/rtv/media/media_files/2025/06/10/6KxmRCTw7FwCAlhBrfVw.jpg)
Sarpanch elections in villages...hunt for city dwellers
Panchayat Elections : గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గ్రామాల్లో అభ్యర్థులు తమ ప్రచారంతో ఓరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల దృష్టి గ్రామాల నుంచి వలస వెళ్లి నగరాల్లో జీవిస్తున్న వారిపై పడింది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి వేలాది మంది ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్, ముంబై వంటి నగరాలకు వలసవెళ్లారు. అయినప్పటికీ వారి ఓటు మాత్రం గ్రామాల్లోనే ఉంది. అసెంబ్లీ, లోకల్‌బాడీ ఎన్నికల సమయంలో మాత్రం గ్రామానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం సర్వసాధారణమైంది. దీంతో పలువురు అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి సారించారు. గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లపై ఆయా పార్టీల అభ్యర్థులు కన్నేశారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉండటంతో గ్రామాల్లో ఉంటున్న వారితోపాటు వలస వెళ్లిన వారి ఓట్లు కూడా కీలకంగా మారాయి. ఈ క్రమంలో వారిని గ్రామాలకు రప్పించేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. మూడు విడతల నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి పెట్టారు. తమ గ్రామంలోని ఓటర్లు ఏయే ప్రాంతాల్లో ఉంటున్నారన్న దానిపై ఆరాతీసి వారి ఫోన్ నంబర్లను సేకరించే పనిలో పడ్డారు.
కీలకంగా మారిన వలస ఓట్లు
గ్రామ పంచాయతీ, వార్డు సభ్యుల ఎన్నికల్లో వలస వెళ్లిన వారి ఓట్లే కీలకంగా మారాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆయా మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వలస వెళ్లారు. హైదరాబాద్లోని ఉప్పల్, జగద్గిరిగుట్ట, నాగోల్, చింతల్, మోతి నగర్, బాలానగర్, ఈసీఐఎల్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. వీటితో పాటు బొంబాయి, సూరత్ వంటి ఇతర రాష్ట్రాల్లోనూ పలువురు తెలంగాణ వాసులు ఉంటారు. చాలా మంది ఎంత దూరం వలస వెళ్లినప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికల సమయానికి ఓటు వేసేందుకు కచ్చితంగా వస్తుంటారు. ఇప్పటికీ గ్రామాల్లో ఓటు వేయడంపై చాలా మంది నిబద్ధతతో ఉన్నారు. 'ఓటు వేయని వ్యక్తి మరణించిన వ్యక్తితో సమానం' అన్న భావన గ్రామీణుల్లో ఎక్కువగా ఉంటుంది. అందుకే వారు తప్పకుండా ఓటుహక్కు వినియోగించుకుంటారు. అయితే వారిని ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. వారికి రావడానికి , పోవడానికి అయ్యే బస్సు, రైలు, విమాన చార్జీలను సైతం ఇవ్వడానికి అభ్యర్థులు వెనుకాడటం లేదు. వారి వచ్చి ఓటు వేస్తే చార్జీలు చెల్లిస్తామని వారితో ఫోన్‌లో సంప్రదిస్తున్నారు.
ఓటుకు బేరాసారాలు
అయితే కొంతమంది వలసదారులు మాత్రం అభ్యర్థులతో బేరసారాలకు దిగుతున్నారు. కేవలం బస్ చార్జీలు ఇవ్వడం కాదని, తాము తమ ఉద్యోగాలకు లీవులు పెట్టుకుని వస్తున్నామని అలాంటపుడు ఆ రోజు వేతనం నష్టపోవలసి వస్తుందని,అందుకే తమకు బస్ చార్జీలతో పాటు అదనంగా ఇస్తే వచ్చి ఓటు వేస్తామని తేగేసి చెప్తు్న్నారు. దీంతో కొంతమంది అభ్యర్థులు వారు అడిగినంత ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వలస దారుల ఓట్లు కీలకంగా మారాయి. గెలుపు ఓటములను నిర్ణయించడంలో వారి ఓట్లు కీలకంగా మారడంతో వారికోసం వేట మొదలైంది.
Follow Us