Crime News : పాత ప్రేమ చిగురించిందని వెళ్తే.. ప్రాణాలు తీసిన భర్త!

పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన దళిత యువకుడు వంశీ.. వివాహేతర సంబంధం కారణంగా అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యాడు. గాడిదల గండి లోయలో కుళ్ళిన స్థితిలో వంశీ శవం లభ్యమైంది.

New Update
FotoJet - 2026-05-11T113235.853

Young man brutally murdered

 Crime News : పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని గాడిదల గండి లోయలో కుళ్ళిన స్థితిలో లభ్యమైన జూల వంశీ (28) మృతదేహం ఉదంతం స్థానికంగా పెను కలకలం రేపింది. రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన దళిత యువకుడు వంశీ.. వివాహేతర సంబంధం కారణంగా అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి..
 
ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేసే వంశీకి, అదే గ్రామానికి చెందిన ఆలేఖ్య అనే యువతికి గతంలో ప్రేమ వ్యవహారం ఉండేది. అయితే, ఆలేఖ్య తర్వాత నవీన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో స్థిరపడింది. కొన్నాళ్లపాటు వీరిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. కానీ, ఇటీవల గ్రామంలో జరిగిన 'బొడ్రాయి' పండుగ వేడుకలకు ఆలేఖ్య సొంతూరికి వచ్చినప్పుడు ఇద్దరూ మళ్లీ కలుసుకున్నారు. దీంతో వీరి మధ్య ఫోన్ సంభాషణలు మొదలయ్యాయి. తన భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన నవీన్.. వారిద్దరూ మాట్లాడుకుంటున్న విషయాన్ని గమనించి, వంశీని అంతమొందించాలని పక్కా వ్యూహం రచించాడు.

పథకం ప్రకారం ఏప్రిల్ 30న ఆలేఖ్యతోనే ఫోన్ చేయించి వంశీని హైదరాబాద్‌కు రప్పించాడు భర్త నవీన్. శంషాబాద్‌ లోని ఒక గదిలో తన స్నేహితుడైన బుర్ర భాస్కర్‌తో కలిసి నవీన్.. వంశీతో గొడవకు దిగి, దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కారులో వేసుకుని హైదరాబాద్ నుంచి మంథని సమీపంలోని అటవీ ప్రాంతానికి తరలించి, లోతైన గాడిదల గండి లోయలో పడేశారు.

వంశీ కనిపించకుండా పోవడంతో మే 1న కుటుంబ సభ్యులు గోదావరిఖని టూ-టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వంశీ కాల్ డేటా ఆధారంగా ఆలేఖ్య, నవీన్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. నిందితులు ఇచ్చిన సమాచారంతో ఆదివారం ఒక మూటలో పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉన్న వంశీ మృతదేహా న్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, పోలీసులు మిస్సింగ్ కేసుపై సకాలంలో స్పందించి ఉంటే వంశీ ప్రాణాలతో ఉండేవాడని ఆరోపిస్తూ మృతుడి బంధువులు మంథని-కాటారం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఏసీపీ మడత రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Advertisment
తాజా కథనాలు