Crime News : సినిమా ఫక్కీలో బీఆర్ఎస్ నేత మధు హత్య...మర్డర్ వెనుక 19 ఏళ్ల పాతకక్ష..

సూర్యాపేట జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. 2007లో హత్యకు గురైన మిద్దె రవిందర్ కొడుకు మిద్దె జీవన్ ప్రధాన నింధితుడిగా పోలీసులు తేల్చారు.

New Update
FotoJet (7)

BRS leader Madhu Murder

Crime News : సూర్యాపేట జిల్లా యార్కరం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఐదేళ్లుగా పక్కా ప్లాన్, రెండు విఫలయత్నాలు, చివరకు నమ్మిన స్నేహితులతో కలిసి మద్యం మత్తులో అత్యంత కిరాతకంగా నరికి చంపిన వైనాన్ని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సోమవారం మీడియా సమక్షంలో వెల్లడించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో మహిళ పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. గత 19 ఏళ్లుగా రగులుతున్న పాతకక్షల నేపథ్యంలోనే ఈ దారుణ హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మర్డర్ మిస్టరీకి సంబంధించిన సమగ్ర వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ దారుణ హత్యకు వెనుక దాదాపు రెండు దశాబ్దాల నాటి రాజకీయ, వ్యక్తిగత పాతకక్షలు ఉన్నాయి. 2007వ సంవత్సరంలో యార్కరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిద్దె రవీందర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆ హత్యానేరం బీఆర్ఎస్ నేత చింతలపాటి మధుపై ఉంది. తన తండ్రి రవీందర్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన కొడుకు, ప్రధాన నిందితుడు మిద్దె జీవన్ ఐదేళ్లుగా సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. గతంలో మధుపై జీవన్ రెండుసార్లు హత్యాయత్నం చేసినప్పటికీ మధు ప్రాణాలతో తప్పించుకున్నాడు. ఈసారి ఎలాగైనా మట్టుబెట్టాలని నమ్మిన స్నేహితులతో కలిసి పక్కా వ్యూహం రచించాడు. మధు ప్రస్తుతం కుటుంబంతో కలిసి సూర్యాపేట బాలాజీనగర్‌లో నివసిస్తున్నాడు. ఆయన్ను బయటకు రప్పించేందుకు నిందితులు మధుకు అత్యంత సన్నిహితుడైన చింత సైదులును వాడుకున్నారు.శుక్రవారం సాయంత్రం చేపల కూరతో పార్టీ చేసుకుందామంటూ చింత సైదులు.. తాళ్లగడ్డలోని తన కిరాయి ఇంటికి మధును పిలిపించాడు. అక్కడ సైదులుతో పాటు జిమ్ ట్రైనర్ మేదరి ప్రసాద్ కూడా ఉన్నాడు. పథకం ప్రకారం...ముగ్గురూ కలిసి మద్యం సేవించే క్రమంలో, నిందితులు ముందుగా ప్లాన్ చేసినట్లుగా మధు తాగే మద్యంలో మత్తుమందు కలిపారు. అది తాగిన కొద్దిసేపటికే మధు స్పృహ తప్పి పడిపోయాడు.

మధు మత్తులోకి జారుకోగానే సైదులు ఫోన్ చేసి ప్రధాన నిందితుడు జీవన్‌కు సమాచారం ఇచ్చాడు. జీవన్ తన సోదరుడి వరుసయ్యే ఆనంద్‌తో కలిసి మటన్ కొట్టే పదునైన కత్తులతో అక్కడికి చేరుకున్నాడు. జీవన్, సైదులు కలిసి మధును విచక్షణారహితంగా నరికి చంపారు. .హత్య అనంతరం మృతదేహాన్ని గొనెసంచితో మూటగట్టారు. ఒక కారును అద్దెకు (రెంట్) తీసుకొని, అందులో శవాన్ని ఎక్కించి శనివారం తెల్లవారుజామున యార్కరం గ్రామ శివారులోని ఒక కల్వర్టు కింద పడేసి పరారయ్యారు. హత్య చేసిన అనంతరం నిందితులే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. కేసు తీవ్రత దృష్ట్యా రంగంలోకి దిగిన పోలీసులు.. శనివారం ఇద్దరు నిందితులను, ఆదివారం మిగిలిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్‌ అయిన వారిలో మిద్దె జీవన్ (ప్రధాన నిందితుడు - రవీందర్ కొడుకు),చింత సైదులు (మధు స్నేహితుడు),మేదరి ప్రసాద్ (జిమ్ ట్రైనర్),మిద్దె ఆనంద్‌, కక్కిరేణి భరత్ చంద్ తదితరులున్నారు.  ఈ హత్యకు పూర్తిగా సహకరించిన చింత సైదులు భార్య ముల్కలపల్లి భవానీ ప్రస్తుతం పరారీలో ఉందని, ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్పీ నరసింహ తెలిపారు.నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కారు, ఒక బైక్, కత్తులు,ఐదు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు సూర్యాపేట పోలీసులు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు