Telangana Finance Commission Funds : పంచాయతీలకు ఎన్నికలు జరిగేనా? నిధులు వచ్చేనా?

తెలంగాణలో గ్రామ పంచాయతీ పాలన కాలం ముగిసి చాలాకాలం అవుతోంది. ప్రభుత్వం రాజకీయ కారణాలతో ఎన్నికలు నిర్వహించ లేక పోతుంది. దీంతో కేంద్రం నుంచి రావలసిన ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. మార్చిలోపు నిర్వహించకపోతే రూ.మూడు వేల కోట్లు మురిగిపోయే ప్రమాదం ఉంది.

New Update
Local body Election

Telangana Finance Commission Funds

Telangana Finance Commission Funds:  తెలంగాణ గ్రామాల్లో  పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాలకు ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. మార్చిలోపు నిర్వహించకపోతే రూ. మూడు వేల కోట్లు మురిగిపోయే ప్రమాదం ఉంది.

రూ.3,000 కోట్లు ల్యాప్స్..?

తెలంగాణలో గ్రామ పంచాయతీ పాలన కాలం ముగిసి చాలాకాలం అవుతోంది. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా.. ప్రభుత్వం రాజకీయ కారణాలతో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించ లేక పోతుంది. దీంతో కేంద్రం నుంచి రావలసిన ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. ఇప్పటికే గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. పనులు ఎక్కడివి అక్కడ ఆగిపోయాయి. గతంలో చేసిన పనులకు బిల్లుల రాక మాజీ సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో  ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల రాష్ట్ర పంచాయతీ రాజ్ సంస్థలకు  కేంద్రం కేటాయించిన రూ.3,000 కోట్లకు పైగా కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నిధులు 'ల్యాప్స్' అయ్యే ప్రమాదం ఉంది. 2021-26  కాలానికి 15వ ఫైనాన్స్ కమిషన్  కేటాయించిన రూ.7,201 కోట్లలో భాగంగా, 2024-25కి రూ.1,514 కోట్లు ఇప్పటికే 'ఫ్రీజ్' అయ్యాయని అధికారవర్గాలు అంటున్నాయి.

 పాలకవర్గాలు ఉంటేనే నిధులు

గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి నిధులు రావాలంటే ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గాలు ఉండాలి. పాలకవర్గాలు ఉన్న పంచాయతీలకే నిధులు జమ చేస్తారు. ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీల కాలపరిమితి ముగిసి ఏడాదిన్నర దాటిపోయింది. ఇప్పుడు గ్రామాలన్నీ స్పెషలాఫీసర్ల పాలనలోనే ఉన్నాయి.  గ్రామాలకు నిధుల సమస్య కారణంగా గ్రామీణ అభివృద్ధి ప్రణాళికలు, శానిటేషన్,  రోడ్లు, ఇతర పనులన్నీ  ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. బీసీ రిజర్వేషన్ల పేరుతో స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఏం చేయాలో  తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. బీసీ రిజర్వేషన్‌ తేలకపోవడంతో చివరికి పాత రిజర్వేషన్లతోనే డిసెంబర్ లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతా అనుకున్నట్లు డిసెంబర్‌ లో ఎన్నికలు అయితే పర్వాలేదు. కానీ, ఏ కారణం చేతనైనా.. ఎన్నికలు నిర్వహించలేకపోతే.. రూ. మూడు వేల కోట్లు ల్యాప్స్ అయిపోతాయి.     

