/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/sharmila-jpg.webp)
YS Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ఏపీ ఎన్నికల(AP Elections) పై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ(Andhra Pradesh) లో మొత్తం 175స్ధానాల్లో కాంగ్రెస్(Congress) పటీ చేసే దిశగా కసరత్తు జరుగుతోందని వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వామపక్షాలతో కలిసి నడిచే దిశగా చర్చలు కొనసాగుతున్నట్లు తెలిపారు.
నిజానికి లెఫ్ట్ పార్టీలతోనే పొత్తు ఉంటుందని షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే చెప్పారు. ఆ దిశగా అడుగులు వేశారు. చివరకు అదే నిజమయ్యేలా కనిపిస్తోంది. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీతో టచ్‌లో ఉన్న కమ్యూనిస్టు పార్టీ నేతలు ఇక ఏపీలో కాంగ్రెస్ వైపే ఉంటారని అర్థమవుతుంది. ఎందుకంటే బీజేపీతో టీడీపీ జత కట్టింది. లెఫ్ట్ పార్టీలు బీజేపీకి వ్యతిరేకం. అందుకే షర్మిలతోనే ఏపీలో లెఫ్ట్ పార్టీలు కలిసి వస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.
షర్మిల ఎంట్రీ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తన కార్యకలాపాల్లో జోరు ప్రదర్శిస్తోంది. గత ఎన్నికల్లో మొత్తం 175 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కోల్పోయింది. షర్మిల రాక తర్వాత ఈసారి పరిస్థితి కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించిన షర్మిల.. అటు లెఫ్ట్ పార్టీలతో పొత్తు, సీట్ల పంపకాలపై చర్చిస్తున్నారు. ఇక జగన్ టార్గెట్‌గా ఎప్పటికప్పుడు షర్మిల ఫైర్ అవుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మూగ ప్రేక్షకుడిగా మిగిలిపోయారని విమర్శిస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో తీవ్ర జాప్యం కారణంగా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదని షర్మిల ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేదని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : తెలంగాణలో భారీగా ఆర్డీవోల బదిలీ.!