Aarogyasri: ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. ఆ కార్డుతో లింకు పెట్టొద్దంటూ ఆదేశాలు!

రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుతో లింకు పెట్టొద్దని అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని కలెక్టర్లను సూచించారు. హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

New Update
Aarogyasri: ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. ఆ కార్డుతో లింకు పెట్టొద్దంటూ ఆదేశాలు!

Telangana: తెలంగాణ ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన అంశంపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుతో లింకు పెట్టొద్దని సూచించారు. అయితే రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలి. ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు.

రూరల్ ఏరియాలో పనిచేసే వైద్యులకు పారితోషికం..
ఇక ఆర్ఎంపీ, పీఎంపీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రూరల్ ఏరియాలో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతీ బెడ్ కు ఒక సీరియల్ నెంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడాలని, ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని సూచించారు.

మానవీయ కోణంలో నిర్ణయాలు..
అలాగే ప్రజలకు లబ్ధి చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే సరైన సేవలు అందించవచ్చని, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. ‘క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచన ఏమిటో తెలుసుకోండి. ఏసీ గదులకే పరిమితమైతే మీకు కూడా సంతృప్తి ఉండదు. డిసెంబర్‌ 24న కలెక్టర్లతో తొలిసారి భేటీ నిర్వహించాం. ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారులను గుర్తించాలని ఆదేశించాం. ఎన్నికల కోడ్‌ ముగియగానే కలెక్టర్ల బదిలీలు నిర్వహించాం. కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినవారున్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే సరైన సేవలు అందించవచ్చు. తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలి. ప్రజలకు లబ్ధి చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు ఉండాలి. ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకునేలా పనిచేయాలి’ అన్నారు.

ఈ సమావేశంలో 9 కీలక అంశాలతో ప్రభుత్వం ఎజెండా రూపొందించింది. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం - కాలానుగుణ పరిస్థితులు, ఆరోగ్యం - సీజనల్‌ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రతలు - ఇతర భద్రతాపరమైన అంశాలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించింది.

Advertisment