KCR అమెరికా టూర్.. రేవంత్ రెడ్డి ఆపుతాడా..?

మాజీ సీఎం కేసీఆర్ అమెరికా టూర్ వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మనువడి హిమాన్ష్‌తో సమయం గడపడానికి కేసీఆర్ అమెరికా వెళ్లి.. 2025 ఫిబ్రవరిలో తిరిగి రానున్నట్లు బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చలు నడుస్తున్నాయి.

author-image
By K Mohan
New Update
KCR us

బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ వ్యూహాలతో బీఆర్ఎస్ నేతలు బలంగా పోరాడుతున్న వేళ కేసీఆర్ పూర్తిగా రాజకీయాలకు బ్రేక్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నుంచి ఆయన ప్రజల్లోకి, అసెంబ్లీ సమావేశాలకు రాలేదు. నాలుగైదు నెలల నుంచి ఫామ్‌హౌస్‌కే పరిమితమైన సీఎం కేసీఆర్ చడీచప్పుడు కాకుండా అమెరికా వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైయ్యాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి పలు మార్లు కేసీఆర్ ను జైలుకు పంపుతా అని అన్నారు. ఈ క్రమంలోనే  గతప్రభుత్వంపై ఉన్న ఆరోపణలన్నీ విచారించడానికి కమిషన్లు వేశారు.

విద్యుత్ కొనుగోళ్లు , కాళేశ్వరం కమిషన్లు, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ దగ్గరపడుతున్న సందర్భంలో కేసీఆర్ అమెరికా పర్యటనపై కాంగ్రెస్ పార్టీలో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కేసులు తప్పించుకోవడానికే కేసీఆర్ అమెరికా వెళ్తున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ అమెరికా టూర్ అడ్డుకుంటారా..? లేదా తిరిగి వచ్చాకా ఆయా కేసుల్లో విచారణ చేస్తారా అనేది తెలియాల్సింది ఉంది. ఏదో ఒక విచారణలో నోటీసులు ఇచ్చి గులాబీ బాస్ కేసీఆర్‌ను అమెరికా పోనివ్వకుండా చేస్తాడా అనేది చూడాలి. లేదంటే కేసీఆర్‌ను వదిలేసి.. ఈ-ఫార్ములా వ్యవహారంలో కేటీఆర్‌ను టార్గెట్ చేస్తారా అనేది ప్రశ్నార్థకం. 

అమెరికాకు కేసీఆర్

గులాబీ బాస్ అమెరికా పర్యటన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు.. కానీ, పార్టీ శ్రేణుల్లో మాత్రం ఈ విషయం గురించి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పర్యటన 2025 ఫిబ్రవరిలో పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ కొడుకు హిమాన్ష్ ప్రస్తుతం అమెరికాలోనే ఉంటున్నాడు. అయితే మనువడితో సమయాన్ని గడపడానికి కేసీఆర్ అమెరికా టూర్ వెళ్తున్నట్లు సమాచారం. అలాగే కేసీఆర్ ఆరోగ్య సమస్యలకు హెల్త్ టెస్టులు కూడా చేయించుకోనున్నారని టాక్. 

విచారణ జరుగుతుండగా వెళ్లడం సాధ్యమేనా?

ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణలు జరుగుతున్న సమయంలో కేసీఆర్ అమెరికా వెళ్లడం సాధ్యమేనా..? రేవంత్ సర్కార్ కేసీఆర్ అమెరికా పర్యటనకు బ్రేక్ వేస్తోందా..? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్‌లో కీలక నిందితుడు ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్ రావు కూడా అమెరికాలోనే ఉన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలకు కూడా రాని మాజీ సీఎం కేసీఆర్ మనువడితో గడపడానికి అమెరికా వెళ్తున్నాడంటే ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ కొంతకాలం పాటు పాలిటిక్స్ కు విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఫస్ట్ టైం అమెరికాకు కేసీఆర్ 

ఇదిలా ఉంటే కేసీఆర్ అమెరికా వెళ్లడం ఇదే మొదటి సారి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో కూడా ఆయన అమెరికా వెళ్లలేదు. రెండు విదేశీ పర్యటనలతో అతి తక్కువ దేశాలకు వెళ్లిన సీఎంగా కేసీఆర్ ఇప్పటి వరకు ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో చైనా, సింగపూర్ మాత్రమే వెళ్లారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు అన్నీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావులే చూసుకుంటున్నారు. ఇటీవలే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో జైలులో ఉండి విచారణ ఎదుర్కొన్న కవిత కూడా సంవత్సరం తర్వాత రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. 

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విచారణ

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్‌ఘడ్‌తో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎల్. నరసింహారెడ్డి చైర్మన్‌గా న్యాయ విచారణ కమిషన్ వేసింది. పవర్ కమిషన్ చైర్మన్‌ను మార్చాలని కేసీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో జస్టిస్ భీం రావ్ లోకూర్ కమిషన్ చైర్మన్ గా నియమితులైయ్యారు.

విద్యుత్ ఫ్లాంట్ల నిర్మాణాలు, కొనుగోలుకు సంబంధించి జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి హయాంలో జరిగిన విచారణ డాక్యుమెంట్స్ పరిశీలన పూర్తి కావడంతో దుపరి విచారణ ప్రక్రియపై జస్టిస్ లోకూర్ దృష్టి పెట్టారు. కమిషన్ స్టాప్‌తో జస్టిస్ భీం రావ్ లోకూర్ సమావేశం అయ్యారు. విద్యుత్తు కోనుగోలు ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి థర్మలో ఫ్లాంట్ల నిర్మాణాలలో అవతవకలపై విచారణ చేపట్టిన పవర్ కమిషన్ తొలి చైర్మన్ జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి అధికారులను, మాజీ విద్యుత్తు శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డిని విచారించడంతో పాటు మాజీ సీఎం కేసీఆర్ నుంచి వివరణ ఇవ్వాలని కోరారు. అయితే ఆ విచారణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు కొందరి పేర్లు ప్రస్తావించినట్లు సమాచారం. విద్యుత్ కొనుగోళ్ల విచారణ తుది దశకు వచ్చింది. 

కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ రిపోర్ట్‌

లక్ష కోట్ల నిధులతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం గురించి విచారించడానికి జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ కమిషన్‌ ను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ నివేదికను 2024 డిసెంబరు లోగా ఇవ్వాలని జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ కమిషన్‌ను ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కమిషన్‌ విచారణ చేసి నివేదికను సమర్పించే గడువును డిసెంబరు నెలాఖరుదాకా పొడిగిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా జీవో జారీ చేశారు. వాస్తవానికి ఈ నవంబర్ 12 నుంచి జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ మూడో విడత క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంది. అయితే గడువు పొడిగింపు జీవో వెలువడనందున జస్టిస్‌ పీసీ ఘోష్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ షెడ్యూల్‌ను ప్రకటించలేదు.

ఫోన్ ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేషన్

అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కొందరి ఫోన్లు ట్యాపింగ్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్ రావు, సీఐ ప్రణీత్, భుజంగరావు, రాధాకిషన్‌ రావులు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ఉన్నారు. ఈ కేసును ప్రస్తుతం సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఇటీవల నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఈ కేసు విచారణ కూడా వేగంగా జరుగుతుంది. భుజంగరావు, రాధాకిషన్‌ రావులు పోలీస్ కస్టడీలో ఉన్నారు. కేసులో ఇన్వాల్ అయిన ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ అమెరికా వెళ్లడం సాధ్యమౌతుందా? అనే సందేహాలు నెలకొన్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు