39 కానిస్టేబుళ్లపై సస్పెండ్ వేటు.. ఏక్ పోలీస్ విధానం అంటే ఏంటి ?

పోలీస్ ఉద్యోగంలో ఉంటూ ధర్నాలు, నిరసనలకు నాయకత్వం వహించారని ఏకంగా 39 మంది టీజీఎస్పీ బ్బందిని సస్పెండ్ చేస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ వివాదం గురించి మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. 

New Update
EK police


తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి భార్యలు ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  పోలీస్ ఉద్యోగంలో ఉంటూ ధర్నాలు, నిరసనలకు నాయకత్వం వహించారని.. తెలంగాణ పోలీస్ శాఖ ఆర్టికల్ 311ను ప్రయోగించింది. దీంతో ఏకంగా 39 మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ (TGSP) సిబ్బందిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.  అసలు ఏంటీ వివాదం. ఏక్ పోలిస్ అంటే ఏంటీ ? నిబంధనలు ఏం చెబుతున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: గురుకులాల్లో మళ్లీ ఖాళీలు.. ఈసారి ఎంతంటే ?

ఏక్ పోలీస్ అంటే ?

ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం తెలంగాణలో 13 బెటాలియన్లు ఉన్నాయి. వాళ్లలో అధికారులు, సిబ్బంది అంతా కలుపుకుంటే ఒక్కో బెటాలియన్‌లో వెయ్యిమంది వరకు ఉంటారు. పోలీస్‌ శాఖలో సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR), స్పెషల్ పోలీస్ విభాగాల్లో సిబ్బందిని భర్తీ చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. పోలీస్ స్టేషన్లలో ఉంటూ శాంతిభద్రతల పర్యవేక్షించడం, నేరాలను విచారించడం, నేరస్తులను గుర్తించడం, క్రైమ్‌ రేటును నిరోధించడం వంటి విధులు సివిల్ పోలీస్ సిబ్బంది చేస్తుంటారు. అయితే వాళ్లకి బందోబస్తు తదితర విధుల్లో ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు పనిచేస్తుంటారు. ఇక టీజీఎస్పీ పోలీస్ సిబ్బంది మాత్రం శాంతిభద్రతల విధుల్లో ఉంటారు. ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాలకు వెళ్తారు. 

అయితే ఈ స్పెషల్ పోలీస్ కానిస్టేబుళ్లు తమకు ఐదేళ్లలో ఏఆర్‌లోకి, ఆ తర్వాత ఐదేళ్లకు సివిల్ కానిస్టేబుల్‌గా మార్చాలని కానిస్టేబుళ్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ రాష్ట్ర సర్వీస్ నిబంధనలు ఇందుకు ఒప్పుకోవని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడం తీవ్రమైన విషయంగా పరిగణించాల్సి వస్తుందని డీజీపీ జితేందర్ ప్రకటన చేశారు. '' తెలంగాణ రాష్ట్ర పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులు కొన్ని దశాబ్దాలుగా అమల్లో ఉన్నాయి. జిల్లా స్థాయిలో నేర విచారణ చేయడం, నేరాలను నిరోధించడం, క్రిమినల్స్‌ను గుర్తించడం లాంటి విధులు సివిల్ పోలీస్ సిబ్బంది చేస్తుంటారు.      

Also Read: పండగ వేళ సామాన్యులకు షాక్.. పెరిగిన ధరలు

 బందోబస్తు తదితర విధుల్లో ఆర్మ్డ్‌ రిజర్వు పోలీసులు ఉంటారు. ఇక టీజీఎస్పీ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతల అంశాల్లో విధులు నిర్వహిస్తుంటారు. అన్ని రాష్ట్రాలు కూడా ఈ విధానాలనే ఫాలో అవుతున్నాయి. టీజీఎస్పీ సిబ్బంది సమస్యలను మెరిట్ ప్రాతిపదికన సానుభూతితో పోలీస్ శాఖ పరిశీలిస్తుంది. ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు లేనివిధంగా టీజీఎస్పీ సిబ్బందికి సరెండర్ లీవ్‌లు, అడిషనల్ సరెండర్‌ సెలవులు కూడా మంజూరు చేశాం. పండుగలు, సెలవుల సందర్భాల్లో టీజీఎస్పీ సిబ్బంది నిర్వహించే విధులను దృష్టిలో ఉంచుకొని వాళ్లకు ఈ సౌకర్యాలు కల్పిస్తున్నాం.  

జీతాలు, భత్యాలు ఇతర రాష్ట్రాల పోలీసులతో పోల్చుకుంటే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆరోగ్య భద్రత వంటి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ.. సిబ్బంది కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీజీఎస్పీ సిబ్బంది ఆందోళనలు చేపట్టడం సరైంది కాదు. యూనిఫామ్ ధరించే టీజీఎస్పీ సిబ్బంది అత్యంత క్రమశిక్షణతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఏమైనా సమస్యలు ఉంటే వాళ్లకోసం నిర్వహిస్తున్న దర్బార్ కార్యక్రమం ద్వారా అధికారులకు తెలియజేయాలని'' డీజీపీ వివరించారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు