంటే....
ప్రతి తరగతి గదిలో “ప్రతి గంటకోసారి నీరు తాగండి – ఆరోగ్యంగా ఉండండి” అనే నినాదాలతో పోస్టర్లు పెట్టాలని సూచించారు. విద్యార్థులు నీటి బాటిళ్లు తెచ్చుకునేందుకు ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. నీటి కొరత లేకుండా నిరంతరం నీరు అందుబాటులో ఉంచే బాధ్యత హెడ్‌మాస్టర్లదే. ఈ కార్యక్రమం పాఠశాలల్లో సమర్థవంతంగా అమలవుతున్నదో లేదో పర్యవేక్షించేందుకు మండల విద్యాశాఖాధికారులు (MEO), క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు (CRP) యాదృచ్ఛిక తనిఖీలు చేపడతారు. పాఠశాల హెడ్‌మాస్టర్లు ప్రతి వారం వాటర్ బెల్ అమలు గురించి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.ఈ వేసవిలో విద్యార్థులు వేడికి గురికాకుండా, ఆరోగ్యంగా ఉండేందుకు ఈ ‘వాటర్ బెల్’ ఒక చిరస్మరణీయమైన కార్యక్రమంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy : రాష్ట్రంలో ఏ ఉప ఎన్నికలు రావు.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు