TPCC: రేవంత్ రెడ్డిని సీఎం కానిస్తారా!.. నెక్స్ట్ ఆప్షన్స్ ఇవే

పార్టీని శిఖరాగ్రానికి తీసుకెళ్లింది ఒకరైతే, కష్టకాలంలోనూ పార్టీని అంటిపెట్టుకుని కాపాడుకున్నది మరొకరు.. కాంగ్రెస్‌ అంటే తమ పార్టీ అన్న ఆత్మీయతే అందరిదీ అయినా, భావోద్వేగాలతో పాటు అందరికీ ఆమోదయోగ్యం కాగల నిర్ణయాన్ని ప్రకటించవలసిన బాధ్యత ఇప్పుడు హస్తం పార్టీ అధిష్ఠానంపై ఉంది.

New Update
TPCC: రేవంత్ రెడ్డిని సీఎం కానిస్తారా!.. నెక్స్ట్ ఆప్షన్స్ ఇవే

TPCC: కాంగ్రెస్‌ నాయకుల మాటల్లో చెప్పాలంటే 'తెలంగాణ తెచ్చిన, ఇచ్చిన' వారి పార్టీ దశాబ్ధం తర్వాత రాష్ట్రంలో అధికారాన్ని వశం చేసుకుంది. ఇతర రాష్ట్రాల్లో ప్రతికూలత నేపథ్యంలో హస్తం పార్టీకి తెలంగాణ ఆశాదీపమైంది. ఇక పీఠమెక్కాలనుకునే నాయకుడు మాత్రం కాంగ్రెస్‌ ఎప్పుడూ ఎదుర్కొనే అపరిమిత, అనియంత్రిత అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఎదుర్కొని నిలవాల్సి ఉంటుందన్నది తెలిసిందే. సాధారణంగానే బహుముఖీన నాయకత్వాన్ని కలిగి ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో ఈసారి పాతకాపులూ పెద్దసంఖ్యలోనే గెలిచారు. పార్టీని శిఖరాగ్రానికి తీసుకెళ్లింది ఒకరైతే, కష్టకాలంలోనూ పార్టీని అంటిపెట్టుకుని కాపాడుకున్నది మరొకరు.. కాంగ్రెస్‌ అంటే తమ పార్టీ అన్న ఆత్మీయతే వారందరిదీ అయినా, భావోద్వేగాలతో పాటు అందరికీ ఆమోదయోగ్యం కాగల నిర్ణయాన్ని ప్రకటించవలసిన ఆవశ్యకత ఇప్పుడు హస్తం పార్టీ అధిష్టానంపై ఉంది. హేమాహేమీలే ముఖ్యమంత్రి పదవిపై గురిపెట్టిన నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు ఆ స్థానాన్ని ఎవరికి కట్టబెట్టబోతున్నారన్నది ప్రస్తుతం చర్చనీయమైంది.

ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ ఓటమిపై కేటీఆర్, హరీష్‌ రావు, కవిత ఏమన్నారంటే

నిరాశాజనకమైన స్థానంలో ఉన్న పార్టీకి నాయకత్వ బాధ్యతలు చేపట్టడమనే సాహసంతో పాటు; వరుస ఓటములతో ఎదురుదెబ్బలు తగులుతున్న దశలోనూ తిరిగి కాంగ్రెస్‌లో జవసత్వాలు నింపిన ఘనత రేవంత్ రెడ్డి(Revanth Reddy)దే అని ఇప్పుడు కాంగ్రెస్‌ పెద్దలంతా అంగీకరిస్తున్నారు. ఫలితాల రోజు ఉదయం వీహెచ్‌ వ్యాఖ్యలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. 2004 ఎన్నికలను గమనిస్తే - అంతకుముందున్న స్థితి నుంచి కాంగ్రెస్‌ను అధికారాన్ని అందించిన ఘనత వైఎస్సార్‌కు దక్కింది. ఇప్పుడా స్థానంలో రేవంత్‌రెడ్డిని చూస్తున్నారు విశ్లేషకులు. ప్రచారబాధ్యతలు భుజాన వేసుకుని రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించడంతో పాటు కేసీఆర్‌ సీటును కూడా లక్ష్యంగా చేసుకుని కార్యసాధనలో ముందుండి నడిచారు రేవంత్‌ రెడ్డి. అయితే, పార్టీ నేపథ్యం రేవంత్‌కు ప్రతికూలమయ్యే అవకాశముంది. సీనియర్లెవరూ అభ్యంతరాలు లేవనెత్తకపోతే ఆయన ముఖ్యమంత్రి పీఠాన్నెక్కడం ఇక లాంఛనప్రాయమే అవుతుంది.

