Revision of land market values : తెలంగాణలో భూముల కొత్త మార్కెట్ విలువల ఖరారు..రేపటి నుంచే అమల్లోకి..

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూములు, ప్లాట్లు, అపార్టుమెంట్ల కొత్త మార్కెట్ విలువలను అధికారికంగా ఖరారు చేసింది. క్షేత్రస్థాయిలో లోతైన అధ్యయనం నిర్వహించిన అనంతరం.. ప్రస్తుత మార్కెట్ రేట్లను సవరించింది.

New Update
FotoJet - 2026-06-04T081312.245

Revision of land market values

Revision of land market values : తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూములు, ప్లాట్లు, అపార్టుమెంట్ల కొత్త మార్కెట్ విలువలను అధికారికంగా ఖరారు చేసింది. క్షేత్రస్థాయిలో లోతైన అధ్యయనం నిర్వహించిన అనంతరం.. ప్రస్తుత మార్కెట్ రేట్లు, అక్కడి వాస్తవ పరిస్థితులు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు మరియు గ్రోత్ కారిడార్లను ప్రామాణికంగా తీసుకుంటూ ఈ సవరణలు చేపట్టారు. రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ దాదాపు 92,000 ప్రాంతాలలో ఈ మదింపు ప్రక్రియను పూర్తి చేసింది. ప్రభుత్వం ఆమోదించిన ఈ సరికొత్త ధరలను గురువారం నాడే అధికారిక పోర్టల్‌లో అప్‌డేట్ చేయగా, పెరిగిన కొత్త మార్కెట్ విలువలు శుక్రవారం (ఈ నెల 5) నుండి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఒకేలా కాకుండా, అవసరాన్ని బట్టి పలుచోట్ల భూముల విలువలను పెంచగా, మరికొన్ని చోట్ల పాత ధరలనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ విలువ చాలా తక్కువగా ఉండి, బహిరంగ మార్కెట్ (ఓపెన్ మార్కెట్) ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నూరు శాతం (100%) వరకు విలువలను పెంచారు. ఇప్పటికే గరిష్ఠ విలువలు ఉన్నచోట మాత్రం ఎలాంటి పెంపుదల చేపట్టలేదు. పలు ప్రాంతాలలో ఈ పెంపు 50 నుండి 100 శాతం వరకు ఉన్నట్లు తెలుస్తోంది. భూముల విలువల సవరణ ద్వారా ప్రభుత్వ ఖజానాకు సాలీనా గరిష్ఠంగా రూ. 1,200 కోట్ల వరకు అదనపు రాబడి సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపలి శివారు ప్రాంతాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్నా, బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నా.. ప్రభుత్వ రికార్డుల్లో భూముల విలువలు తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నగర శివారులలో బహిరంగ మార్కెట్లో చదరపు గజం రూ. 50 వేల నుండి రూ. లక్ష వరకు పలుకుతున్నా, ప్రభుత్వ మార్కెట్ ధర మాత్రం రూ. 12-15 వేల లోపే ఉండటంతో అక్కడ విలువలను సవరించారు. ఇటీవల జీహెచ్‌ఎంసీలో విలీనమైన ఒక గ్రామంలో చదరపు గజం విలువ రూ. 2,100 నుండి ఏకంగా రూ. 4,200 కు పెరిగింది. 'క్యూర్' పరిధిలో కూడా భూముల విలువలు 25 నుండి 75 శాతం, కొన్నిచోట్ల 100 శాతం వరకు పెరిగాయి.

నగరంలో ఇప్పటికే భూముల ధరలు అత్యధికంగా ఉన్న జూబ్లీహిల్స్ వంటి విఐపి ప్రాంతాలలో మార్కెట్ విలువ చదరపు గజానికి రూ. 80 వేలుగా ఉండగా, దాన్ని ఇప్పుడు రూ. 90 వేలకు సవరించినట్లు సమాచారం. మరోవైపు హైదరాబాద్ పాతబస్తీ (ఓల్డ్ సిటీ) పరిధిలోని ప్రాంతాలలో మాత్రం ఈ పెంపుదలను ప్రభుత్వం చాలా తక్కువగా ఉంచింది. అక్కడ కేవలం 10 నుండి 20 శాతం మేరకే ప్రభుత్వ విలువల పెంపుదల పరిమితమైనట్లు తెలుస్తోంది.