ఆదాయ మార్గాలు లేని పల్లెలు

గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులే ప్రధాన ఆధారం. జనాభాకు అనుగుణంగా ఒక్కొక్కరికి రూ.812 చొప్పున 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర సర్కారు విడుదల చేస్తుంది. గ్రామ పంచాయతీ పాలకవర్గాలు లేనందున 2024 ఫిబ్రవరి నుంచి కేంద్రంతోపాటు రాష్ట్రం నుంచి నిధులు రావడం లేదు. పెద్ద గ్రామ పంచాయతీలకు ఇంటి పన్నులు, వ్యాపార పన్నులు, తైబజార్‌, భవన నిర్మాణ ఫీజులు, వ్యాపార, వాణిజ్య లైసెన్స్‌ఫీజుల ద్వారా కొంత మేరకు నిధులు సమకూరుతాయి. చిన్న గ్రామాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులు మినహా ఇతర ఆర్థిక ఆదాయ మార్గాలు పెద్దగా ఉండవు. పంచాయతీ కార్యదర్శులు చెత్త సేకరించి ట్రాక్టర్లలో డీజిల్‌ పోసేందుకు, బ్లీచింగ్‌ పౌడర్‌ కొనుగోలు, తాగునీటి మోటర్ల రిపేరు, వీధిలైట్లు, పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర రోజువారీ కార్యకలాపాల కోసం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటికే ఆగిపోయిన నిధులు

గ్రామ పంచాయతీలకు నిధులు రావాలంటే ఎన్నికైన పాలక వర్గాలు ఉండాలనేది కండీషన్‌. కానీ ఏడాదిన్నరగా పాలకవర్గాలు లేకపోవడంతో గతంలోనే రూ.1,000 కోట్లు ఫ్రీజ్ అయ్యాయి. ఫిబ్రవరి 2025లో మరో రూ.1,500 కోట్లు ఆగి పోయాయి. ఆగస్టు 2025లో మరో రూ.3,000 కోట్లు పెండింగ్‌లో పడ్డాయి.  నిధులు లేకపోవడంతో పంచాయతీ సెక్రటరీలు తమ జేబులోంచి  డబ్బులు వెచ్చించి బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేస్తూ,  స్ట్రీట్ లైట్లు రిపేర్ చేయిస్తున్నారు. ఇవే కాదు మునుపటి సర్పంచ్‌లకు రూ.700 కోట్లు , సెక్రటరీలకు రూ.383 కోట్లు మొత్తం రూ.1,083 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి.  

రూ.3,600 కోట్లు పెండింగ్..

రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం ముగిసి 18 నెలలు దాటింది. 2024 ఫిబ్రవరిలో స్పెషల్ ఆఫీసర్ల పాలన మొదలైంది. అప్పటి నుంచి పాలక వర్గాలు లేకపోవడంతో పంచాయతీలకు కేంద్రం విడుదల చేయాల్సిన నిధులను ఆపేసింది. రాష్ట్రంలోని 12,769 పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద ప్రతి నెలా రూ.180 కోట్లు రావాల్సి ఉండగా.. 18 నెలలకు మొత్తం రూ.3,600 కోట్లకుపైగా నిధులు నిలిచిపోయాయి. ఎన్నికలు పూర్తయి పాలక వర్గాలు ఏర్పాటు చేస్తేనే ఈ నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. 

రిజర్వేషన్ పేరుతో ఎన్నికలు వాయిదా

రాష్ట్రంలో 12,769 పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతం పాలకవర్గం లేకపోవడంతో  అవన్నీ 'స్పెషల్ ఆఫీసర్ల' పాలనలో ఉన్నాయి.  బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018లో సుప్రీంకోర్టు ఆదేశాలతో 28 శాతానికే రిజర్వేషన్లు పరిమితం చేసి ఎన్నికలు నిర్వహించింది.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 42 శాతం బీసీ కోటా అని ప్రకటించింది. జీవోలు, ఆర్డినెన్స్ కూడా విడుదల చేశారు. కానీ అవేమీ న్యాయపరిశీలనలో నిలబడటం లేదు.   మార్చి 2026కల్లా ఎన్నికలు జరిగకపోతే, 2025-26కి కేటాయించిన రూ.3,000 కోట్లు ల్యాప్స్ అవుతాయని క్యాబినెట్ తాజాగా  ఆందోళన వ్యక్తం చేసింది.  పాత రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీలు, మున్సిపాలిటీలు 'వాయిదా' వేస్తామని చెబుతున్నారు.   డిసెంబర్ లో అయినా పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహించలేకపోతే.. పంచాయతీలు తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఇరుక్కుపోతాయి. అంటే ప్రజలు ఇబ్బంది పడతారు. ఆ ప్రభావం ప్రభుత్వంపై పడుతుంది.  

Advertisment
తాజా కథనాలు