దక్షిణాది ముఖ్యమంత్రులకు రేవంత్ రెడ్డి లేఖ.. ఎందుకంటే?

కేంద్రం చేపట్టిన డీలిమిటేషన్‌పై తెలంగాణ CM రేవంత్ రెడ్డి గళమెత్తారు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే జనాభా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రధానితో పాటు ఇతర దక్షిణాది ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.

New Update

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ ప్రక్రియపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు శాశ్వత అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడంతో పాటు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులకు కూడా లేఖలు రాస్తూ ఐక్య పోరాటానికి పిలుపునిచ్చారు.

దక్షిణాదికి ఎందుకు నష్టం?

ప్రస్తుత నియోజకవర్గాల పెంపు ప్రొ-రేటా (జనాభా నిష్పత్తి) ప్రకారం జరిగితే, జనాభా నియంత్రణ పాటించి అభివృద్ధిలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా లోక్‌సభ స్థానాలను 543 నుండి 850కి పెంచే క్రమంలో, జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు లాభపడి, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటులో తమ గొంతుకను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన 'హైబ్రిడ్ మోడల్'

కేంద్రం అనుసరిస్తున్న గందరగోళ ధోరణిని ఎండగడుతూ, రేవంత్ రెడ్డి ఒక వినూత్నమైన 'హైబ్రిడ్ మోడల్'ను ప్రతిపాదించారు. కేంద్రం పెంచాలనుకుంటున్న అదనపు సీట్లలో సగాన్ని (50%) నేరుగా దక్షిణాది రాష్ట్రాలకే కేటాయించాలి. మిగిలిన సగాన్ని ఇతర రాష్ట్రాలకు జనాభా నిష్పత్తిలో కేటాయించవచ్చు. దక్షిణాదికి ఇచ్చే సీట్లను ఆయా రాష్ట్రాల GSDP, ఆర్థిక వృద్ధి రేటు ఆధారంగా పంపిణీ చేయాలి. "కుటుంబ నియంత్రణ పాటించి అభివృద్ధి సాధించినందుకు దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష వేయడం సరికాదు. ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికి మనమంతా ఏకతాటిపైకి రావాలి." అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన లేఖలో స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ వంటి అంశాలను ముడిపెడుతూ కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. ఈ కీలక అంశంపై దక్షిణాది ముఖ్యమంత్రుల స్పందన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Advertisment
తాజా కథనాలు