/rtv/media/media_files/2026/05/15/amca-2026-05-15-13-38-23.jpg)
CM Chandrababu Naidu, Rajnath Singh lay foundation stone for AMCA project in Puttaparthi
ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో యుద్ధ విమానాలు తయారుచేసే రక్షణ రంగ ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పుట్టపర్తి వేదికగా నిర్మించనున్న 'అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్' (AMCA) ప్రాజెక్టును కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు నాయుడు కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. రూ. 15,803 కోట్ల భారీ బడ్జెట్‌తో.. దాదాపు 650 ఎకరాల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతం అంతర్జాతీయ రక్షణ, ఏరోస్పేస్ పటంలో ప్రముఖ స్థానాన్ని నిలుపుకోనుంది.
అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఐదో తరం' యుద్ధ విమానాలను దేశీయంగానే తయారు చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO), ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA) సంయుక్త భాగస్వామ్యంతో ఈ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మంది ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి దొరకనుంది. అలాగే దీని అనుబంధ పరిశ్రమల ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో వేలాది మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి.
Also Read: ఉన్నావ్ అత్యాచార కేసులో కుల్దీప్ సింగ్‌కు బిగ్ షాక్.. ఇక జైల్లోనే
AMCA ప్రాజెక్టు ప్రత్యేకతలు
ఈ ప్రాజెక్టు కింద తయారు చేయనున్న దేశీయ యుద్ధ విమానాలు భారత వైమానిక దళం (IAF) భవిష్యత్తు అవసరాలను తీర్చడంలో అత్యంత కీలకమైనవిగా మారనున్నాయి. ఏఎమ్‌సీఏ అంటే రెండు ఇంజన్లు గల స్టీల్త్ ఫైటర్ జెట్. శత్రువుల రాడార్లకు చిక్కకుండా గగనతలంలో దూసుకెళ్లడమే దీని ప్రత్యేకత. ఇందులో అత్యాధునిక ఏవియానిక్స్, శత్రువుల క్షిపణుల లక్ష్యాలను దారి మళ్లించే వ్యవస్థలు, ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించగల స్మార్ట్ ఆయుధ సంపత్తిని ఈ ఫైటర్ జెట్‌లలో అమర్చనున్నారు.
ప్రపంచంలో చూసుకుంటే ఇప్పుడు అమెరికా (F-22 Raptor, F-35), రష్యా (Su-57), చైనా (J-20) లాంటి కొన్ని దేశాల వద్ద దగ్గరే అయిదో తరం యుద్ధ విమానాల సాంకేతికత అందుబాటులో ఉంది. అయితే ఏపీలోని పుట్టపర్తిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే స్వదేశీ పరిజ్ఞానంతో ఐదో తరం యుద్ధ విమానాలను అభివృద్ధి చేసే అతికొద్ది దేశాల సరసన భారత్ కూడా నిలుస్తుంది. ఇది భారత రక్షణ రంగంలో 'ఆత్మనిర్భర్ భారత్' (స్వయంసమృద్ధి) సాధనకు, అలాగే దేశ రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఓ మైలురాయిగా నిలువనుంది.
Follow Us