KAKATIYA MEDICAL COLLEGE : కేఎంసీలో ర్యాగింగ్ కలకలం..ఏడుగురు సీనియర్లు సస్పెండ్‌

వరంగల్‌లోని కాకతీయమెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం రేపింది. సీనియర్ విద్యార్థులు జూనియర్‌ లను మోకాళ్ళ పై కూర్చోబెట్టి ఇబ్బందులకు గురి చేశారని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఏడుగురు సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేశారు.

New Update
FotoJet (12)

KAKATIYA MEDICAL COLLEGE

KAKATIYA MEDICAL COLLEGE : రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రముఖ వైద్య కళాశాల అయిన వరంగల్‌లోని  కాకతీయ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం రేపింది. గతంలో ఇలాంటి ఆరోపణలే రాగా, అధికారులు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ ర్యాగింగ్ భూతం మరోసారి పడగ విప్పటం స్థానికంగా సంచలనం సృష్టించింది. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో జూనియర్‌ విద్యార్థులకు, సీనియర్ విద్యార్థులకు మద్య ఘర్షణ తలెత్తింది. సీనియర్ విద్యార్థులు జూనియర్‌ విద్యార్థులను మోకాళ్ళ పై కూర్చోబెట్టి ఇబ్బందులకు గురి చేశారని జూనియర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో  అధికారులు సీనియర్ విద్యార్థులపై చర్యలకు ఉపక్రమించారు.

అయితే ఎక్కువగా కొత్తగా కాలేజీలో చేరిన విద్యార్థులను మాత్రమే ర్యాగింగ్‌ చేసే సందర్భాలు ఉండగా  ఇక్కడ మాత్రం ఎంబీబీఎస్ రెండు, మూడవ సంవత్సరాలు చదువుతున్న విద్యార్థుల ర్యాగింగ్‌ ఘర్షణ చోటు చేసుకోవడం ఆసక్తిగా మారింది. దీనికి కారణం ఒక వాట్సాప్‌ మెస్సేజ్‌ అనే ప్రచారం సాగుతోంది. సెకండియర్‌ ఎంబీబీఎస్ విద్యార్థుల వాట్సప్ గ్రూప్ లో థర్డ్‌ ఇయర్‌ విద్యార్థుల గురించి తప్పుగా పోస్టులు పెడుతున్నారనే  సమాచారంతో ఈ ఘర్షణ మొదలైనట్లు తెలుస్తోంది.  తమ గురించి జూనియర్స్ తప్పుగా మాట్లాడడం సరియైంది కాదు.. వారికి బుద్ది చెప్పి తీరాల్సిందే అని సీనియర్స్ పట్టుబట్టారు. ఈ క్రమంలో 20 మంది జూనియర్‌ విద్యార్థులను హాస్టల్‌ టెర్రస్‌ పైకి తీసుకెళ్లిన సీనియర్లు వారిని మోకాళ్లపై కూర్చో బెట్టి తప్పయిందని..మరోసారి ఇలా చేయమని సారీ చెప్పించుకున్నారు. అనంతరం వారిని మరింత ఇబ్బంది పెట్టారని సమాచారం. అయితే దీన్ని అవమానంగా భావించిన కొంతమంది జూనియర్‌ విద్యార్థులు నేషనల్ మెడికల్ కౌన్సిల్  మొదలు  సంబంధిత శాఖాధికారులకు ఫిర్యాదు చేశారు.. అంతటితో ఆగకుండా వరంగల్ పోలీస్ కమిషనర్ కు కూడా బాధిత విద్యార్థులు ఫిర్యాదు చేశారు.. దీంతో కళాశాల అధికారులు రంగంలోకి దిగారు..

ర్యాగింగ్ నిజమే..

అయితే కాకతీయ మెడికల్ కళాశాలలో రాగింగ్ ఆరోపణల ఫిర్యాదు మేరకు యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా కేఎంసీ యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యురాలు.,అనురాగ్ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ సెక్రటరీ.ఫౌండర్ చైర్మన్.. అనితా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల మధ్య సుహృధ్బావ వాతావరణం ఉండేలా చూడాలని కేఎంసీ ఆధికారులకు చెప్పాం .. ర్యాగింగ్ చేసిన వారి మీద తప్పనిసరిగా చర్యలు ఉంటాయి..ఎలాంటి చర్యలు ఉంటాయని మాత్రం ఇపుడే చెప్పలేం అన్నారు.

ఆరునెలల పాటు సస్పెన్షన్‌

కాగా, ఎంబీబీఎస్‌ సెకండియర్‌ విద్యార్థులను మోకాళ్లపై కూర్చోబెట్టిన సీనియర్ల విషయంలో అధికారులు చర్యలు తీసుకున్నారు. జూనియర్లను ర్యాగింగ్‌ చేసిన ఏడుగురు సీనియర్లను సస్పెండ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వారిని ఆరు నెలలపాటు సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు