Meenakshi Natarajan :  మీనాక్షీ నటరాజన్‌ నామినేషన్‌ రిజెక్ట్.... ఇంతకు ఆమె మీదున్న కేసు ఏంటి?

 వాస్తవానికి ఒక కోర్టు కేసులో ఆమెకు సమన్లు మాత్రమే వచ్చాయి. కానీ, ఆ విషయాన్ని ఆమె తన నామినేషన్ పత్రాల్లో చూపించలేదనే కారణంతోనే ఎన్నికల అధికారులు ఆమె నామినేషన్‌ను రిజెక్ట్ చేశారు.

New Update
meenakshi

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షీ నటరాజన్‌ వేసిన రాజ్యసభ నామినేషన్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. హైదరాబాద్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఓ క్రిమినల్ కేసుకు సంబంధించిన సమాచారాన్ని నటరాజన్ తన నామినేషన్ ఫారంలో దాచిపెట్టారని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్ రిజెక్ట్ చేశారు. దీంతో ఇంతకు మీనాక్షీ నటరాజన్‌పై ఆ కేసు ఏంటి అన్నది ఉత్కంఠగా మారింది. 

 వాస్తవానికి ఒక కోర్టు కేసులో ఆమెకు సమన్లు మాత్రమే వచ్చాయి. కానీ, ఆ విషయాన్ని ఆమె తన నామినేషన్ పత్రాల్లో చూపించలేదనే కారణంతోనే ఎన్నికల అధికారులు ఆమె నామినేషన్‌ను రిజెక్ట్ చేశారు.  నారాయణపేట కాంగ్రెస్‌ నాయకుడు కుంభం శివకుమార్‌రెడ్డితనను లైంగికంగా వేధించాడని, చంపుతానని బెదిరించాడని ఓ మహిళ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ గొడవపై తార్నాకకు చెందిన ఎ.శ్రీలత అనే మహిళ గత ఏడాది ఆగస్టు 28న హైదరాబాద్ కోర్టులో ఒక పిటిషన్ వేసింది. 

తనను వేధించిన శివకుమార్‌రెడ్డిపై పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించింది. అందుకే.. దీనిని పట్టించుకోని మీనాక్షీ నటరాజన్‌తో పాటు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్నికరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకుడు చిట్టెం అభిజయ్‌రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని, తనకు రూ.10 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని ఆమె కోర్టును కోరింది.

శివకుమార్‌రెడ్డిపై కేసు

ఆ మహిళ కోర్టుకు చెప్పిన వివరాల ప్రకారం... శివకుమార్‌రెడ్డిపై 2022లో పంజాగుట్టలో, 2023లో బెంగళూరులో కేసులు నమోదయ్యాయి. అతనిని అరెస్ట్ చేయాలని తాను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడంతో, అప్పట్లో ఆయన తన నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత అతనిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పెద్దలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. 

చివరకు ఈ విషయాన్ని ఏఐసీసీ ఇన్‌ఛార్జి మీనాక్షీ నటరాజన్ దృష్టికి తీసుకెళ్లగా.. శివకుమార్‌రెడ్డిని మేము ఎప్పుడో పార్టీ నుండి సస్పెండ్ చేశామని ఆమె చెప్పారు. అయితే, దానికి సంబంధించిన ఆర్డర్ కాగితం ఇవ్వమని అడిగితే మీనాక్షీ స్పందించలేదు. అంతేకాదు, కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన తర్వాత కూడా.. కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్‌గా నియమించిందని, ఎమ్మెల్యే పర్నికరెడ్డితో కలిసి ఆయన ఒకే వేదికపై కూర్చున్నారని ఆ మహిళ ఆరోపించింది.

మీనాక్షీ నటరాజన్ కంటే ముందు తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు చూసిన దీపాదాస్ మున్షీ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లానని ఆమె చెప్పింది. అప్పట్లో దీపాదాస్ మున్షీ సదరు నాయకులను గాంధీభవన్‌కు పిలిపించి మాట్లాడారని, అప్పుడు మహేష్‌కుమార్‌ గౌడ్ కూడా అక్కడే ఉన్నారని వివరించింది. ఆ తర్వాత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వచ్చి, ఇప్పుడు మంత్రి అయిన వాకిటి శ్రీహరి కూడా తనకు న్యాయం చేయలేదని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

కాబట్టి వీరందరిపై చర్యలు తీసుకొని నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించాలని ఆమె తన పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైదరాబాద్ కోర్టు.. మీనాక్షీ నటరాజన్‌తో పాటు మిగిలిన నాయకులకు నోటీసులు జారీ చేసింది. అయితే, తనపై ఇలాంటి ఒక కోర్టు కేసు ఉందనే విషయాన్ని మీనాక్షీ నటరాజన్ తన రాజ్యసభ నామినేషన్ పత్రాల్లో రాయలేదు. ఆ తప్పును పట్టుకున్న ఎన్నికల అధికారులు ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు.

Advertisment
తాజా కథనాలు