Andhra Pradesh:  కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు ఉపాధి హామీ కూలీలు దుర్మరణం!

తెల్లవారితే చాలు రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద బతుకులు..రోజులాగే పొట్టకూటి కోసం ఉపాధి హామీ పనులకు బయలుదేరారు.ఇంటి నుంచి రోడ్డుపైకి వచ్చిన కాసేపటికే వారి జీవితాలు తెల్లారిపోయాయి. మృత్యువు టిప్పర్ లారీ రూపంలో దూసుకొచ్చి నలుగురు మహిళా కూలీలను బలితీసుకుంది.

New Update
FotoJet - 2026-05-16T085846.813

Tipper hits workers in Kakinada

Andhra Pradesh:  తెల్లవారితే చాలు రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద బతుకులు.. రోజులాగే పొట్టకూటి కోసం ఉపాధి హామీ పనులకు బయలుదేరారు. ఇంటి నుంచి రోడ్డుపైకి వచ్చిన కాసేపటికే వారి జీవితాలు తెల్లారిపోయాయి. మృత్యువు టిప్పర్ లారీ రూపంలో దూసుకొచ్చి నలుగురు మహిళా కూలీలను బలితీసుకుంది. కాకినాడ జిల్లాలో శనివారం (మే 16, 2026) ఉదయం జరిగిన ఈ ఘోర దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. కాకినాడ రూరల్ పరిధిలోని కొవ్వూరు బ్రిడ్జి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున కొందరు కూలీలు రోజువారీ ఉపాధి హామీ పనుల్లో పాల్గొనేందుకు ఇళ్ల నుంచి బయలుదేరారు. వీరంతా కొవ్వూరు బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతుండగా.. అదే సమయంలో అటుగా అత్యంత వేగంగా, అజాగ్రత్తగా దూసుకొచ్చిన ఒక టిప్పర్ లారీ కూలీలపైకి దూసుకెళ్లి బలంగా ఢీకొట్టింది. లారీ వేగం చాలా ఎక్కువగా ఉండటంతో కూలీలు రోడ్డుపై చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. లారీ చక్రాలు పైనుంచి వెళ్లడంతో తీవ్ర రక్తస్రావమై నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

 ఈ ఘోర ప్రమాదంలో దుర్మరణం చెందిన వారిలో వాసంశెట్టి సత్యవతి (60), పాలిక కృష్ణవేణి (35), చిట్టెమ్మ (45),  చెల్లూరి అన్నవరం (45)లు ఉన్నారు.ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు కూలీలు మట్టపర్తి అరుణ కుమారి, పాలిక నాగమణిలను స్థానికులు, పోలీసులు కలిసి తక్షణమే కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి (GGH) తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర విభాగంలో చికిత్స అందుతుండగా.. వీరి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఉపాధి పనులకని వెళ్లిన తమ వారు కొద్దిసేపటికే శవాలై పడి ఉండటం చూసి మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. వారి రోదనలు అక్కడి వారిని కలచివేశాయి. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీ డ్రైవర్ కోసం దర్యాప్తు ప్రారంభించారు.

Advertisment
తాజా కథనాలు