అధికార పక్షంవైపు ఒక్కొక్కరుగా తమ శాసనసభ్యులందరూ ఆకర్షితులవుతూ, శాసనసభా పక్షాన్ని విలీనం చేసే ప్రయత్నం చేసిన సమయంలోనూ పార్టీని వీడకుండా, కష్ట కాలంలోనూ అసెంబ్లీలో పార్టీ గొంతు వినిపించిన వ్యక్తి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka). ఖమ్మం జిల్లా మదిర నుంచి హస్తం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన అజాత శతృవు. అణగారిన వర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎదిగిన, వివాదరహితుడైన వ్యక్తికి ముఖ్యమంత్రిగా పట్టం కట్టాలని అధిష్ఠానం భావిస్తే ఆయన తెలంగాణకు తొలి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అయ్యే అవకాశముంది.

ఇది కూడా చదవండి: రేపే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేస్తారా?

మరోవైపు నల్గొండను దుర్గంగా మలచుకుని పార్టీని విస్తరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkata Reddy) కృషిని కూడా విస్మరించలేమని ఆయన అనుచరులు చెప్తున్నారు. ప్రజాదరణగల నేతగా, కార్యకర్తలకు నిత్యం అండగా ఉంటారన్న పేరున్న ఆయన కూడా ముఖ్యమంత్రి స్థానాన్ని ఆశిస్తున్నారు. కార్యకర్తల డిమాండ్‌, ప్రజాదరణ కలగలసి ఆయన సీఎం అవుతారా, లేదంటే మరేదైనా ముఖ్య స్థానాన్ని దక్కించుకుంటారా అన్న విషయమై అనుచరులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

వీరందరికీ అతీతంగా మరోపేరు ముఖ్యమంత్రి పదవి కోసం విశేషంగా వినిపిస్తున్నది. ఆమే ములుగు ఎమ్మెల్యే సీతక్క (Seetakka). గిరిజన గూడేల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరేసిన ఘనత సీతక్కది. కష్టకాలంలో పార్టీని వీడి సొంత దారి చూసుకోలేదు. పైగా గిరిజన మహిళను ముఖ్యమంత్రిని చేస్తే అది పార్టీ ప్రతిష్ఠను మరింత పెంచేదే కదా అన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. రేవంత్‌ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిపై సీనియర్లు అభ్యంతరాలు లేవనెత్తితే, ఆయనతో మంచి అనుబంధం నేపథ్యంలో సీతక్కను సీఎం పదవి వరించే అవకాశమూ లేకపోలేదు.

publive-image

వీరే కాకుండా హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy) కూడా రాష్ట్రానికి తొలి కెప్టెన్‌ కావాలనుకుంటున్నారు. పీసీసీ అధ్యక్ష పదవితో పాటు పలు కీలక స్థానాల్లో పార్టీని నడిపించిన ఆయనకు ఇప్పుడు ప్రభుత్వంలో కీలకస్థానం లభించడం లాంఛనమే. అయితే, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి ముఖ్యమంత్రి ఖాయమని అనుచరులు ధీమాతో ఉన్నారు.

ఇన్నిన్ని అంచనాల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి హస్తిన పెద్దలు ఎవరిని ఎంపిక చేస్తారో అన్న ఉత్కంఠ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్నది. సీల్డ్‌కవర్‌లో అధిష్ఠానం ఎవరికి సీఎం పదవిని కానుకగా పంపిస్తుందో అతిత్వరలోనే తేలిపోనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు