తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సీపీఐ నుంచి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ నామినేషన్లను దాఖలు చేశారు. మొత్తం ఐదు స్థానాలకు ఐదుగురు నామినేషన్లను దాఖలు చేయడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత రిటర్నింగ్ అధికారి వీరి ఎన్నికపై ప్రకటన చేయనున్నారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ పదవి కోసం అనేక మంది నేతలు పోటీ పడ్డారు. అద్దంకి దయాకర్, వీహెచ్, వేం నరేందర్ రెడ్డి, సంపత్ కుమార్, కుసుమ కుమార్, సామ రామ్మోహన్ రెడ్డి, జగ్గారెడ్డి, శంకర్ నాయక్ తదితర అనేక మంది నేతల పేర్లు వినిపించాయి. అయితే.. అద్దంకితో పాటు శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఫైనల్ చేసింది హైకమాండ్.
శంకర్ నాయక్ కు ఎస్టీ కోటాతో పాటు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతు ఉండడం కలిసి వచ్చింది. విజయశాంతి ఢిల్లీ వెళ్లి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరిగినా.. ఆ విషయాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. కాంగ్రెస్ రాష్ట్ర నేతలు కూడా ఆమె పేరు ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ లో ఉంటుందని అస్సలు అంచనా వేయలేదు. కానీ అనూహ్యంగా విజయశాంతి పేరు ఫైనల్ లిస్ట్ లో ఉండడంతో అంతా షాక్ కు గురయ్యారు. AICC కోటాలో విజయశాంతికి ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కింది. టీపీసీసీ, సీఎంతో సంబంధం లేకుండా హైకమాండ్ నేరుగా విజయశాంతి పేరును ప్రకటించిందన్న ప్రచారం సాగుతోంది.
గతంలో ఇచ్చిన హామీ మేరకే..?
గతంలో ఇచ్చిన హామీ ప్రకారం రాములమ్మకు ఎమ్మెల్సీ సీటు కేటాయించినట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ గా విజయశాంతి వ్యవహరించారు. ఎన్నికల తర్వాత చాలా రోజులుగా ఆమె మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సోషల్ మీడియాలో పలు పోస్టులతో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎమ్మెల్సీ సీటు రావడంతో రాములమ్మపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. నేరుగా అధిష్టానంతో రాములమ్మ టచ్ లో ఉందన్న ప్రచారం మొదలైంది.