MLA Rammohan Reddy : కుల్కచర్లలో డ్రోన్ ప్రదర్శనలో అపశృతి! పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి గాయాలు?

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో నూతనంగా కొనుగోలు చేసిన డ్రోన్ ప్రదర్శనలో అపశృతి చోటు చేసుకుంది.

New Update
FotoJet (95)

Parigi MLA Rammohan Reddy

MLA Rammohan Reddy : వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఆదివారం నాడు జరిగిన ఓ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో రైతుల కోసం నూతనంగా కొనుగోలు చేసిన డ్రోన్ ప్రదర్శన నిర్వహిస్తుండగా ఈ అపశృతి చోటు చేసుకుంది. వ్యవసాయ పనుల కోసం డ్రోన్‌ల వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ట్రయల్ రన్, అనూహ్యంగా ప్రమాదకరంగా మారడంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

అసలేం జరిగిందంటే, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఈ డ్రోన్ ప్రదర్శనను అధికారికంగా ప్రారంభించారు. డ్రోన్ గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో ఆపరేటర్ దానిపై నియంత్రణ కోల్పోయారు. దీంతో అదుపు తప్పిన ఆ డ్రోన్ ఒక్కసారిగా వేగంగా కిందకు దూసుకొస్తూ, అక్కడ నిలబడి ఉన్న ఎమ్మెల్యే ,ఇతర నాయకులపైకి దూసుకెళ్లింది. డ్రోన్ రెక్కలు బలంగా తగలడంతో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కాలికి గాయమైంది.

ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేతో పాటు పలువురు స్థానిక నాయకులు కూడా గాయపడ్డారు. తిరుమలపూర్ వెంకటయ్య గౌడ్ కాలికి తీవ్రమైన దెబ్బ తగిలి రక్తస్రావం కాగా, రాంపూర్ సర్పంచ్ తిరుపతయ్య చేతి బొటనవేలు తెగిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు, అనుచరులు క్షతగాత్రులను హుటాహుటిన పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వారికి అత్యవసర చికిత్స అందించారు.

ప్రస్తుతం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో పాటు మిగిలిన వారి పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు ధృవీకరించారు. సాంకేతిక లోపం కారణంగా జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఎమ్మెల్యేకు తృటిలో ప్రాణాపాయం తప్పడంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

Advertisment
తాజా కథనాలు