గాల్లో 4 గంటల నరకం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ప్రయాణికులు!

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఫ్లై91 ఎయిర్‌లైన్స్‌కు చెందిన IC3401 విమానం హుబ్బళ్లికి బయలుదేరింది. ప్రయాణం సాఫీగానే సాగుతోందనుకుంటున్న తరుణంలో, హుబ్బళ్లిని సమీపిస్తుండగా విమానంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది.

New Update
flight

ఇటీవల విమాన ప్రయాణాల్లో సాంకేతిక సమస్యలు తరుచూ సంభవిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి హుబ్బళ్లి బయలుదేరిన విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తింది. ఫ్లై91 ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు గగనతలంలో నరకప్రాయ అనుభవాన్ని ఎదుర్కొన్నారు. గాలిలో ఉండగానే సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం గమ్యం చేరకుండానే 4 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఆదివారం 3 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఫ్లై91 ఎయిర్‌లైన్స్‌కు చెందిన IC3401 విమానం హుబ్బళ్లికి బయలుదేరింది. ప్రయాణం సాఫీగానే సాగుతోందనుకుంటున్న తరుణంలో, హుబ్బళ్లిని సమీపిస్తుండగా విమానంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్లు అప్రమత్తమై ల్యాండింగ్ ప్రణాళికను మార్చాల్సి వచ్చింది.

నరకప్రాయమైన 4 గంటలు..

సాంకేతిక సమస్య కారణంగా విమానం అదుపు తప్పినట్లు అనిపించడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. విమానం ముండ్‌గోడ్, దావణగెరె, శివమొగ్గ వంటి ప్రాంతాలపై సుమారు నాలుగు గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఈ సమయంలో విమానం కుదుపులకు గురవ్వడంతో ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక అరుపులు, కేకలతో విమానం నిండిపోయింది. కొందరు ప్రయాణికులు సీట్లను గట్టిగా పట్టుకుని వణికిపోగా, మరికొందరు ప్రాణాలు పోతాయేమోనన్న భయంతో కన్నీటి పర్యంతమయ్యారు. ఆ టైంలో ప్యాసింజర్ల ఆర్తనాధాల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సురక్షిత ల్యాండింగ్.. ఆపై విమర్శలు

సుమారు 4 గంటల హై టెన్షన్ తర్వాత రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఈ విమానం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ ఘటనపై ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమానం గాలిలో చిక్కుకున్న సమయంలో ఎయిర్‌లైన్స్ యాజమాన్యం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని, సరైన అప్‌డేట్స్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడుతున్నారు. సాంకేతిక లోపం జరిగిన సమయంలో ప్రయాణికుల భద్రతతో పాటు, వారి బంధువులకు సమాచారం అందించడం కూడా బాధ్యతని, కానీ యాజమాన్యం ఆ విషయంలో విఫలమైందని ఆరోపిస్తున్నారు. ప్రయాణికులు క్షేమంగా ఉన్నప్పటికీ, ఆ 4 గంటల భయం మాత్రం వారిని ఇంకా వెంటాడుతోంది.

Advertisment
తాజా కథనాలు