Telangana : భారీగా భూ దందాలు.. డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ సస్పెన్షన్ : మంత్రి పొంగులేటి కీలక కామెంట్స్!

హౌసింగ్ బోర్డులో భూసేకరణ అధికారిగా పనిచేసిన డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 2013 నుంచి 2018 వరకు హౌసింగ్ బోర్డులో పనిచేసిన కాలంలో రాము నాయక్ భారీగా భూ దందాలు, అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

New Update
ponguleti srinivas reddy

హౌసింగ్ బోర్డులో భూసేకరణ అధికారిగా పనిచేసిన డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 2013 నుంచి 2018 వరకు హౌసింగ్ బోర్డులో పనిచేసిన కాలంలో రాము నాయక్ భారీగా భూ దందాలు, అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చట్టాన్ని కాపాడాల్సిన కొందరు అధికారులే కంచే చేను మేసినట్లుగా ప్రభుత్వ భూములను కొల్లగొట్టారని ఆయన మండిపడ్డారు.

హైదరాబాద్ సిటీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం హౌసింగ్ బోర్డు, ప్రభుత్వ స్థలాలను పరిశీలిస్తున్న సమయంలో రాము నాయక్ చేసిన భూ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయని మంత్రి తెలిపారు. బహిరంగ మార్కెట్లో గజం రూ. 2 లక్షల వరకు ధర పలికే హైకోర్టు గేట్ల సమీపంలోని హౌసింగ్ బోర్డుకు చెందిన 33.53 చదరపు గజాల స్థలాన్ని రాము నాయక్ 2018 ఫిబ్రవరి 17న అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. హౌసింగ్ బోర్డులో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి గతంలో సస్పెండ్ అయిన ఇఫ్తాకర్ అహ్మద్ అనే వ్యక్తి భార్య పేరిట ఈ భూమిని అక్రమంగా రాసిచ్చారు. ఆ తర్వాత 2025లో ఆ భూమిని మరొకరి పేరిట మార్చినట్లు విచారణలో తేలింది.

ప్రభుత్వ భూములను ఇష్టమొచ్చినట్లు

రాము నాయక్ కేవలం ఒకే చోట కాకుండా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ఇష్టమొచ్చినట్లు ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని మంత్రి పొంగులేటి వివరించారు. విజ‌య‌న‌గ‌ర్ కాల‌నీలో 400 చ‌ద‌ర‌పు గ‌జాలు, తుల్జాగూడ‌లో 22 గ‌జాలు, ల‌క్ష్మిగూడ‌లో 130 గ‌జాలు, మ‌హ‌బూబ్ గంజ్‌లో 497 గ‌జాల స్థలాలను రాము నాయక్ ప‌లువురి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని.. వాటన్నింటిపై విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని మంత్రి వెల్లడించారు.

రాము నాయక్‌పై విచారణ పూర్తిగా పూర్తయ్యాక, అన్ని ఆధారాలను బట్టి అతడిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ భూ అక్రమాలకు సహకరించిన మిగతా అధికారులపైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. అక్రమాలకు సహకరించిన సూపరింటెండెంట్ వివేకానంద్‌ను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించారు. మరో సూపరింటెండెంట్ బోనా నాయక్‌ను సస్పెండ్ చేశారు.

ప్రభుత్వ భూములను ఆక్రమించినా, ఆ ఆక్రమణలకు అధికారులు సహకరించినా ఊరుకునే ప్రసక్తే లేదు. ఏ హోదాలో ఉన్నా సరే నిర్దాక్షిణ్యంగా చర్యలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు తప్పు చేస్తే మరింత కఠినంగా వ్యవహరిస్తాం. క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గట్టిగా హెచ్చరించారు. 

Advertisment
తాజా కథనాలు