Andhra Pradesh 10th Results 2026 : ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల...బాలికలదే పై చేయి

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి (SSC) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది విద్యార్థుల ఉత్తీర్ణతలో గణనీయమైన వృద్ధి కనిపించింది. బాలుర కంటే బాలికలు 5.22 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు.

New Update
FotoJet - 2026-04-30T115006.040

Andhra Pradesh 10th Results 2026

Andhra Pradesh 10th Results 2026 : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి (SSC) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం ఉదయం ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది విద్యార్థుల ఉత్తీర్ణతలో గణనీయమైన వృద్ధి కనిపించింది.  ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు మొత్తం 6,18,131 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 85.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది నమోదైన 81.14 శాతంతో పోలిస్తే ఇది మెరుగైన ఫలితం. బాలికల ఉత్తీర్ణత: 87.90 శాతం.బాలుర ఉత్తీర్ణత: 82.68 శాతం. ఉత్తీర్ణులయ్యారు.బాలుర కంటే బాలికలు 5.22 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించి మరోసారి పైచేయి సాధించారు.
 
రాష్ట్రంలోని 12,089 పాఠశాలల నుండి విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. పార్వతీపురం మన్యం జిల్లా 96.07 శాతంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 57.02 శాతం ఉత్తీర్ణత నమోదైంది.రాష్ట్రవ్యాప్తంగా 2,161 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణతను సాధించి రికార్డు సృష్టించాయి.ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫలితాల్లో స్పష్టమైన మెరుగుదల కనిపించింది. గత ఏడాది 72.8 శాతంగా ఉన్న ఉత్తీర్ణత, ఈసారి 78.39 శాతానికి పెరిగింది. విద్యార్థుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ పునరుద్ఘాటించారు.


విద్యార్థులు తమ ఫలితాలను ఇలా చూసుకోవచ్చు

అధికారిక వెబ్‌సైట్: www.results.bse.ap.gov.in.
వాట్సాప్: 'మన మిత్ర' నంబర్ 9552300009కు ‘Hi’ అని సందేశం పంపడం ద్వారా.
మొబైల్ యాప్స్: LEAP యాప్, డిజీ లాకర్ యాప్ ద్వారా కూడా ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.
ఓపెన్ స్కూల్: ఏపీ ఓపెన్ స్కూల్ SSC మరియు ఇంటర్ ఫలితాలను apopenschool.ap.gov.in లో చూడవచ్చు.
విజయ సాధించిన విద్యార్థులను అభినందించిన మంత్రి లోకేశ్, ఫెయిల్ అయిన వారు నిరాశ చెందకుండా ధైర్యంగా సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

సప్లిమెంటరీ పరీక్షలు , ఫీజు వివరాలు

పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థుల కోసం విద్యాశాఖ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. మే 25 నుండి జూన్ 4 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. దీనికి గాను మే 1 నుండి మే 9 వరకు సాధారణ ఫీజుతో చెల్లించవచ్చు.లేట్ ఫీజు 50 రూపాయల జరిమానాతో మే 10 నుండి మే 25 వరకు అవకాశం ఉంది.తమ మార్కులపై అసంతృప్తి ఉన్న విద్యార్థులు రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ కోసం మే 1 నుండి మే 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్ ఫీజుగా ఒక్కో సబ్జెక్టుకు రూ. 500. చెల్లించాలి. రీవెరిఫికేషన్ ఫీజు ఒక్కో సబ్జెక్టుకు రూ. 1000 కు చెల్లించాలి.

Advertisment
తాజా కథనాలు