/rtv/media/media_files/2026/03/10/insurance-mafia-in-khammam-2026-03-10-09-07-52.jpg)
Insurance mafia in Khammam..
Insurance mafia : మనిషి ప్రాణం కంటే ఇన్సూరెన్స్ పాలసీ 'కాస్ట్లీ'గా మారింది. భీమా చేశామన్న ధీమా ఇప్పుడు కన్పించడం లేదు. భీమా పాలసీలే ఇప్పుడు సామాన్యుల ప్రాణాలకు యమ పాశాలుగా మారుతున్నాయి. డబ్బు కోసం కట్టుకున్న భర్తను,ప్రాణ స్నేహితుడి ప్రాణాలు తీస్తున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వెలుగు చూస్తున్న ఘటనలు వరుసగా వెలుగుచూడడం కలకలం రేపుతోంది.
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యే భర్తను హత్య చేయించిన ఘటన తాజాగా ఖమ్మంలో వెలుగు చూసింది. ఈనెల 2న ఖమ్మం - కురవి ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి. మృతుడిని ఖమ్మం పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన
చాగంటి రవి (42)గా నిర్ధారించారు. రవి భార్య చాగంటి ప్రశాంతితో పాటు డి. శ్రీనివాస్ పై అనుమానం ఉన్నట్టు బంధువులు ఫిర్యాదు చేశారు. ఈ దిశగా పోలీసులు విచాణ చేపడితే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రవికి, ప్రశాంతికి 20 ఏళ్ల క్రితం వివాహమైంది.వీరికి ఇద్దరు పిల్లలు. రవి పెయింటర్‌గా పనిచేసేవాడు. మద్యానికి బానిసగా మారిన అతను తరచూ భార్యతో గొడవపడేవాడు. అంతేకాదు రవి అనారోగ్యానికి గురయ్యాడు. అయితే ఈ పరిస్థితుల్లో రవి చనిపోతాడని ప్రశాంతి భావించింది. దీంతో భర్త పేరున ప్రశాంతి ఇన్సూరెన్స్ చేయించింది. అదే సమయంలో రవి పేరున ఓ కారును కూడా కొనుగోలు చేశారు. అయితే ఈ కారును రవి బంధువు దేశబోయిన శ్రీనివాస్ ట్రావెల్స్ లో నడుపుతున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈఎంఐలు కూడా శ్రీనివాస్ చెల్లిస్తున్నారు. అయితే రవి చనిపోతే ఆయనపై ఉన్న ఇన్సూరెన్స్ క్లైయిమ్ చేసుకోవచ్చు. కారు కూడా స్వంతం అవుతుందని భార్య ప్రశాంతి భావించారు. ఈ విషయంలో రవిని చంపాలని ప్రశాంతి ప్లాన్ చేశారు. ఇందుకు రవి బంధువు శ్రీనివాస్ సాయం తీసుకుందని పోలీసులు తెలిపారు. రవిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని ప్రశాంతి, శ్రీనివాస్ నిర్ణయించుకున్నారు. ఈ నెల 2న శ్రీనివాస్ తన ఆటోలో రవిని తీసుకెళ్లారు. మార్గమధ్యలో అతనికి మద్యం తాగించారు.ఖమ్మం రూరల్ మండలం ఎంవీపాలెం శివారు ప్రాంతంలో వదిలివెళ్లిపోయారు. మద్యం మత్తులో అక్కడే తిరుగుతున్న రవిని జోగి వెంకటేశ్, జోగి రాజ్ కుమార్ ప్లాన్ ప్రకారమే వేగంగా కారు నడుపుతూ వెనుక నుంచి ఢీకొట్టి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ హత్యకు చిలుక్కాయలపాడుకు చెందిన జోగి రాంబాబు సహకరించినట్టు పోలీసులు తెలిపారు. తన భర్త హత్యతో తనకు సంబంధం లేదని మృతురాలి భార్య ప్రశాంతి చెబుతున్నారు. రవి కుటుంబసభ్యులే తనను ఈ కేసులో ఇరికించారని ఆమె ఆరోపిస్తున్నారు.
