తెలంగాణలో 2 రాజ్యసభ ఖాళీలు VH, జీవన్ రెడ్డితో పాటు పోటీలో ఉన్నది వీరే!

తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ అధికార కాంగ్రెస్ పార్టీలో సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా వాటిలో ఒకదానిని జాతీయ నాయకత్వానికి కేటాయించడం ఖాయం కాగా, మిగిలిన స్థానం కోసం రాష్ట్ర స్థాయి నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.

New Update
rajyasabha seat

తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ అధికార కాంగ్రెస్ పార్టీలో సెగలు పుట్టిస్తోంది. పార్టీలో ఏ పదవిలో లేకుండా ఉన్న సీనియర్ నాయకుల కళ్లన్నీ రాజ్యసభ సీటు మీదనే. ముఖ్యంగా వాటిలో ఒకదానిని జాతీయ నాయకత్వానికి కేటాయించడం ఖాయం కాగా, మిగిలిన స్థానం కోసం రాష్ట్ర స్థాయి నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ రేసులో ఆశావహుల జాబితా చాంతాడంత ఉంది. ఇప్పటికే వారికి ఉన్న లింక్స్‌లో హైకమాండ్‌ దగ్గర సిఫార్సులు స్టార్ట్ చేశారు. పెద్దల సభకు రాష్ట్రంలో గట్టిగానే పోటీ ఉంది

సింఘ్వీకి రెన్యువల్?

కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి మరోసారి రాజ్యసభ అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కోటా నుండే ఆయన పేరును ఖరారు చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయి. అయితే, రాష్ట్ర నేతలు మాత్రం తమకు కూడా అవకాశం కల్పించాలని గట్టిగా పట్టుబడుతున్నారు.

ఒక్క స్థానం.. ఆరుగురు ఉద్ధండులు!

మరో స్థానం కోసం ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారిలో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు ఇవే:

సుదర్శన్ రెడ్డి: ఇటీవల 'ఇండియా' కూటమి తరపున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన అనుభవం పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

వేం నరేందర్ రెడ్డి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రస్తుతం సీఎం సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి కూడా రాజ్యసభ రేసులో ఉన్నారు.

జీవన్ రెడ్డి: పార్టీలో క్రమశిక్షణ గల నాయకుడిగా గుర్తింపు పొందిన సీనియర్ నేత జీవన్ రెడ్డి సైతం ఈసారి పెద్దల సభకు వెళ్లాలని ఆశిస్తున్నారు.

మధుయాష్కి గౌడ్: రాహుల్ గాంధీ కోటరీలో సభ్యుడిగా గుర్తింపు ఉన్న మధుయాష్కి గౌడ్, బీసీ కోటాలో తన పేరును పరిశీలించాలని కోరుతున్నారు.

కె. కేశవరావు (కేకే): బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరే సమయంలో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కేకే, తిరిగి అదే స్థానాన్ని తనకు కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం.

వి. హనుమంతరావు (వీహెచ్): పార్టీ విధేయుడైన సీనియర్ నేత వీహెచ్ కూడా రేసులో ఉన్నారు. అవకాశం ఇస్తే పార్లమెంటులో పార్టీ గొంతుకను వినిపిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అధిష్టానం నిర్ణయంపై ఉత్కంఠ
సామాజిక సమీకరణలు, పార్టీ విధేయత, భవిష్యత్తు రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైకమాండ్ ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే నివేదిక ఆధారంగానే తుది నిర్ణయం ఉండే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు