/rtv/media/media_files/2026/05/13/bandi-bhagirath-is-absconding-2026-05-13-12-27-27.jpg)
Bandi Bhagirath is absconding
Bandi Bhagirath :కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై 'పోక్సో' (POCSO) చట్టం కింద కేసు నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో "బండి భగీరథ్ అబ్‌స్కాండింగ్ (పరారీ)" అంటూ వెలిసిన పోస్టర్లు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లు, పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. అందులో.. "బండి భగీరథ్ పరారీలో ఉన్నాడు. ఈయన ఆచూకీ తెలిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో తెలియజేయండి" అని రాసి ఉండటం గమనార్హం. గత కొన్ని రోజులుగా భగీరథ్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందని, ఆయన పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నారని తెలుస్తోంది. నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
అసలేం జరిగింది? 'సిట్' రంగ ప్రవేశం
నగరంలోని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై ఒక బాలిక ఫిర్యాదు చేసింది. తనపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.ఈ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సీరియస్‌గా స్పందించారు. చట్టం ముందు ఎవరైనా సమానమేనని, బాధితురాలికి న్యాయం జరిగేలా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో డీజీపీ ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు.కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్న 'సిట్' అధికారులు ఇప్పటికే బండి భగీరథ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం 2:00 గంటలకు విచారణాధికారి ముందు హాజరుకావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. అయితే, భగీరథ్ ప్రస్తుతం పరారీలో ఉండటంతో ఆయన విచారణకు వస్తారా లేదా అనేది ఉత్కంఠగా మారింది.
మరోవైపు, అరెస్ట్ భయంతో బండి భగీరథ్ చట్టపరమైన రక్షణ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తనకు ముందస్తు బెయిల్ (Anticipatory Bail) మంజూరు చేయాలని కోరుతూ ఆయన తెలంగాణ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు రాజకీయ, న్యాయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
మారిన సెక్షన్లు.. తీవ్రమైన లైంగిక దాడి
తొలిత ఈ కేసును భారత న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 74, 75 లతో పాటు, పోక్సో (POCSO) చట్టంలోని సెక్షన్ 11/12 కింద నమోదు చేశారు. అయితే, పోలీసులు బాధితురాలైన మైనర్ బాలిక స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన తర్వాత కేసు తీవ్రత పూర్తిగా మారిపోయింది. బాలిక ఇచ్చిన ప్రాథమిక వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఈ కేసులో పోక్సో సెక్షన్ 5(l) r/w 6 ను చేర్చారు. చట్టప్రకారం దీనిని 'తీవ్రమైన లైంగిక దాడి' (Aggravated Penetrative Sexual Assault) గా పరిగణిస్తారు. దీని కింద నేరం నిరూపితమైతే కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. కాగా, చట్టపరంగా కేసును మరింత బలోపేతం చేసేందుకు బాధితురాలి స్టేట్‌మెంట్‌ను పోలీసులు మరోసారి రికార్డు చేయాలని భావిస్తున్నారు.
హైదరాబాద్‌లో వెలిసిన పోస్టర్లు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్
మరోవైపు, ఈ వ్యవహారం రాజకీయంగా కూడా ఉత్కంఠ రేపుతోంది. హైదరాబాద్‌లోని కీలక ఐటీ కారిడార్ ప్రాంతాలైన శేరిలింగంపల్లి, గచ్చిబౌలి సహా అనేక ప్రాంతాలలో బండి భగీరథ్‌కు వ్యతిరేకంగా ప్రత్యేక పోస్టర్లు వెలిశాయి. ఆయన చేసిన పనిని తప్పుపడుతూ, ప్రస్తుతం ఆయన పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నారనే ఆరోపణలతో ఈ పోస్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు అంటించారు. ఇటు క్షేత్రస్థాయిలోనే కాకుండా, సోషల్ మీడియా వేదికల్లోనూ ఈ పోస్టర్లు, భగీరథ్ అబ్స్కాండింగ్ వ్యవహారం విపరీతంగా వైరల్ అవుతూ హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం 'సిట్' నోటీసుల గడువు ముగియనుండటం, నిందితుడు అందుబాటులో లేకపోవడం మరియు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో.. సైబరాబాద్ పోలీసులు భగీరథ్‌ను అరెస్ట్ చేయడానికి లుకౌట్ నోటీసులు జారీ చేస్తారా లేదా చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది రాబోయే కొన్ని గంటల్లో తేలనుంది.
Follow Us