/rtv/media/media_files/2026/06/13/shabbir-ali-2026-06-13-14-22-48.jpg)
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన వైరల్ ఆడియో క్లిప్ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సీనియర్ నేత మహ్మద్ అలీ షబ్బీర్ స్పందించారు. ఈ వ్యవహారానికి సంబంధించి టీపీసీసీ క్రమశిక్షణ సంఘం జారీ చేసిన షోకాజ్ నోటీసుకు ఆయన తన లిఖితపూర్వక వివరణను సమర్పించారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఆ ఆడియోలో ఉన్న గొంతు తనది కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ... "ఆ ఆడియో క్లిప్ పూర్తిగా నకిలీది, కావాలనే మార్ఫింగ్ చేసి సృష్టించారు. నా నలభై ఐదేళ్ల రాజకీయ జీవితాన్ని, ప్రతిష్టను దెబ్బతీయడానికే కొందరు కుట్రపూరితంగా ఈ పని చేస్తున్నారు" అని ఆరోపించారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ తనకు నోటీసులు ఇచ్చి వివరణ కోరడానికి ముందే, ఆ నకిలీ ఆడియోపై తాను స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన గుర్తుచేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను ఉద్దేశించి తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. "మహేష్ కుమార్ గౌడ్ నాకు 40 ఏళ్లుగా తెలుసు. ఆయన నాకు ఒక సోదరుడి లాంటి వాడు. మా ఇద్దరి మధ్య దూరం పెంచి, కాంగ్రెస్ పార్టీలో లబ్ధి పొందాలని చూస్తున్న కొందరు వ్యక్తులు ఈ తప్పుడు ప్రచారానికి తెరలేపారు" అని ఆయన మండిపడ్డారు.
సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నా
తాను గత 45 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నానని, ఎలాంటి పరిస్థితుల్లోనూ పార్టీకి నష్టం చేకూర్చే పనులను తాను చేయనని షబ్బీర్ అలీ తేల్చి చెప్పారు. కాగా, పార్టీ పదవులను డబ్బులకు అమ్ముకుంటున్నారంటూ షబ్బీర్ అలీ మాట్లాడినట్లుగా ఉన్న ఒక ఆడియో క్లిప్ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాల నేపథ్యంలో ఈ ఆడియో బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ వివాదంపై టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ.. నిజామాబాద్ ప్రజలకు తన క్యారెక్టర్ ఏంటో, తన ఆస్తులేంటో బాగా తెలుసని అన్నారు. అంతటి అనుభవం ఉన్న షబ్బీర్ అలీ ఇలా మాట్లాడటం విచారకరమని పేర్కొన్నారు. మరోవైపు, ఈ లీకుల వ్యవహారంపై, పార్టీలో ఉంటూ కోవర్ట్ పనులు చేస్తున్న వారిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిస్థాయి అంతర్గత విచారణ జరిపిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Follow Us