TSRTC: సంక్రాంతికి 4,484 స్పెషల్ బస్సులు.. సాధారణ ఛార్జీలతోనే.. తెలంగాణ ఆర్టీసీ శుభవార్త!

సంక్రాంతికి 4,484 స్పెషల్ బస్సులను నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండవని ప్రకటించారు. పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సదుపాయం ఈ పండుగ సీజన్లోనూ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

New Update
TSRTC: సంక్రాంతికి 4,484 స్పెషల్ బస్సులు.. సాధారణ ఛార్జీలతోనే.. తెలంగాణ ఆర్టీసీ శుభవార్త!

TSRTC Special Buses for Sankranti: సంక్రాంతి పర్వదినం సందర్భంగా నగరాలు, పట్టణాలకు సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్న ప్రజలకు TSRTC శుభవార్త చెప్పింది. వారికి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బస్సులు  ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. పండుగకు వెళ్లే వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4,484 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ తెలిపింది. అందులో 626 సర్వీస్ లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ నెల 7 వ తేదీ నుంచి 15 వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: TSRTC: శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త.. టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు!

సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, మహాలక్ష్మి పథకం అమలు, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (TSRTC MD Sajjanar) హైదరాబాద్ బస్ భవన్ లో శుక్రవారం ఉన్నతాధికారులు, ఆర్ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. మహా  లక్ష్మి స్కీం అమలు నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సంక్రాంతికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని చెప్పారు.

ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.  ప్రతీ రద్దీ ప్రాంతం వద్ద ఇద్దరూ డీవీఎం ర్యాంక్ అధికారులను ఇంచార్జ్ లుగా నియమించామని, రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను వారు అందుబాటులో ఉంచుతారని వివరించారు.  ఈ సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను TSRTC నడుపుతోందని, ఏపీకి షెడ్యూల్ సర్వీసులు యథావిధిగా నడుస్తాయని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Hyderabad Metro: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఈ మూడు రూట్లలో మెట్రో విస్తరణ.. వివరాలివే!

సంక్రాంతికి పండుగకు బస్సు ఛార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదని, గతంలో మాదిరిగానే సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సు సర్వీస్‌లను నడుపుతున్నట్లు తెలిపారు. సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకొని ప్రయాణించాలని కోరారు. ఈ సమావేశంలో టీఎస్‌ఆర్టీసీ సీవోవో డాక్టర్‌ రవిందర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు మునిశేఖర్‌, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, సీటీఎం(ఆపరేషన్స్) జీవన్‌ ప్రసాద్‌,  సీఎంఈ రఘునాథ్‌రావు, సీపీఎం ఉషాదేవి, సీటీఎం (కమర్షియల్) సుదర్శన్, సీఈఐటీ రాజశేఖర్, ఆర్ఎంలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు