/rtv/media/media_files/2026/06/04/hyderabad-2026-06-04-18-08-22.jpg)
హైదరాబాద్ లోని అమీర్‌పేట్ మెయిన్ రోడ్డుపై జరిగిన ఘోర అగ్నిప్రమాదం కేవలం షాపుల దహనంతోనే ఆగకుండా, మెట్రో వ్యవస్థకు కూడా ముప్పు తెచ్చేలా కనిపిస్తోంది. మంటలు చెలరేగిన భవనానికి కేవలం అడుగు దూరంలోనే మెట్రో పిల్లర్ ఉండటంతో.. ప్రమాద తీవ్రతకు ఆ పిల్లర్ కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అక్కడ ఉన్న 1043 నంబర్ మెట్రో పిల్లర్‌కు అగ్ని సెగలు బలంగా తాకాయి.
ఈ క్రమంలో సదరు పిల్లర్‌కు స్వల్పంగా క్రాక్ వచ్చినట్లు అధికారులు గుర్తించడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగుతోంది. భారీ మంటల వల్ల పిల్లర్ కాంక్రీట్, లోపలి ఇనుప కడ్డీల సామర్థ్యం ఏమైనా తగ్గిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలియగానే మెట్రో ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. ముందు జాగ్రత్త చర్యగా పిల్లర్ నాణ్యతను, గట్టిదనాన్ని అత్యవసరంగా పరీక్షించడానికి జేఎన్‌టీయూ రక్షణ విభాగ నిపుణుల కమిటీని రంగంలోకి దించారు.
పిల్లర్ ఎంతవరకు దెబ్బతింది?
ప్రస్తుతం జేఎన్‌టీయూ నిపుణుల బృందం ప్రమాద స్థలానికి చేరుకుని అత్యాధునిక, ప్రత్యేక డివైజ్‌లతో పిల్లర్ సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తోంది. మంటల వేడికి పిల్లర్ ఎంతవరకు దెబ్బతింది? రైళ్ల రాకపోకల భారాన్ని అది మోయగలదా? లేదా? అనే విషయాలపై శాస్త్రీయంగా లెక్కిస్తున్నారు. అమీర్‌పేట్ రూట్ అత్యంత రద్దీగా ఉండే మార్గం కావడంతో, ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ పరీక్షలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
జేఎన్‌టీయూ నిపుణులు ఇచ్చే తుది నివేదిక ఆధారంగానే మెట్రో అధికారులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఒకవేళ పిల్లర్‌కు ఏమైనా రిపేర్లు అవసరమైతే ఆ పనులు చేపట్టడం లేదా రైళ్ల వేగాన్ని నియంత్రించడం లాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా, అమీర్‌పేట్ అగ్నిప్రమాదం ఇప్పుడు మెట్రో ప్రయాణికుల్లో కాస్త టెన్షన్ పుట్టిస్తోంది.
Follow Us