Kalvakuntla Kavitha : "అధికారంలోకి రాగానే ఆంధ్రా నేతల విగ్రహాలు పార్సల్ చేస్తాం"...కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు..

"తెలంగాణలో మేము అధికారంలోకి రాగానే ఇక్కడున్న ఆంధ్రా నాయకుల విగ్రహాలను పగలగొట్టి ఆంధ్రాకు పార్సల్ చేస్తాం" అంటూ తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు.

New Update
kavitha

Kalvakuntla Kavitha

Kalvakuntla Kavitha : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాల పునాదులపైనే తెలంగాణ సిద్ధించిందని, అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరడం లేదని తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు - సాధన’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అమరవీరులకు నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించిన కవిత.. గత 60, 70 ఏళ్లుగా తెలంగాణ ఎంతోమంది బిడ్డలను కోల్పోయిందని, వారి త్యాగాల ఇంధనంతోనే రాష్ట్రం సాధించుకున్నా, నేటికీ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగకపోవడం దురదృష్టకరమని అన్నారు.

తెలంగాణ ఉద్యమ కాలంలో సకల జనుల సమ్మె, వంటా-వార్పూ వంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలను ఎంతో పరిణతితో, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా నిర్వహించామని కవిత గుర్తుచేశారు. ఆనాడు ప్రజల మధ్య వాణిజ్య, బంధుత్వ సంబంధాలు బాగుండేవని, కేవలం రాజకీయ నాయకులను మాత్రమే విమర్శించేవాళ్లమని చెప్పారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఆంధ్రా రాజకీయ నాయకుల ఏజెంట్ ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే ఇక్కడ మళ్లీ ఆంధ్రా నేతల విగ్రహాలు పెట్టడం, తెలంగాణ అస్తిత్వంపై కుట్రపూరితంగా దాడి చేయడం జరుగుతోందని ఆమె ఆరోపించారు. మహానాడు వేదికగా తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదంటూ పిచ్చి వాగుడు వాగించారని, రాజ్యాంగబద్ధంగా సాధించుకున్న తెలంగాణను అవమానించే హక్కు ఎవరికీ లేదని కవిత స్పష్టం చేశారు.

ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం -జనసేన సంకీర్ణ ప్రభుత్వంపై కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రం ఏర్పడి 13 ఏళ్లు కావస్తున్నా ఆంధ్రా నేతలకు రాజధాని కట్టుకోవడం చేతకాక, ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో కాకుండా పార్లమెంట్‌లో అమరావతిపై తీర్మానం చేయించుకున్నారని, ‘మావిగన్’ పేరుతో జగన్ వీరికి రాజకీయ బాంబు వేశారని ఎద్దేవా చేశారు. "పవన్ కళ్యాణ్ తెలంగాణలో నవ నిర్మాణ సభ పెట్టేముందు, లోకేష్ బాబు  మీ సెక్రటేరియట్‌లోకి వాన నీళ్లు రాకుండా చూసుకోండి. ప్రతి వానాకాలం మీ రాజధాని మునుగుతుంటే ఆంధ్రా ప్రజలకు ఎంత అవమానం? ఇప్పటికీ ఏపీ ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించలేక నెల్లూరు వాళ్లు చెన్నైకి, అనంతపురం వాళ్లు బెంగళూరుకు, విజయవాడ వాళ్లు హైదరాబాద్‌కు రావాల్సిన పరిస్థితి ఎందుకు కల్పించారు?" అని ప్రశ్నించారు. తెలంగాణలో ఎక్స్‌టెన్షన్ కావడానికి ఇది మీ సామ్రాజ్యం కాదని, ఆంధ్రా పార్టీలకు ఇక్కడి ప్రజలు ఓట్లేయరనే దుకాణం బంద్ చేసుకున్న విషయం లోకేష్ బాబు గుర్తుంచుకోవాలన్నారు.

తెలంగాణలో వ్యాపారాలు, షూటింగ్‌లు చేసుకునే వారికి తాము ఎప్పుడూ రెడ్ కార్పెట్ పరుస్తామని, ఇక్కడ స్థిరపడిన ఆంధ్రా ప్రజలందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటామని కవిత స్పష్టం చేశారు. అయితే మా నీళ్లు, మా రాజకీయాల్లో వేలు పెడితే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. "నేను అసలే మొండిదాన్ని, మీరు అనుకున్నంత మంచిదాన్ని కాదు. మేము అధికారంలోకి రాగానే ఇక్కడున్న ఆంధ్రా నాయకుల విగ్రహాలను పగలగొట్టి ఆంధ్రాకు పార్సల్ చేస్తాం" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘టీఆర్ఎస్ 2.0’ తో పెట్టుకుంటే మూతి పళ్లు రాలుతాయని, ఒకసారి పెట్టుకుంటేనే తెలంగాణ తెచ్చుకున్నామని, మాతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రా ఏజెంట్‌గా మారి గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్టుకు ఓకే చెప్పి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని, ప్రొఫెసర్ నాగేశ్వర్, యాదగిరి వంటి మేధావులు ప్రశ్నిస్తే ఆంధ్రా పోలీసులతో ఎదురుదాడి చేయిస్తున్నారని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా కేకే, పీకే కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యమకారులను మోసం చేస్తోందని కవిత విమర్శించారు. కోదండరాం లాంటి ఒకరిద్దరికి పదవులు ఇస్తే సరిపోదని, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు ముఖ్యమంత్రి ఉద్యమకారుల హామీలన్నింటినీ నెరవేరుస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ హక్కుల రక్షణ కోసమే పుట్టిన తమ పార్టీ ‘పాంచజన్యం’ అనే ఐదు అంశాల విధానంతో ముందుకు వెళ్తుందని తెలిపారు. రైతులకు మేలు చేయడం, యువతకు ఉద్యోగాలతో పాటు రూ. 2 లక్షల నుండి రూ. 20 కోట్ల వరకు రుణాలు ఇచ్చి ప్రోత్సహించడం, సామాజిక తెలంగాణను సాధించడమే తమ లక్ష్యాలని చెప్పారు. భవిష్యత్ తెలంగాణ ఎలా ఉండాలనే అంశంపై ఉద్యమకారులు, మేధావులు తమ సలహాలు, సూచనలు అందించాలని కవిత ఈ సందర్భంగా కోరారు.

Advertisment
తాజా కథనాలు