తెల్లాపూర్, శంషాబాద్ తదితర ఔటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న కీలక ప్రాంతాలలో ప్రస్తుతం ప్రభుత్వ మార్కెట్ విలువలు చాలా తక్కువగా ఉండటంతో, అక్కడ వ్యవసాయ భూముల విలువను 100 శాతం పెంచనున్నారు. ఉదాహరణకు ఒకచోట ప్రభుత్వ విలువ ఎకరాకు రూ. 30 కోట్లు ఉంటే బహిరంగ మార్కెట్లో దానికి మూడింతల ధర పలుకుతోంది. ఓఆర్ఆర్ వెలుపలి ప్రాంతాలలో గతంలో ఎకరా రూ. 20 లక్షలున్న చోట ఇప్పుడు రూ. 40 లక్షలు చేశారు. ఇబ్రహీంపట్నం పరిధిలో ఎకరా మార్కెట్ విలువ రూ. 20 లక్షల నుండి రూ. 75 లక్షల మధ్య ఉండగా, 100% పెంపుతో అది రూ. 40 లక్షల నుండి రూ. కోటీ 50 లక్షల వరకు చేరనుంది. అలాగే రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్ అయిన కోకాపేట తదితర ప్రాంతాల్లో ఎకరా ప్రభుత్వ విలువ రూ. 4 కోట్ల నుండి రూ. 8 కోట్లకు సవరించారు.

హైదరాబాద్ వెలుపల ఉన్న వరంగల్, ఖమ్మం తదితర ప్రధాన నగరాల పరిధిలో వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువలు 50 నుండి 70 శాతం వరకు పెరగనున్నాయి. కరీంనగర్ గ్రామీణ ప్రాంతాలలో భూముల విలువ ఇప్పటికే చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి చోట్ల ధరలను ప్రభుత్వం స్వల్పంగానే సవరించింది. ఉదాహరణకు కరీంనగర్ పరిధిలో ఎకరా ధర రూ. 30 లక్షలున్న చోట దాన్ని రూ. 35 లక్షలకు, అలాగే రూ. 60 లక్షలున్న చోట రూ. 70 లక్షలకు మాత్రమే సవరించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న అపార్టుమెంట్ల (ఫ్లాట్ల) ప్రభుత్వ విలువలు గరిష్ఠంగా 20 శాతం మాత్రమే పెరగనున్నాయి. కొన్ని ప్రాంతాలలో కొనుగోలుదారులపై భారం పడకుండా ఈ పెంపును 10 శాతానికే పరిమితం చేశారు. ఉప్పల్, బండ్లగూడ, హబ్సిగూడ, కొత్తపేట, నాచారం తదితర ప్రాంతాలలో ప్రస్తుతం అపార్టుమెంట్ల ప్రభుత్వ మార్కెట్ విలువ చదరపు అడుగుకు రూ. 2,500 గా ఉండగా, తాజా సవరణతో ఇది రూ. 3,000 కు పెరగనుంది.

ప్రభుత్వ కమిటీ అధ్యయనంలో పలు కీలక ప్రాంతాల వాస్తవ విలువలు వెలుగులోకి వచ్చాయి. దారుస్సలాంలో ప్రస్తుతం ప్రభుత్వ విలువ గజం రూ. 32,200, ఫ్లాట్ చదరపు అడుగు రూ. 4 వేలుగా ఉంది. అయితే వాస్తవ ప్రైవేటు విలువ గజం రూ. 1,20,000, చదరపు అడుగు రూ. 11 వేలుగా ఉండటంతో.. సమతుల్యత కోసం అక్కడ చదరపు గజం రూ. 50 వేలుగా, చదరపు అడుగు రూ. 5 వేలుగా ఖరారు చేశారు. వనస్థలిపురంలోని కోదండరాంనగర్ కాలనీలో ప్రస్తుతం గజం విలువ రూ. 20,300 ఉండగా, ప్రైవేటు మార్కెట్లో రూ. 40 వేలు ఉన్నట్లు కమిటీ నిర్ధారించింది. దీంతో అక్కడ కొత్తగా గజం విలువను రూ. 25 వేలుగా ఖరారు చేశారు. కాగా, మండల కేంద్రాలలో విలువలు పెరిగినప్పటికీ.. మెజారిటీ గ్రామాల్లోని ప్లాట్లు, వ్యవసాయ భూములకు సంబంధించి ఎలాంటి మార్పులు లేకుండా పాత విలువలనే కొనసాగిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు