'బ్రిటీష్ జనతా పార్టీ'.. హోంమంత్రికి బాధ్యత లేదా? లోక్‌సభలో రేవంత్‌ ఫైర్‌

ప్రపంచంలోనే అత్యధిక అబద్దాలు ఉన్న పుస్తకాలు బీజేపీ మేనిఫెస్టోలంటూ బీజేపీ టార్గెట్‌గా వ్యంగ్యస్త్రాలు సంధించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా మోదీపై మండిపడ్డారు. మణిపూర్‌ మండుతుంటే మోదీ ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రతీ ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని.. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ కూడా నెరవేరలేదన్నారు.

New Update
'బ్రిటీష్ జనతా పార్టీ'.. హోంమంత్రికి బాధ్యత లేదా? లోక్‌సభలో రేవంత్‌ ఫైర్‌

Revanth reddy targets modi over manipur issue: గిరిజనులపై ప్రధాని మోదీకి చులకన భావం ఉందంటూ విమర్శలు గుప్పించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా లోక్‌సభ వేదికగా ఈ కామెంట్స్‌ చేశారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ ఈ సభలోకి వస్తే గౌరవం ఉండేదన్నారు. ఇవాళ మోదీ సభకు రాకపోవడాన్ని ప్రస్తావించిన రేవంత్‌రెడ్డి.. మణిపూర్‌లో జరుగుతున్న మారణకాండకు ఆదివాసీలకు క్షమాపణ చెప్పి ఉంటే వారి గౌరవం మరింత పెరిగి ఉండేదన్నారు. తొమ్మిదేళ్లుగా మోదీ నేతృత్వంలో ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు రేవంత్‌. అందుకే ఈరోజు ప్రధాని సభలోకి రాలేదని.. ఆయనకు గిరిజనుల పట్ల ఏ మాత్రం గౌరవించలేదని ఆరోపించారు.

అవిశ్వాస తీర్మానంపై రేవంత్‌ కామెంట్స్:
ప్రధాని మోదీ, మంత్రి మండలిపై ప్రజలకు విశ్వాసం పోయిందంటూ విమర్శలు చేశారు రేవంత్. అందుకే 'INDIA' కూటమి తరుఫున ఎంపీ గొగోయ్‌ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని సమర్థిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అందుకే 140 కోట్ల దేశ ప్రజల తరపున ప్రధాని వైదొలగాలని అవిశ్వాసానికి మద్దతుగా నిలుస్తున్నట్టు చెప్పారు రేవంత్. విభజించు పాలించు అనే బ్రిటిష్ విధానాన్ని బీజేపీ (బ్రిటీష్ జనతా పార్టీ) అవలంబిస్తోందంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. మణిపూర్‌లో జాతుల మధ్య వైరం పెట్టి అధికారాన్ని పదిలం చేసుకోవలనుకుంటోందని తెలిపారు.

మోదీ ఏం చేస్తున్నారు?
మణిపూర్ మండిపోతుంటే.. అక్కడ రక్తం ఏరులై పారుతుంటే ప్రధాని, హోంమంత్రికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి. మణిపూర్‌కి వెళ్లి అక్కడి ప్రజలను రక్షించాల్సిన బీజేపీ నేతలు.. ఓట్ల వేట కోసం కర్ణాటకకు వెళ్లారని ఆరోపించారు. రాముడిని, బజరంగబలిని రాజకీయాలకు వాడుకున్నారని.. అందుకే కర్ణాటకలో ప్రజలు బీజేపీని తిరస్కరించారన్నారు. కర్ణాటక ప్రజల తీర్పు ఈ దేశానికి ఒక దిక్సూచి అంటూ చెప్పుకొచ్చారు. బీజేపీకి ప్రజల ప్రాణాలకంటే రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యమని దుయ్యబట్టారు. ఎన్డీఏ అంటే నేషన్ డివైడెడ్‌ అలియన్స్ అంటూ తనదైన శైలిలో డైలాగులు పేల్చారు రేవంత్. సభకు వచ్చి మణిపూర్ ప్రజలకు నమ్మకాన్ని కలిగించేలా ప్రధాని మోదీని స్పీకర్ ఆదేశించాలని కోరారు. ప్రపంచంలోనే అత్యధిక అబద్దాలు ఉన్న పుస్తకాలు బీజేపీ మేనిఫెస్టోలంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు రేవంత్‌రెడ్డి. ప్రతీ ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని.. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ నెరవేరలేదన్నారు. నల్లధనం వెనక్కు తెచ్చి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు ఇస్తామన్న హామీ ఏమైందో చెప్పాలని ప్రశ్నించారు రేవంత్‌.

Advertisment
Advertisment
తాజా కథనాలు