/rtv/media/media_files/2026/03/10/kavitha-2026-03-10-08-51-53.jpg)
Kavitha Arrest
Kavitha Arrest : ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్ భూమిలో ఇండ్ల కూల్చివేత అంశం రాష్ర్ట వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయమై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం అక్కడ పర్యటించారు. బాధితులతో మాట్లాడిన ఆమె వారికి న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈ నేపథ్యంలో నిర్వాసితులకు స్థానిక నగరంలోని జడ్పీ సెంటర్‌లో పునరావాసం కల్పించగా కార్యకర్తలతో కలిసి అక్కడికి చేరుకున్న కవిత జడ్పీ సెంటర్‌లో అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. అయితే నాలుగు గంటల పాటు ఆమె దీక్ష కొనసాగించడంతో ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం రాత్రి 8గంటల సమయంలో వారిని వదిలేశారు. అయితే ఆ తర్వాత ఆమె హైదరాబాద్ వెళతారని పోలీసులు అనుకోగా ఆనుహ్యంగా ఆమె తిరిగి ఖమ్మం అంబేద్కర్ భవన్‌కు చేరుకుని నిరాహార దీక్షకు దిగారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐకాస రాష్ట్ర ఛైర్మన్ విశారదన్ మహారాజ్‌తో కలిసి ఆమె సోమవారం రాత్రి నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో రాత్రంతా అక్కడ హైడ్రమా కొనసాగింది.
ఈ సందర్బంగా పునరావాస కేంద్రంలో ఉన్నవారి సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు.. ఆందోళనలో కవిత మాట్లాడుతూ జిల్లాలో ముగ్గురు మంత్రులుండి పేదలకు న్యాయం చేయలేరా అని నిలదీశారు. కాగా అర్థరాత్రి నుంచి నిరాహారదీక్ష చేస్తున్న కవిత దీక్షను అడ్డుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అరెస్ట్ చేసినా తన దీక్ష కొనసాగిస్తానని కవిత స్పష్టం చేశారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతానన్నారు.
కవిత సహా 45 మందిపై కేసు..
కాగా, వెలుగుమట్ల భూదాన్ భూములపై నిన్నంతా ఖమ్మంలో ఉద్రిక్తత నెలకొంది. బాధితులను పరమార్శించడానికి వచ్చిన కవిత వారితో కలిసి ఆందోళనకు దిగడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆమె అనుహ్యంగా ఖమ్మం జడ్పీసెంటర్‌లో ధర్నా నిర్వహించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ రాష్ట్ర చైర్మన్ విశారదన్ మహారాజ్ సహా 45 మందిపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయినా ఆమె మరోసారి దీక్షకు దిగడంతో ఆమెతో పాటు 45 మందిపై కేసు నమోదు చేశారు. ధర్నా వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిందని, ఓ కానిస్టేబుల్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నగర ఏసీపీ రమణమూర్తి తెలిపారు. కాగా, ఈ కేసులో 45 మందిలో ఖమ్మం జిల్లాతో సంబంధం లేని 33 మంది నిజామాబాద్, వనపర్తి, నల్లగొండ, కామారెడ్డి, హన్మకొండ, హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చి అంబేడ్కర్ భవన్ ఆవరణలో ఉన్న బాధితులను తప్పుదోవ పట్టించి, రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశారని పోలీసులు పేర్కొన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Follow Us