/rtv/media/media_files/2026/04/24/cv-anand-to-take-charge-as-dgp-in-telangana-2026-04-24-20-36-50.jpg)
CV Anand DGP in telangana
DGP CV Anand : తెలంగాణలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపడుతోందని డీజీపీ సీ.వీ. ఆనంద్ వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ, గత రెండు నెలలుగా ఈ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అయితే, రాష్ట్రంలోని 44వ జాతీయ రహదారిపైనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనికి రహదారులపై అక్రమ పార్కింగ్ చేయడమే ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు. ప్రమాదాల నియంత్రణ అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, వాహనదారులు డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవర్చుకుంటూ, వేగాన్ని నియంత్రించుకుని సురక్షితంగా ప్రయాణించాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మహమ్మారి వ్యాప్తిపై డీజీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి ప్రస్తుతం గ్రామాల్లోకి సైతం విస్తరిస్తోందని, పంజాబ్ రాష్ట్రం తరహాలో తెలంగాణ యువత డ్రగ్స్‌కు బానిసలు కావద్దని హితవు పలికారు. భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో గంజాయి సాగు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని.. చట్టవ్యతిరేకంగా గంజాయి సాగు చేసిన 110 మంది రైతులకు ఇప్పటికే 'రైతు భరోసా' నిలిపివేసినట్లు ఒక సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ఇదే సమయంలో ఆదిలాబాద్ జిల్లా పోలీసుల పనితీరును డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడి పోలీసులపై ఎలాంటి ఫిర్యాదులు లేవని, వారు అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రజలతో మాట్లాడేటప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అవలంబించాలని సిబ్బందికి సూచించారు. అదే సమయంలో నేరగాళ్లు, గూండాలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల పోలీస్ అంటే వణుకు పుట్టేలా స్ట్రాంగ్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో మావోయిజం పూర్తిగా అంతరించిందని డీజీపీ సీ.వీ. ఆనంద్ అధికారికంగా ప్రకటించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరపున పూర్తి పునరావాసం కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో నక్సలైట్ల అలజడి పూర్తిగా తగ్గడంతో, నక్సల్స్ నిరోధక విభాగమైన 'గ్రేహౌండ్స్' ఫోర్స్‌ను కొంతమేర తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. అలా తగ్గించిన గ్రేహౌండ్స్ సిబ్బందిని ఇకపై రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార కల్తీ నియంత్రణ కోసం, అలాగే రహదారులపై ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కోసం సమర్థవంతంగా వినియోగించుకోనున్నట్లు డీజీపీ వివరించారు.
Follow Us