Land Scam : శంషాబాద్‌లో భారీ భూ కుంభకోణం.. ప్రభుత్వ భూముల కేటాయింపుపై వివాదాస్పద ఉత్తర్వులు

రాష్ట్ర రాజధానికి సమీపంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న శంషాబాద్‌ మండలంలోని పెద్ద షాపూర్‌ ప్రాంతంలో ప్రభుత్వ భూముల కేటాయింపుపై తీవ్ర వివాదం నెలకొంది. రూ.కోట్లు విలువ చేసే భూమిని స్థానిక తహసీల్దార్‌ ఒక ప్రైవేటు వర్గానికి అనుకూలంగా కేటాయించినట్లు సమాచారం.

New Update
FotoJet - 2026-05-22T205730.512

Shamshabad Land Scam

Land Scam : రాష్ట్ర రాజధానికి సమీపంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న శంషాబాద్‌ మండలంలోని పెద్ద షాపూర్‌ ప్రాంతంలో ప్రభుత్వ భూముల కేటాయింపుపై తీవ్ర వివాదం నెలకొంది. హైస్పీడ్‌ కారిడార్‌, ప్రతిపాదిత భారీ బస్‌ టెర్మినల్‌, పారిశ్రామిక విస్తరణల కారణంగా ఈ ప్రాంత భూముల విలువ భారీగా పెరిగిన నేపథ్యంలో, సుమారు 270 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూముల వ్యవహారం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశమైంది.పెద్ద షాపూర్‌ పరిధిలోని సర్వే నంబర్లు 172 నుంచి 180 వరకూ ఉన్న సుమారు 94.73 ఎకరాల భూమి ప్రభుత్వ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగానే నమోదై ఉన్నట్లు సమాచారం. అయితే ఈ భూమిపై కొంతకాలంగా ప్రైవేటు వ్యక్తుల హక్కుల వాదనలు కొనసాగుతున్నాయి. సాధారణంగా ఇలాంటి భూములపై తుది నిర్ణయం ప్రభుత్వ స్థాయిలో, ముఖ్యంగా రెవెన్యూ శాఖ ఉన్నతాధికారుల ఆమోదంతో తీసుకోవాల్సి ఉంటుంది.కానీ ఈ కేసులో స్థానిక తహసీల్దార్‌ స్వయంగా ఉత్తర్వులు జారీ చేసి, సంబంధిత భూమిని ఒక ప్రైవేటు వర్గానికి అనుకూలంగా కేటాయించినట్లు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరి 28న దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ జారీ కావడం రెవెన్యూ వర్గాల్లో ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే ఒక సహకార సంఘం వైస్‌ చైర్మన్‌ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మద్దతుతోనే స్థానిక అధికారుల స్థాయిలోనే నిర్ణయాలు జరిగాయని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాధారణంగా రెవెన్యూ కార్యదర్శి, సీసీఎల్‌ఏ స్థాయిలో పరిశీలన జరగాల్సిన అంశాల్లో తహసీల్దార్‌ స్వతంత్రంగా వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.ఇప్పటికే 94 ఎకరాల భూమిపై ఉత్తర్వులు వెలువడగా, మరో 176 ఎకరాల భూమికి సంబంధించిన ఫైళ్లు కూడా సిద్ధమవుతున్నాయనే సమాచారం బయటకు రావడంతో వివాదం మరింత ముదిరింది. ఈ రెండు భూభాగాలను కలిపితే మొత్తం విలువ రూ.1000 కోట్లకు పైగానే ఉంటుందని రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.2023లో ఇదే ప్రాంతంలో జరిగిన హెచ్‌ఎండీఏ భూముల వేలంలో గజం ధర సుమారు రూ.30 వేల వరకు పలకడం గమనార్హం. ప్రస్తుతం అక్కడ ఎకరా ధర రూ.5 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు ఉందని స్థానిక రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు చెబుతున్నాయి.

 సర్వే నంబరు 626/1 పరిధిలోని భూముల విషయంలో ఇప్పటికే క్రిమినల్‌ కేసులు నమోదై ఉన్నాయని తెలిసినా, వాటిపై కూడా ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా చర్యలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎస్‌-7 పరిధిలోకి రాని భూములను కూడా ఆ కేటగిరీలో చూపించి నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు రెవెన్యూ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఇప్పటికే ప్రాథమిక సమాచారం సేకరిస్తోందని తెలుస్తోంది. సంబంధిత తహసీల్దార్‌ను పిలిపించి ఆయన జారీ చేసిన ఉత్తర్వులపై వివరణ తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే ప్రభుత్వ ఉన్నత స్థాయిలో కూడా ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తమవుతోందని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.

 ప్రభుత్వ భూముల విషయంలో విధివిధానాలు పక్కనపెట్టి తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద న్యాయపరమైన చిక్కులకు దారితీయవచ్చని రెవెన్యూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కోర్టులో తుది తీర్పు వెలువడకముందే భూములపై హక్కులు బదిలీ చేసేలా ఉత్తర్వులు ఇవ్వడం చట్టపరమైన వివాదాలకు కారణమవుతుందని వారు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు శంషాబాద్‌ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర రెవెన్యూ శాఖలో కూడా తీవ్ర చర్చకు దారితీసింది.

Advertisment
తాజా కథనాలు