ప్రభుత్వం ప్రకటించిన ఎస్సీ వర్గీకరణపై మందకృష్ణ మాదిగ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు 11 శాతం రిజర్వేషన్ దక్కాల్సి ఉండగా.. 2 శాతం తగ్గించారన్నారు. మాదిగలను చేర్చిన గ్రూప్-2కు 9 శాతం రిజర్వేషన్లు సిఫారసు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని సరి చేయాలన్నారు. వెనుకబాటును ప్రమాణికంగా తీసుకుంటే తామను తప్పక పరిగణలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. మొదటి గ్రూపుకు వెనుకబాటు ఆధారంగా ఒక శాతం ఇచ్చారన్నారు. పంబాల కులం అడ్వాన్స్డ్ అని అన్నారు. వారిని తీసుకువచ్చి అత్యంత వెనుకబాటకు గురైన కులాల జాబిలాలో చేర్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ గంటా చక్రపాణి కుట్ర ఇందులో ఉందని ఆరోపించారు.
మన్నే అనే కులం కూడా అభివృద్ధి చెందిన కులమేనన్నారు. అత్యంత వెనుకబాటుకు గురైన కులాల జాబితాలో వీరిని చేర్చడం అవకాశాలను దోచుకోవడం కోసమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవడానికి సర్వశక్తులను ఒడ్డారన్నారు. కానీ ఇది ఆగదని మాదిగల ప్రాతినిధ్యం తగ్గించేందుకు కుట్ర పన్నారన్నారు. అందుకే తమకు రావాల్సిన 11 శాతం రిజర్వేషన్లను 9కి తగ్గించారని ధ్వజమెత్తారు. ఎస్సీల్లో మూడో అత్యధిక జనాభా కలిగిన నేతకాని కులాన్ని మాలలు ఉన్న గ్రూపులో కలపడం కూడా కుట్రేనన్నారు. వారి అవకాశాలు దోచుకోవడానికే ఇలా చేశారన్నారు.
దామోదర్ ఫెయిల్.. వివేక్ సక్సెస్
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని.. ముందుకు సాగుతుండడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కానీ వర్గీకరణ చేసిన విధానం అశాస్త్రీయంగా ఉందన్నారు. జనాభా, వెనుకబాటుతాన్ని సరిగా చూడలేకపోయారని ఫైర్ అయ్యారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇప్పించడంతో దామోదర్ విఫలం అయ్యాడని ఆరోపించారు. మాలలకు ఉన్న దాని కన్నా ఎక్కువ రిజర్వేషన్లను ఇప్పించడంలో వివేక్ సక్సెస్ అయ్యాడన్నారు. నేతకాని వాళ్లను మాలలతో కలపడంతో ఆయన కుట్ర ఉందన్నారు. కానీ మాదిగలకు రావాల్సిన వాటా సాధించడంలో దామోదర్ ఫెయిల్ అయ్యాడన్నారు. ఈ పరిస్థితుల్లో మాదిగ ప్రతినిధిగా దామోదర్ ను చూడడం లేదన్నారు.