/rtv/media/media_files/2025/12/06/fotojet-2025-12-06t080046539-2025-12-06-08-11-16.jpg)
HMDA: హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు ప్లాట్ల వేలంతో తాజాగా రూ.3,862 కోట్ల ఆదాయం సమకూరింది. కోకాపేటలోని భూములను నాలుగు విడతల్లో విక్రయించడంతో ఈమేరకు రాబడి వచ్చింది. ఇక అటు తెల్లాపూర్ కూడా ఐటీ హబ్‌కు సమీపంగా ఉండటంతో మరో కోకాపేటగా ఎదగడం ఖాయమని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు.
కోకాపేట నియోపోలిస్ భూముల విలువ ఏ స్థాయికి చేరుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హెచ్ఎండీఏ ప్రతిసారి వేలం నిర్వహిస్తే, ఎకరం ధర వందల కోట్లు దాకా దూసుకెళ్తోంది. తాజాగా జరిగిన మూడో విడత వేలంలోనూ ఇదే స్థాయిలో పలికి సంచలనం సృష్టించింది. ఈ దఫా ప్లాట్ నెంబర్లు 19, 20లో కలిపి ఉన్న 8.04 ఎకరాల భూమిని హెచ్ఎండీఏ వేలానికి ఉంచింది. అందులో ప్లాట్ 19లో ఎకరానికి రూ.131 కోట్లు, ప్లాట్ 20లో ఎకరానికి రూ.118 కోట్ల వరకు బిడ్లు నమోదయ్యాయి. ఈ రెండు ప్లాట్లు మాత్రమే కలిపి సంస్థకు దాదాపు రూ.1,000 కోట్ల ఆదాయం సమకూరింది.
ఇక నాలుగో విడతలో భాగంగా కోకాపేట గోల్డెన్ మైల్ లే అవుట్‌లోని 1.98 ఎకరాల స్థలాన్ని శుక్రవారం ఈ-వేలం వేశారు. ఈ స్థలానికి ఎకరం కనీస ధరను రూ.75 కోట్లుగా నిర్ణయించగా.. ఎకరాకు రూ.77.75 కోట్ల చొప్పున 1.98 ఎకరాలను రూ.153.94 కోట్లకు సీవోఈఎస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రైవేటు లిమిటెడ్ దక్కించుకుంది. మొత్తంగా నాలుగు విడతల్లో ఏడు ప్లాట్లను విక్రయించడం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.3,862.8 కోట్ల ఆదాయం వచ్చింది.
ఇక హెచ్ఎండీఏ మొత్తం 44 ఎకరాలను 4 విడతలుగా వేలం వేయాలని ముందే నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో ఇప్పటివరకు ముగిసిన 3 విడతల్లో మొత్తం 27 ఎకరాలకు గాను రూ.3,708 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది ఇప్పటి వరకు నమోదు అయిన భారీ రికార్డు అని చెప్పాలి. మూడో విడతతో పోల్చితే గత వేలాల్లో కోకాపేట నియోపోలిస్‌లో ధరలు మరింత ఎగబాకాయి. ఒక దశలో అక్కడి ఎకరం ధర 150 కోట్ల మార్క్‌ను దాటింది. రెండో విడతలో అయితే ప్లాట్ 15లో ఎకరానికి రూ.151.25 కోట్లు, ప్లాట్ 16లో రూ.147.75 కోట్లు రికార్డు సృష్టించాయి. మొత్తం వేలం ప్రక్రియ ద్వారా రూ.5,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశముందని హెచ్ఎండీఏ అంచనా వేస్తోంది.
కాగా నాల్గవ విడతలో ఎకరాకు రూ.77.75 కోట్ల చొప్పున 1.98 ఎకరాలను రూ.153.94 కోట్ల ఆదాయం సమకూరింది.వేలంలో ప్లాట్లను దక్కించుకున్న సంస్థలు వారం రోజుల్లో 25 శాతం చెల్లించాల్సి ఉండగా.. ఈఎండీ (దరావతు)తో కలిపిన 75 శాతాన్ని 60 రోజుల్లో చెల్లించాలి. హెచ్‌ఎండీఏ అంచనాలకు మించిన ఆదాయం సమకూరడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా కూకట్‌పల్లి మూసాపేటలో 15 ఎకరాల స్థలాన్ని శుక్రవారం విక్రయించాల్సి ఉండగా.. పార్కులు, ఇతర ఆట స్థలాల కోసమంటూ స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ స్థలాన్ని హెచ్‌ఎండీఏ వేలం వేయలేదు. ఈ స్థలాన్ని ప్రజావసరాల కోసం వినియోగించనున్నారు.
ఇక కోకాపేట జోష్ ఇప్పుడు తెల్లాపూర్‌కి కూడా చేరుతున్నట్లు రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు దగ్గరగా ఉండటం, ఔటర్ రింగ్ రోడ్ ఈ ప్రాంతం ద్వారానే వెళ్లడం, ఐటీ ఉద్యోగుల డిమాండ్ పెరగడం ఇవన్నీ కలిసి తెల్లాపూర్‌ను వేగంగా ముందుకు నడుపుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ అపార్ట్‌మెంట్ రేట్లు 70 లక్షల నుంచి రెండు కోట్లకుపైనే ఉండగా, విల్లాల ధరలు మూడు కోట్ల నుంచి పది కోట్ల వరకు ఉన్నాయి. పెద్ద స్థాయిలో గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, అలాగే భారీ కంపెనీల పెట్టుబడులు అన్నీ కలిసి ఈ ప్రాంత భవిష్యత్తును కోకాపేట స్థాయికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.
Follow Us