ఇలాంటి ఘటనే గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.భద్రాచలం ఎల్ ఐసీ బ్రాంచ్ పరిధిలోబతికున్న 39 మందిని రికార్డుల్లో చంపేసి రూ. 1.52 కోట్లు కొట్టేసిన ఏజెంట్ల నిర్వాకం భీమా రంగంలో ఉన్న లొసుగులను బట్టబయలు చేస్తోంది. ప్రాణం కంటే ప్రీమియమే ఎక్కువై పోయిన ఈ డెత్ స్కామ్స్ వెనుక ఉన్న మాఫియా నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో పోలీసులున్నారు.భధ్రాధ్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలానికి చెందిన భార్యాభర్తలు సరస్వతి, వెంకటేశ్వర్లు భద్రాచలం ఎల్ఐసీ బ్రాంచీలో ఏజంట్లుగా పనిచేస్తున్నారు. ఎల్ఐసీ పాలసీ క్లైయిమ్స్ ను అక్రమ పద్దతుల్లో కాజేయాలని ఈ ఇద్దరు ప్లాన్ చేశారు. అశ్వాపురంకు చెందిన పలువురిని పాలసీదారులుగా ఎంపిక చేసుకున్నారు. వారిపేరుతో ఐదేళ్ల క్రితం నుంచి ప్రీమియం వెంకటెశ్వర్లు, సరస్వతి ప్రీమియం చెల్లించారు. ప్రీమియం తీసుకున్న పాలసీదారులు మృతిచెందినట్లు ఫేక్ డెత్ సర్టిఫికెట్లు సృష్టించి పాలసీలు క్లైయిమ్ చేశారు.నిరుపేదలను , నిరక్షరాస్యులను ఎంపిక చేసుకున్నారు. భీమా పరిహారాన్ని కాజేశారు. ఒకే ప్రాంతం నుంచి అత్యధికంగా డెత్ క్లెయిమ్ లు రావడంతో ఎల్ఐసీ బ్రాంచ్ మేనేజర్‌కు అనుమానం వచ్చింది. దీంతో ఆయన అంతర్గతంగా విచారణ చేయించారు.డెత్ క్లెయిమ్ లు పొందిన సుమారు 39 మంది సజీవంగా ఉందని ఆ బృందం గుర్తించింది. ఫేక్ డెత్ క్లెయిమ్ లతో సుమారు కోటిన్నరకు పైగా అక్రమంగా ఏజెంట్లు ఆర్జించారని తేలింది. తమ సంస్థను మోసగించారంటూ ఇరువురు ఏజెంట్లపై భధ్రాచలం పోలీస్ స్టేషన్లో భధ్రాచలం ఎల్ఐసీ బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కేసు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇక మరో ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే జరిగింది. ఏపీలోని ఎటపాక మండలానికి చెందిన యశ్వంత్ పేరిట 2.55 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. ఆ డబ్బు కోసం అతడిని చంపేందుకు కుట్ర పన్నిన ఇద్దరు స్నేహితులు సాయిదీపక్, భానుప్రకాష్‌లను పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరి 18న అరెస్ట్ చేశారు.
ఏపీలోని పోలవరం జిల్లా ఎటపాక మండలం గన్నవరానికి చెందిన కట్టా యశ్వంత్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. గ్రామంలో మేనమామ సంరక్షణలో పెరిగాడు. అతనికి ఆరు నెలల క్రితమే భద్రాచలానికి చెందిన కట్టా సాయిదీపక్‌తో స్నేహం ఏర్పడింది. ఈ పరిచయాన్ని ఆసరాగా తీసుకుని సాయిదీపక్ దురుద్దేశంతో పథకం రచించాడు. అతనికి ఓ ప్రైవేటు బ్యాంకులో సేల్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్న భానుప్రకాష్ జత కలిశాడు. ఇద్దరూ కలిసి యశ్వంత్‌ను మోసం చేసి అతని పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు.
యశ్వంత్, సాయిదీపక్‌ల సామాజిక వర్గాలు వేర్వేరు అయినప్పటికీ ఇంటి పేరు ఒకటే కావడంతో అనుమానం రాకుండా సాయిదీపక్‌ను నామినీగా చేర్చారు. పాలసీ తీసుకున్న తరువాతే అసలు పథకం అమల్లోకి వచ్చింది. యశ్వంత్‌ను హతమార్చి, దాన్ని రోడ్డు ప్రమాదంగా చూపించి బీమా సొమ్మును స్వాధీనం చేసుకోవాలన్న దురాలోచనతో కుట్ర పన్నారు.
ఫిబ్రవరి 14నమోతె పట్టినగర్ సమీపంలో యశ్వంత్‌ను మద్యం తాగించారు. తిరిగి వెళ్లే సమయంలో అతని తలపై ఇనుప రాడ్‌తో తీవ్రంగా కొట్టారు. రక్తమోడుతున్న స్థితిలో రహదారి మీద పడేసి, పక్కనే స్కూటీని ఉంచి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.అదే మార్గంలో వెళ్తున్న ప్రయాణికులు రక్తం మడుగులో ఉన్న యశ్వంత్‌ను గమనించి వెంటనే అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. అయితే అక్కడే ఉన్న సాయిదీపక్, భానుప్రకాష్ కూడా యశ్వంత్ ను ఆసుపత్రికి తరలించేందుకు సహకరించారు. యశ్వంత్ పై దాడి ఘటనపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేసిన పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. యశ్వంత్ ను హత్య చేసి అతని పేరిట ఉన్న రెండు కోట్ల ఇన్సూరెన్స్ సొమ్మును పొందేందుకు సాయిదీపక్, భానుప్రకాష్ ప్లాన్ చేశారని గుర్తించారు. ఈ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యలను రోడ్డు ప్రమాదాలుగా చిత్రీకరించే ఇన్సూరెన్స్ క్లైయిమ్ చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయనే ఆరోపణలు కూడా లేకపోలేదు. బయటకు రాని ఘటనలు ఇంకా ఎన్ని ఉన్నాయనే విషయమై స్పష్టత రాలేదు.
Follow Us