Ponnam Prabhakar: సమస్యల పరిష్కారానికి సిద్ధం...సమ్మె విరమించండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి

ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కార్మికులు తక్షణమే సమ్మె విరమించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా ఉందని, సమ్మె వల్ల పేద ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని కోరారు.

New Update
FotoJet - 2026-04-22T114427.116

Minister Ponnam Prabhakar

Ponnam Prabhakar: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం కీలక ప్రకటన చేశారు. ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కార్మికులు తక్షణమే సమ్మె విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా ఉందని, సమ్మె వల్ల పేద ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ప్రకటనలోని ముఖ్యాంశాలు ...

ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం ఇప్పటికే నలుగురు ఉన్నతాధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని మంత్రి గుర్తు చేశారు. ఈ కమిటీ నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని గడువు విధించామని, దీనిని కాలయాపనగా భావించవద్దని కోరారు.కార్మికులు లేవనెత్తిన 32 ప్రధాన అంశాల్లో 29 అంశాల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇవన్నీ తక్షణమే పరిష్కారమయ్యేవేనని తెలిపారు. కేవలం 'ఆర్టీసీ విలీనం', 'గుర్తింపు సంఘాల ఎన్నికలు' అనే రెండు అంశాల్లో మాత్రమే కొన్ని సాంకేతిక చిక్కులు ఉన్నాయని, వాటిపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఆర్టీసీని పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ అభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి గణాంకాలతో వివరించారు:పెండింగ్‌లో ఉన్న 2017 పీఆర్సీని అమలు చేయడంతో పాటు, పెండింగ్ డీఏలను కూడా చెల్లించాం. 2013 నాటి పెండింగ్ బాండ్స్ క్లియర్ చేశాం. రూ.1205 కోట్లుగా ఉన్న పీఎఫ్ బకాయిలను రూ.600 కోట్లకు, రూ.690 కోట్లుగా ఉన్న సీసీఎస్ బకాయిలను రూ.300 కోట్లకు తగ్గించాం. ప్రతి నెలా వీటికి అదనంగా రూ.75 కోట్లు చెల్లిస్తున్నాం.పని భారం తగ్గించేందుకు 4538 కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశలో ఉంది. 1134 కారుణ్య నియామకాలు పూర్తి చేశాం. గత ప్రభుత్వంలో వివిధ కారణాలతో తొలగించబడిన 250 మందికి పైగా కార్మికులకు తిరిగి ఉద్యోగాలు ఇచ్చాం.

ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, ఈ సమయంలో సమ్మె చేయడం "మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు" అవుతుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.నిత్యం 65 లక్షల మంది ప్రయాణిస్తుంటే, అందులో 45 లక్షల మంది మహిళలే ఉంటున్నారు. పేదలు, విద్యార్థులు, రోగులు ఆర్టీసీపైనే ఆధారపడి ఉన్నారని, వారికి ప్రైవేట్ కార్లలో వెళ్లే స్తోమత లేదని మంత్రి గుర్తు చేశారు."ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు మీ నాయకులకు ఉంది. ప్రభుత్వంపై ఒత్తిడి తేవచ్చు. కానీ, బస్సులు ఆపేసి సామాన్యులను ఇబ్బంది పెట్టవద్దు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తరఫున కొట్లాడి మీ సమస్యలు సాధించుకుందాం" అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కుటుంబ సభ్యులకు ఆత్మీయ విజ్ఞప్తి చేశారు.

మంత్రి ప్రకటనతో ప్రభుత్వం కార్మికుల పట్ల సానుకూల ధోరణితో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే, మంత్రి విజ్ఞప్తిపై కార్మిక సంఘాలు ఎలా స్పందిస్తాయో, సమ్మె విరమణ దిశగా అడుగులు పడతాయో లేదో వేచి చూడాలి.

Advertisment
తాజా కథనాలు