/rtv/media/media_files/2025/10/04/tg-rtc-bus-fare-hike-2025-10-04-21-30-29.jpg)
Transport system paralyzed...
TGSRTC: తెలంగాణవ్యాప్తంగా టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) కార్మికుల సమ్మెతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. మంగళవారం ప్రభుత్వంతో నిర్వహించిన చర్చలు ఫలించకపోవడంతో, ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు బుధవారం తెల్లవారుజాము నుంచే కార్మికులు విధులను బహిష్కరించారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని డిపోల వద్ద బస్సులు లోపలే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 32 హామీలను వెంటనే అమలు చేయాలని, ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు కల్పించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గత అర్ధరాత్రి నుంచి కార్మిక సంఘాల నేతలు డిపోల ఎదుట బైఠాయించి ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ (గ్రేటర్ పరిధి): నగరంలోని ప్రధాన డిపోలైన ఎంజీబీఎస్, జేబీఎస్ సహా ఇతర డిపోల్లో బస్సులు కదలలేదు. నిత్యం ప్రయాణించే 26 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం పడింది. మెట్రో రైళ్లు ,ఎంఎంటీఎస్ సర్వీసులు కిక్కిరిసిపోతున్నాయి. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ప్రైవేట్ వాహనాలు, క్యాబ్‌లను ఆశ్రయిస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.
ఉత్తర తెలంగాణ (ఆదిలాబాద్, నిజామాబాద్): ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఉట్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డిపోల్లోని 641 బస్సులు నిలిచిపోయాయి. సుమారు 1,946 మంది కార్మికులు ఆందోళనలో పాల్గొన్నారు. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ డిపోల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రత్యామ్నాయంగా అధికారులు ప్రైవేట్ డ్రైవర్లను పిలిపించే ప్రయత్నం చేయగా కార్మికులు అడ్డుకున్నారు.
ఉమ్మడి మెదక్ ,సిద్దిపేట: సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, మెదక్, నర్సాపూర్ డిపోల పరిధిలో బస్సులు నిలిచిపోయాయి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాకాలోనూ సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంది. డిపో గేట్ల వద్ద కార్మికులు భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
దక్షిణ తెలంగాణ (మహబూబ్‌నగర్):ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 10 డిపోలకు చెందిన 850 బస్సులు గ్యారేజీలకే పరిమితమయ్యాయి. సుమారు 3,850 మంది కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా నిలిచిపోవడంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వెళ్లే ప్రయాణికులు సరిహద్దుల్లో చిక్కుకుపోయారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా: ఖమ్మం, సత్తుపల్లి, మధిర డిపోల ముందు కార్మికులు వంటా-వార్పు కార్యక్రమాలు చేపట్టి నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు సమ్మెను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు:: ప్రైవేట్ అద్దె బస్సులను (Hire Buses) వీలైనంత వరకు రోడెక్కించాలని చూస్తున్నారు. రిటైర్డ్ డ్రైవర్లు,భారీ వాహన లైసెన్స్ ఉన్న వారిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకునేందుకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు. మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచాలని, అదనపు ఎంఎంటీఎస్ సర్వీసులు నడపాలని రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు.
పల్లె వెలుగు బస్సులు నడవకపోవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణాలకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు 'మహాలక్ష్మి' పథకం కింద ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలు, ఇప్పుడు ప్రైవేట్ వాహనాలకు భారీగా చెల్లించాల్సి రావడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం మరోసారి చర్చలకు పిలిచే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. అప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగేలా కనిపిస్తోంది.
Follow Us