/rtv/media/media_files/2025/03/26/dKNm9q88rQnGdwtkB8AF.jpg)
Bhadrachalam
Bhadrachalam : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భారీ భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. భద్రాచలం పుణ్యక్షేత్రంలోని పంచాయతీ కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా శిథిలాలకింద ఇంకా కొంతమంది ఉన్నట్లు అనుమానిస్తున్నారు. శిథిలాల కిందనుంచి అరుపులు వినిపించడంతో రెస్క్యూటీం రంగంలోకి దిగింది. ఘటనా ప్రదేశంలోనే జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్‌లు ఉన్నారు. శిథిలాలను తొలగించేందుకు రెస్క్యూ టీం అవిశ్రాంతంగా శ్రమిస్తున్నది. గడచిన నాలుగున్నర గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది.
భారీ యంత్రాల సహాయంతో ఒక్కో స్లాబ్ ను తొలగించేందుకు రెస్క్యూ టీం యత్నిస్తున్నది. అకస్మాత్తుగా శిథిలాల క్రింద నుంచి అరుపులు వినిపించడంతో రెస్క్యూ సిబ్బంది అప్రమత్తమైంది. శిథిలాల్లో కూరుకుపోయిన క్షతగాత్రుల కోసం పైపుల ద్వారా ఆక్సిజన్ పంపేందుకు యత్ని్స్తున్నారు.
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆరు అంతస్తుల ఈ భవనం పూర్తిగా నేలమట్టమైంది. ప్రాథమికంగా, నిర్మాణ నాణ్యత లోపమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పనిచేస్తున్న కూలీలు మృతి చెందినట్టు సమాచారం.ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమీపంలోని ఇళ్లలో ఉన్నవారు ప్రాణ భయంతో పరుగులు తీశారు.ఏమి జరుగుతుందో తెలియక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్థానికులు ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు.
Also read : యూఎస్ హెల్త్ ఏజెన్సీకి అధిపతిగా భారత సంతతి వ్యక్తి నియామకం!
భవనం కూలిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. భవనం యజమాని శ్రీపతి శ్రీనివాసరావు పరారైనట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో, రామాలయ పరిసర ప్రాంతంలోని సూపర్ బజార్ సెంటర్లో ఈ భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఫిర్యాదు మేరకు, భవన నిర్మాణం నాసిరకంగా చేపట్టారని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఐటిడిఏ పిఓ రాహుల్ ఈ భవనాన్ని కూల్చివేయాలని పంచాయతీ శాఖకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు చర్చ జరుగుతోంది.ఇంటి యజమాని సామాజిక కార్యకర్తలను బెదిరించినట్లు సమాచారం. పట్టణంలో అనేక భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం అవుతున్నాయని, ఫిర్యాదు చేసినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషాదానికి పంచాయతీ శాఖ పూర్తి బాధ్యత వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also read : పోస్టులు పెడితే అరెస్టులు చేస్తారా?.. AP పోలీసులకు హైకోర్టు బిగ్‌షాక్!