/rtv/media/media_files/2026/01/26/gig-workers-2026-01-26-19-55-24.jpg)
Telangana gig workers
Telangana gig workers : తెలంగాణలో పనిచేస్తున్నలక్షలాది మంది గిగ్ వర్కర్ల(ఉబర్, స్విగ్గీ, జోమాటో, జెప్టో, ర్యాపిడో ) కోసం ప్రభుత్వం ఒచ సమగ్ర చట్టం తీసుకురావాలని భావిస్తోంది. గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమం లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపై చట్టం తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రూపొందించిన‘తెలంగాణ ప్లాట్‌ఫామ్- ఆధారిత గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం బిల్లు-2025’కు ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మేడే లోపు ముసాయిదా బిల్లుకు సంబంధించి రూల్స్ అని రాసుకుని ఆ రోజునుంచే చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.
కాగా ఈ చట్టం అమల్లోకి వస్తే అసంఘటిత కార్మిక రంగానికి చెందిన సుమారు 3 నుంచి 4 లక్షల మంది గిగ్ వర్కర్లకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వారిని ప్రత్యేక శ్రామిక వర్గంగా గుర్తించడంతో పాటు వారికి ఉద్యోగ భద్రత, బీమా, ఆరోగ్య పథకాలను రూపొందించడానికి అవకాశం ఉంటుంది. ఇటీవలె కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సామాజిక భద్రత కోడ్ 2020 ముసాయిదా బిల్లు లోని నిబంధనలకు తగినట్లు కొన్ని మార్పులు చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దేశంలో ఇప్పటికే రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలు గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించాయి. అదే స్ఫూర్తితో తెలంగాణలో కూడా అలాంటి చట్టాన్ని తీసుకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాక గిగ్ వర్కర్లందరినీ వ్యవస్థీకృత పరిధిలోకి తేవాలని కూడా భావిస్తోంది.దీనికోసం ఒక వెబ్ పోర్టల్, స్మార్ట్ ఫోన్ యాప్‌ను కూడా తీసుకురానుంది. ఈ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. అలా రిజిస్టర్ అయిన వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ బోర్టు అందించే లాభాలు నేరుగా వారికే అందే అవకాశం ఉంది. ఈ బిల్లు ఆమోదం పొంది చట్టం అమల్లోకి వస్తే అగ్రిగేటర్లు (ఓలా, ఉబర్, స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలు) ప్రతి లావాదేవీపై 1 నుంచి 2 శాతం సెస్ చెల్లించాల్సి ఉంటుంది. అలా వచ్చిన నిధిని నేరుగా గిగ్ వర్కర్ల సంక్షేమ నిధికి మళ్లించడం దీని ఉద్ధేశం అంతేకాక కొత్త బిల్లు ప్రకారం గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేక ‘వెల్ఫేర్ బోర్డు’ ఏర్పాటు చేస్తారు. ఈ బోర్డు రిజిస్ట్రేషన్, సంక్షేమ పథకాల అమలు, నిధుల పర్యవేక్షణ వంటి వాటిని చూసుకుంటుంది. చట్టం అమల్లోకి వస్తే ఏ వర్కర్‌ను కూడా అకారణంగా లేదా ఉన్నపళంగా తొలగించ డానికి వీలుండదు. తప్పనిసరిగా ఏడు రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.
Follow Us