/rtv/media/media_files/2025/02/09/ypMkmGwZMiAM7RjTYmwN.webp)
Rajaiah Vs Kadiyam Srihari
Bye Elections : ఎమ్మెల్యేల అనర్హత పిటిషిన్‌పై కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టు పరిధిలో ఉందని.. ఈనెల 10వ తేదిన తీర్పు రాబోతుందని చెప్పారు. కోర్టు తీర్పును తప్పకుండా పాటిస్తామని.. అందులో వెనక్కి పోయేదిలేదన్నారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే తప్పకుండా బరిలో ఉంటానని స్పష్టం చేశారు.'బీఆర్ఎస్ స్వార్థ రాజకీయాలు చేస్తుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మంచిది. ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రులు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే. అప్పట్లో ఫిరాయింపులను ప్రోత్సహించిన బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు సుద్దపూసల్లాగా మాట్లాడుతున్నారు. ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదు. గులాబీ పార్టీ చేస్తే సంసారం.. వేరే పార్టీ చేస్తే వ్యభిచారమా?' అని కడియం శ్రీహరి ప్రశ్నించారు.
ఇది కూడా చూడండి: Pakistan PM : పరువు తీయొద్దు .. భారత్ పై గెలవండి..కప్ తీసుకురండి : పాక్ ప్రధాని
'ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే కేటీఆర్ సంతోషపడుతున్నారు. అక్కడ ఆప్ ఓడిపోవడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్. లిక్కర్ స్కాంతోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. దీనికి కారణం బీఆర్ఎస్‌తో స్నేహం చేయడమే. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్- కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేస్తే బాగుండేది. కేజ్రీవాల్ అతిగా ఊహించుకుని ఒంటరిగా వెళ్లడంతో ఓటమి చవి చూశారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే బీజేపీకి అవకాశం ఉండేది కాదు' అని కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చూడండి: Sankranthiki Vasthunam: వెంకీ మామ ఫ్యాన్స్ గెట్ రెడీ.. యూట్యూబ్ లో 'గోదారి గట్టు మీద' సాంగ్ ఫుల్ వీడియో
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇటీవల అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా.. లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీకి నోటీసులు పంపించారు. అయితే.. కేసీఆర్ కూడా ఆనాడు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు.. వాళ్లను అప్పుడు డిస్‌క్వాలిఫై చేశారా.. అని నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. న్యాయ నిపుణులతో చర్చించి.. తగు నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు.
కాగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కడియం శ్రీహరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడియం కక్ష సాధింపు చర్యలు, కుట్ర రాజకీయాలు చేస్తున్నాడన్నారు.. టీడీపీలో ఉన్నప్పుడు అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు చేశారని దుయ్యబట్టారు. దౌర్జన్యాలు చేస్తూ ఎందరినో ఎన్‌కౌంటర్లు చేయించాడు. ఈ ఆరు నెలల్లో ఏడుగురిపై అక్రమ కేసులు పెట్టించాడు. స్టేషన్ ఘనపూర్ ప్రజలను నమ్మించి మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తాడని కడియంను గెలిపించారు.. ఇప్పుడు బీఆర్ఎస్‌కు అక్కరకురాని వాడయ్యాడని మండిపడ్డారు. కుక్కిన పేనులా ఉండకుండా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవితలను తిడుతున్నాడు.. కడియం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పేర్కొన్నారు. అప్రజాస్వామికంగా, నైతిక విలువలు లేకుండా గెలిచిన పార్టీకి, పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారాడు.. తగదునమ్మా అని అభివృద్ధి కోసం అంటూ కల్లబొల్లి మాటలు చెప్తున్నాడు.. 13 నెలలు అయింది, ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదని కడియం శ్రీహరిని విమర్శించారు.
Also Read: ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం ఎప్పుడంటే ?
అయితే రాజయ్య మాటలను కడియం ఖండించారు.చేతగానివారు, చేవలేని, అవినీతి పరులు ఇప్పుడు మాట్లాడు తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఘనపూర్ నియోజకవర్గానికి నిధులు వచ్చాయి.. ఘనపూర్‌ను మున్సిపాలిటీ చేసుకున్నామని అన్నారు. రూ.800 కోట్ల నిధులకు ఉత్తర్వులు వచ్చాయి.. మరో 200 కోట్లకు ఉత్తర్వులు రావాలని తెలిపారు. మొత్తంగా 13 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే ఘనపూర్‌కు రూ.1000 కోట్ల నిధులు వచ్చాయని చెప్పారు. ఎవరెన్ని మాట్లాడినా నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని కడియం శ్రీహరి అన్నారు. రాజయ్య 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి.. పదేళ్లు ప్రభుత్వం ఉన్నప్పటికీ చిన్న చిన్న పనులు కూడా చేయలేక పోయారని ఆరోపించారు. ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధిని, ప్రజలకు ఇచ్చిన మాటను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ సహకారం కోసం పార్టీ మారానని కడియం శ్రీహరి పేర్కొన్నారు.
Also Read: ఢిల్లీ బీజేపీ మాజీ సీఎంలు వీళ్లే.. ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు!