ఫార్ములా-ఈ కారు రేసు రోజుకో మలుపు తిరుగుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 10 : 30 గంటలకు నందినగర్ లోని ఆయన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. వాస్తవానికి ఈడీ విచారణకు జనవరి 07వ తేదీనే ఆయన వెళ్లాల్సి ఉంది కానీ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ నేపథ్యంలో కేటీఆర్ గడువు కోరడంతో నేడు రావాలని ఈడీ మరోమారు నోటిసులిచ్చింది. ఇప్పటికే ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలనుఈడీ విచారించింది. దీంతో ఇవాళ జరిగే పరిణామాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈడీ విచారణ అనంతరం అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది.
సుప్రీంకోర్టు బిగ్ షాక్
ఫార్ములా-ఈ కారు రేసులో ఏసీబీ తన మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై 2025 జనవరి 15వ తేదీన విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ జరగాలని సుప్రీం అభిప్రాయపడింది. దీంతో కేటీఆర్ ఈ కేసులో విచారణ ఎదుర్కోనున్నారు. కాగా ఇప్పటికే కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో నిరాశే ఎదురైంది. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ జనవరి 07వ తేదీన ఉత్తర్వులు వెలువరించింది. దీనిని సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం కేటీఆర్ కు అన్ని దారులు మూసుకుపోవడంతో విచారణకు హాజరుకాక తప్పని పరిస్థితి నెలకొంది. ఇక ఆయనను ఇప్పటికే ఏసీబీ 07 గంటల పాటు విచారించింది. ఫార్మలా ఈ రేసు విషయంలో బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, నిధుల దుర్వినియోగం చేశారన్న ఆరోపణలను కేటీఆర్ ఎదుర్కొంటున్నారు.
ఇంతకీ కేసు ఏంటంటే!
2023లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్వహించిన ఫార్ములా- ఈ కార్ రేసుకు ఆశించిన ఆదాయం రాకపోవడంతో ప్రమోటర్ తప్పుకున్నారు. దీంతో ఆనాడు మంత్రి గా ఉన్న కేటీఆర్ రిక్వెస్ట్ చేయడం వల్ల 2024 ఫిబ్రవరి నెలలో జరగాల్సిన 2వ దఫా రేస్ నిర్వహణకు HMDA రూ.55 కోట్లు FEOకు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. అయితే ఎన్నికల వేళ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూ.755 కోట్లు ఇవ్వడంపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుబట్టింది.
కాగా కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే చెల్లించినట్లు పురపాలక శాఖ కమిషనర్ విచారణలో తెలిపారు. కాగా దీనిపై గతంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి జరిగిన విషయాలను బయటపెట్టారు. దీనిపై విచారణను ఏసీబీకు అప్పగించింది రేవంత్ సర్కార్. ఈ కేసులో పూర్తి వివరాలను బయటకు రాబట్టేందుకు మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ చేసి విచారణ చేయాలని ఏసీబీ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కేటీఆర్ అరెస్ట్ అనుమతి కొరకు గవర్నర్ కు లేఖ రాశారు. దీనిపై రాష్ట్ర గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారా? అనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది.
Also Read : తెలంగాణలో పరీక్షల తేదీల ప్రకటన.. EAPCET, ICETతో పాటు ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?